R. Narayana Murthy : ఓ అమ్మాయిని ప్రేమించిన నారాయణ మూర్తి.. కానీ చివరకు!
ప్రముఖ నటుడు ఆర్. నారాయణమూర్తి తన యుక్తవయసులో ఓ యువతితో ప్రేమలో పడ్డారంట. అయితే కొన్ని కారణాల వలన వీరి పెళ్లి నిలిచిపోయిందట.
- kunduru Vinod
- Published On : August 30, 2021 / 11:32 AM IST
R. Narayana Murthy
R. Narayana Murthy : ఆర్ నారాయణ మూర్తి.. ఎమోషన్స్ పండించడంలో సిద్ధహస్తుడు. విప్లవ సినిమాల్లో నటిస్తూ.. దర్శకుడిగా తెరకెక్కిస్తూ తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎర్రసైన్యం, చీమలదండు ఒరేయి రిక్షా, వీరతెలంగాణ వంటి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నారు. కమ్యూనిస్ట్ భావజాలం అధికంగా ఉండే నారాయణ మూర్తి సినిమాలను తెలుగు ప్రేక్షకులు అమితంగా ఇష్టపడతారు. నారాయణ మూర్తి సినిమాల్లో అధికంగా పేదల గురించి తీసినవే ఉంటాయి. పేదల బతుకుదెరువు, కులవృత్తులపై అనేక సినిమాలు తీశారు మూర్తి.
డైరెక్టర్ గా, యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నారాయణమూర్తి.. పెళ్లి చేసుకోలేదు. అయితే దీనికి కారణం ఉందంటున్నారు మూర్తి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మూర్తి తన జీవిత విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని అందమైన జీవితం గడపాలని మూర్తి కలలుకన్నారట. అయితే తన లవ్ ఫెయిల్ అయిందని చెప్పుకొచ్చారు.
ఆర్. నారాయణమూర్తి యుక్త వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డారట. ఆమెని పెండ్లి చేసుకోవాలని అనుకున్నారట. ఇదే విషయం అమ్మాయి కుటుంబంతో కూడా చెప్పారు. కానీ కులాలు వేరుకావడంతో పాటు.. నారాయణమూర్తి నటుడిగా ఉండటం అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చలేదు. దీంతో వాళ్లు పెండ్లికి ఒప్పుకోలేదు. ఇష్టపడిన అమ్మాయి దక్కకపోవడంతో నారాయణమూర్తికి పెళ్లిపై విరక్తి వచ్చిందట. ఇక అదే సమయంలో సినిమా ఆఫర్లు క్యూ కట్టడంతో అసలు పెళ్లి ముచ్చటే మరిచిపోయారు.
ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ తన మనసులోని బాధను వ్యక్తపరిచారు. జీవితంలో ప్రతి మనిషికి మరో మనిషి తోడుండాలని, ఆలా లేకపోతే జీవితంలో చాలా కోల్పోతామని తెలిపారు నారాయణ మూర్తి. ఏ వయసులో చెయ్యాల్సిన పని ఆ వయసులో చేయాలని యూత్ కు మెసేజ్ ఇచ్చారు. యువకులు పెళ్లి చేసుకోకుండా ఉండొద్దని సూచించారు.
ఇదే సమయంలో ఆయన జీవితంలోని మరో ఘటన గురించి కూడా నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. తన అమ్మ నాన్న ఎంతో మంచివాళ్లని.. కాకపోతే వారికి కులం పట్టింపులు ఎక్కువగా ఉండేవని తెలిపారు. అలా ఒకసారి తాను అంటరాని వ్యక్తిని ఆలింగనం చేసుకున్నానే కారణంతో ఇంట్లో నుంచి గెంటేశారని ఎమోషనల్ అయ్యాడు.
