Anakapalli : షూటింగ్ మొత్తం అనకాపల్లిలోనే.. సెన్సార్ వాళ్ళు కట్స్ వద్దని.. ‘అనకాపల్లి’ నిర్మాతలు..
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. (Anakapalli)
- Saketh U
- Published on- August 5, 2026 / 10:55 AM IST
Anakapalli
Anakapalli : భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్స్ పై కాండ్రేగుల నాయుడు, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాణంలో తెరకెక్కిన ‘అనకాపల్లి’ సినిమా ఆగస్టు 7న రిలీజ్ కానుంది. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ముఖ్య పాత్రల్లో ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
నిర్మాతగా మారిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. నాయుడు అనకాపల్లిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇండస్ట్రీలోకి వస్తానని ఎప్పుడూ అనేవాడు. నేను వద్దు అన్నా పట్టుదలతో ఇక్కడకు వచ్చి నిర్మాత అయ్యాడు. ఈ కథ నేనే రాసుకున్నాను. నేను మాత్రమే కాదు కొత్తవాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాలని వేరే దర్శకుడికి ఇచ్చాను. అతను నాతో పటు దాదాపు పదేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాడు. ఈ సినిమా మొత్తం అనకాపల్లిలోనే షూట్ చేశాం. లొకేషన్స్ రియల్‌గా ఉండాలని మా సొంత ఊర్లోనే తీశాం. ఓ టౌన్‌లో జరిగే లవ్ స్టోరీ ఇది. ఇప్పుడున్న జెన్ జీ తరానికి ఎమోషన్స్ తెలియడం లేదు. అందుకే ఫ్యామిలీ ఎమోషన్స్ అందరికి తెలియాలని ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా పెట్టి ఈ సినిమా తీసాను. అనుకున్న దానికంటే కొంచెం బడ్జెట్ ఎక్కువే అయింది.
నేను గతంలో డ్రామాలు వేసేవాడ్ని. ప్రతీ దర్శకుడిలో ఓ నటుడు ఉంటాడు. మా హీరో కూడా అడగడంతో నేనే ఈ సినిమాలో తండ్రి పాత్ర పోషించాను. ముందు మేం ఆగస్ట్ 7న రిలీజ్ అని ప్రకటించాము. అప్పుడు ఇన్ని సినిమాలు పోటీలో లేవు. కానీ ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక సినిమా పోటీలో ఉంటుంది. మా కంటెంట్ మీద మాకు నమ్మకం కూడా ఉంది. అందుకే డేట్ మార్చకుండా ఆగస్ట్ 7న రావాలని నిర్ణయించుకున్నాం. సెన్సార్ వాళ్ళు మొదట కట్స్ చెప్పారు కానీ అవి తీసేస్తే కథ డిస్టర్బ్ అవుతుందని వద్దు అని చెప్పి A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత ‘నేను రెడీ’ నా దర్శకత్వంలో త్వరలో రానుంది అని తెలిపారు.
మరో నిర్మాత కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ.. మా సొంత ఊర్లో షూట్ చేయడంతో ప్రతీ ఒక్కరూ మాకు సాయం చేశారు. రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం వల్ల అవుట్ పుట్ బాగా వచ్చింది. మొత్తం 75 లొకేషన్లలో షూటింగ్ చేశాం. త్రినాథరావు చెప్పిన కథ నాకు నచ్చింది. నేను ఏ మార్పులు చేర్పులు చేయలేదు ఇందులో.
ఓ సినిమా వెనకాల చాలా మంది కష్టం ఉంటుంది. సినిమా తీస్తే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. కష్టపడేది వాళ్లు అయినా పేరు మాత్రం మాకు వస్తుంది. అందుకే రెగ్యులర్‌గా సినిమాల్ని నిర్మించాలని అనుకుంటున్నాం. నాది, త్రినాథరావుది ఒకే ఊరు. హైదరాబాద్‌లోనే ఉన్నా త్రినాథరావు మనసు మాత్రం మాతోనే, మా ఊర్లోనే ఉంటుంది. నేను త్రినాథరావుతోనే సినిమాలు చేస్తాను అని తెలిపారు.
