Epic Review: ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ రివ్యూ.. ‘బేబీ’ జంట ఆనంద్ – వైష్ణవి కొత్త సినిమా ఎలా ఉందంటే..?

Epic Movie Review: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన బేబీ సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

  • Updated on- September 11, 2026 / 12:31 AM IST

Epic Review

Epic Review: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన సినిమా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో ’90s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే..

ఆదిత్య(ఆనంద్ దేవరకొండ) సినిమా డైరెక్టర్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. తండ్రి(శివాజీ), తల్లి(వాసుకి)తిట్టి, నచ్చచెప్పి యూకే కి చదువుకొని జాబ్ తెచ్చుకోడానికి లోన్లు తీసి మరీ పంపిస్తారు. అక్కడ ఆదిత్య మనోజ్(శ్రీను గవిరెడ్డి) ఫ్లాట్ ఖాళీ చేస్తుండటంతో అందులోకి వెళ్తాడు. ఆదిత్య యూకే వెళ్ళాక మొదటి రోజు కాలేజీలో కడలి(వైష్ణవి చైతన్య) పరిచయం అవుతుంది. కడలి కూడా చదువుకోడానికి యూకే వస్తుంది. మొదటి రోజే వీళ్ళు ఊరంతా తిరిగి ఎంజాయ్ చేసి క్లోజ్ అవుతారు. కడలి తనకు కూడా ఎవరు లేరు, ఫ్లాట్ రెంట్ కి కావాలి నీతో ఉంటాను అనడంతో ఆదిత్య ఒప్పుకుంటాడు. దాంతో ఆదిత్య, కడలి కలిసి ఒకే ఫ్లాట్ లో కలిసి ఉండి చదువుకుంటూ, పార్ట్ టైం జాబ్స్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీరిద్దరి మధ్య బంధం పెరిగి అది శృంగారం వరకు వెళ్తుంది. అయితే నో పెళ్లి – నో ఎమోషనల్ కనెక్షన్, చదువు అయ్యాక ఎవరి దారి వాళ్ళది అని అనుకుంటారు.

ఓ రోజు కడలి అందరి అమ్మాయిలకు ఉండే ఇంట్లో పెళ్లి ప్రెజర్ బాధలు, PCOD .. లాంటి రెగ్యులర్ సమస్యలు అన్ని ఆదిత్యకు చెప్పి ఎమోషనల్ అవుతుంది. దీంతో ఆదిత్య కూడా ఎమోషనల్ అయి తనని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి రిలేషన్ ఎలా మారింది? వీళ్ళ రిలేషన్ ప్రేమ, పెళ్లి వరకు వెళ్లిందా? ఆదిత్య రిలేషన్ లో అతని ఫ్రెండ్ సింజిత్(కళ్యాణ్ శంకర్) ఇచ్చిన సలహాలు ఏంటి? యూకేకి రావడానికి చేసిన అప్పులను ఆదిత్య తీరుస్తాడా? ఆదిత్య డైరెక్టర్ అవుతాడా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Mandaadi Review: ‘మండాడి’ మూవీ రివ్యూ.. సుహాస్ విలన్ గా నటించిన సినిమా.. సముద్రంపై పోటీ అదిరిందిగా..

సినిమా విశ్లేషణ..

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన బేబీ సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తుండటం, అది కూడా సూపర్ హిట్ 90s వెబ్ సిరీస్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో సినిమా కావడం, 90s వెబ్ సిరీస్ లో చిన్న పిల్లాడు ఆదిత్య పెద్దయ్యాక అతని కథ ఇది అని చెప్పడం, సాంగ్స్ హిట్ అవ్వడం, ట్రైలర్ లో రొమాంటిక్ టచ్ కూడా బాగానే ఉండటం, ప్రమోషన్స్ కి రష్మిక, విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ రావడంతో ఈ సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి.

ఫస్ట్ హాఫ్ హీరో పరిచయం, యూకేకి వెళ్లడం, అక్కడ వైష్ణవి పరిచయం, ఆమెతో రూమ్ షేర్ చేసుకోవడం, యూకేలో తిరగడం, ఆదిత్య – కడలి రొమాంటిక్ సీన్స్ తో సింపుల్ గా సరదాగా కామెడీతో కొన్ని రొమాంటిక్ సీన్స్ తో సాగిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ లో కడలి సమస్యలు చెప్పడం, సింజిత్ సలహాలు, ఆదిత్య పేరెంట్స్ బాధలు చెప్పడంతో వీళ్ళ రిలేషన్ ఇబ్బందులతో సాగుతుంది. సినిమా మొదటి 20 నిముషాలు ఇండియాలో జరుగుతుంది. ఆ తర్వాత మొత్తం అంతా యూకేలోనే.

ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా కామెడీతో ఫుల్ గా నవ్వించారు. కొన్ని క్యూట్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ మాత్రం బాగా సాగదీశారు. కానీ రియల్టీలో జరిగే చాలా సంఘటనలు ప్రస్తావించారు. ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లి అక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు స్వేచ్ఛ పేరుతో ఏం చేస్తున్నారు అనే విషయాన్నీ అంతర్లీనంగా బలంగానే చెప్పారు. ఇక రెగ్యులర్ మహిళల పీరియడ్స్, PCOD సమస్యలు కథకి బలమైన పాయింట్ అనుకునేలా చూపించారు కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇటీవల పీరియడ్స్ గురించి అన్ని సినిమాల్లో, బయట అందరూ సాధారణంగానే మాట్లాడుకుంటున్నారు. కానీ దాన్నే ఇందులో కొన్ని ఓవర్ డ్రమాటిక్ సీన్స్ తో చూపించడం గమనార్హం.

సింజిత్ తో పెళ్లితో వచ్చే కష్టాలు బాగానే చెప్పించారు. క్లైమాక్స్ లో అబ్బాయిలకు ఉండే బాధ్యతలను పర్ఫెక్ట్ గా చూపించారు. క్లైమాక్స్ లో పెళ్లి విషయంలో ఆదిత్య – కడలి మధ్య జరిగిన సంభాషణలు బాగానే సెట్ అయ్యాయి. కానీ వీళ్ళిద్దరూ మొదటిసారి పెళ్లి చేసుకోడానికి వెళ్ళినప్పుడు పెళ్లి ఆగిపోతుంది. అసలు అక్కడ ఎలా ఆగిపోయింది, కడలిని ఆదిత్య ఎలా కన్విన్స్ చేసాడు అనేది మాత్రం చూపించలేదు. ముందు నుంచి కడలి స్ట్రాంగ్ అన్నట్టు చూపించి చివర్లో ఎప్పట్లాగే అన్ని సినిమాల్లో లాగే హీరోయిన్ ని వీక్ చేసేసారు. ఇక ఆదిత్య ముందు నుంచి అమాయకుడు, అమ్మాయిలంటేనే తెలీదు అన్నట్టు చూపించి కొన్ని సీన్స్, చివర్లో మాత్రం ఆదిత్య అందరిలాంటి అబ్బాయే అన్నట్టు చూపించారు. సినిమాలో చాలా భాగం ఒకే గదిలో వీరిద్దరి మధ్య సంభాషణల రూపంలోనే సాగుతుంది.

పేరెంట్స్ కచ్చితంగా ఈ సినిమాని చూడాలి. విదేశాలకు వెళ్లి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లల ఆలోచనలు, ఆశలు ఏంటి అని తెలుసుకోడానికి ఈ సినిమా చూడాలి. అయితే యు/ ఏ ఇచ్చే సినిమాకు A సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో సెన్సార్ వాళ్ళకే తెలియాలి. టీజర్, ట్రైలర్స్ లో చూపించిన కొన్ని షాట్స్ సినిమాలో లేవు. ఈ సినిమా దర్శకుడు ఆదిత్య హాసన్ కూడా వనపర్తి నుంచి యూకేకి వెళ్లి అక్కడ చదువుకొని ఇక్కడకు వచ్చి దర్శకుడు అయ్యాడు. ప్రమోషన్స్ లో దర్శకుడి లైఫ్ లో, యూకే లో చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు అన్నారు కానీ సినిమా చూస్తే ఇది దర్శకుడి బయోపిక్ అనిపిస్తుంది. ఇది ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్. క్లైమాక్స్ లో కథ పూర్తి కాకుండా పార్ట్ 2 ఎపిక్ – ఫైనల్ సెమిస్టర్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్..

ఆనంద్ దేవరకొండ చాలా అమాయకపు పాత్రలో బాగా నవ్విస్తూ, రొమాంటిక్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటించాడు. వైష్ణవి చైతన్య కూడా కొత్త లుక్స్ లో క్యూట్ గా కనిపిస్తూ, ఎమోషనల్, రొమాంటిక్ సీన్స్ లో అదరగోట్టింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు వీళ్ళు బేబీ జంట అని మాత్రం గుర్తుకురాదు. అంత కొత్తగా, ఫ్రెష్ గా చేసారు ఇద్దరూ. ఈ సినిమాకు అది చాలా ప్లస్ అయింది. శివాజీ, వాసుకి హీరో పేరెంట్స్ పాత్రలో బాగానే మెప్పించారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ హీరో ఫ్రెండ్ పాత్రలో బాగా నవ్వించాడు, జీవిత సత్యాలు చెప్పాడు. శ్రీను గవిరెడ్డి కూడా అక్కడక్కడా బాగానే నవ్వించే ప్రయత్నం చేసాడు. మిగిలిన నటీనటులు.. అంతా వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.

Also Read : Maremma Review: ‘మారెమ్మ’ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడు కొడుకు హీరోగా మొదటి సినిమా.. ఎలా ఉందంటే?

సాంకేతిక అంశాలు..

ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్, పాటలు చాలా ప్లస్ అయ్యాయి. యూకే, లండన్ ని చాలా అందంగా చూపించారు. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా రిచ్ గా కనిపిస్తుంది. పాటలు అన్ని చాలా బాగున్నాయి. రిపీటెడ్ గా వినొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్వాలేదు. దర్శకుడు తన లైఫ్ లో జరిగిన సంఘటనలను తీసుకొని బాగానే రాసుకొని తెరకెక్కించినా సెకండ్ హాఫ్ లో కాస్త తడబడ్డాడు. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేయాల్సింది. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా విదేశాల్లో చదువుకోడానికి వెళ్లి ఒకే రూమ్ లో జీవించిన ఒక అమ్మాయి – అబ్బాయి మధ్య జరిగే కథ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.