Barabar Premistha Movie Review
Barabar Premistha : ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ జంటగా తెరకెక్కిన సినిమా బరాబర్ ప్రేమిస్తా. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మాణంలో సంపత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ఫిబ్రవరి 6న థియేటర్స్ లో రిలీజయింది.(Barabar Premistha)
రుద్రారం ఊళ్ళో ధర్మాని, కర్మాని అనే రెండు కులాలు ఉంటాయి. ఒక కులానికి ఇంకో కులానికి కొన్ని దశాబ్దాలుగా పడదు. ఎప్పుడూ ఆ ఊళ్ళో రెండు కులాల మధ్య గొడవలే. ఇక రెండు కులాల అమ్మాయి అబ్బాయి ప్రేమ అన్నారంటే వాళ్ళని చంపాల్సిందే. ఇలాంటి ఊళ్ళో చందు(చంద్రహాస్), బుజ్జమ్మ(మేఘన ముఖర్జీ) రెండు వేరువేరు కులాలకు చెందిన వాళ్ళు. బుజ్జమ్మ తండ్రి సర్పంచ్, చంద్రు తండ్రి సర్పంచ్ గా ఓడిపోతూ ఉంటాడు. మొదట బుజ్జమ్మ – చందు కూడా కొట్టుకుంటారు కానీ తర్వాత ప్రేమించుకుంటారు.
ఇదే ఊళ్ళో ఉంటే వీళ్ళ పెళ్లి జరగదు అని ఇద్దరూ లేచిపోయి కేరళ వెళ్తారు. మరి చందు – బుజ్జమ్మ కేరళలో పెళ్లి చేసుకుంటారా? మళ్ళీ రుద్రారంకు ఎందుకు తిరిగి వస్తారు? రెండు కులాల వాళ్ళు కలుస్తారా.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Laggam Time Review : ‘లగ్గం టైం’ మూవీ రివ్యూ.. పెళ్లి కొడుకు కిడ్నాప్ అయితే..
కులాంతర ప్రేమలు, వివాహాలు అనే కథాంశంతో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే కోవలోకి చెందింది. ఫస్ట్ అరగంట ఆ ఊళ్ళో గొడవలతో రొటీన్ బోరింగ్ సీన్స్ తో సాగదీశారు. చందు – బుజ్జమ్మ ప్రేమలో పడిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. వీరిద్దరూ లేచిపోయి కేరళ వెళ్లిన తర్వాత అక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చి ఆడియన్స్ కి షాక్ ఇస్తారు. దీంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది.
ఇక సెకండ్ హాఫ్ లో ఊర్లో రెండు కులాలు ఎలా కలుస్తారు, వాళ్లిద్దరూ ఊరికి తిరిగొస్తే ఏం జరిగింది అంటూ సాగదీశారు. సెకండ్ హాఫ్ లో మనుషులు అందరూ ఒకటే, ఈ గొడవలు ఎందుకు అని రెగ్యులర్ మెసేజ్ లు ఇచ్చారు. ప్రీ ఇంటర్వెల్ కి ట్విస్టులు రివీల్ చేసి మరోసారి ఆశ్చర్యపరుస్తారు కానీ ఆ ట్విస్ట్ ఊహించొచ్చు. అయితే క్లైమాక్స్ లో సినిమా అయిపోయింది అనుకునేలోపు ఇంకో ట్విస్ట్ ఇచ్చి సినిమాని ఇంకో 15 నిముషాలు సాగదీశారు.
ఆ క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా సరిగ్గా చెప్పలేకపోయారు. హీరో – హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇక కొట్టుకోవడాలు, గొడవలు మరీ సిల్లీగా, ఎక్కువగా చూపించారు. కామెడీ కొన్ని చోట్ల ట్రై చేసినా అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని దశాబ్దాలుగా రెండు కులాల మధ్య గొడవలు ఎందుకు ఉన్నాయి అనే కారణం మాత్రం చెప్పలేదు. సినిమా అంతా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. చాలా మందికి ఆ తెలంగాణ యాస సెట్ అవ్వలేదు.
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మొదటి సినిమా నుంచి మీడియా ముందు హడావిడి చేస్తూ బాగానే ఫేమ్ తెచ్చుకున్నాడు. నటన పరంగా కొన్ని చోట్ల బాగానే కష్టపడ్డాడు. కొత్త అమ్మాయి మేఘన ముఖర్జీ అందాలు ఆరబోస్తూనే పల్లెటూరిలో పొగరుగా తిరిగే అమ్మాయి పాత్రలో బాగానే నటించింది. పంచాయితీ సెక్రటరీ పాత్రలో అభయ్ నవీన్ మెప్పిస్తాడు. లక్ష్మణ్ మీసాల మరోసారి తన పాత్రతో సర్ ప్రైజ్ చేస్తాడు. మురళీధర్ గౌడ్ సర్పంచ్ పాత్రలో, రాజశేఖర్ అనింగి హీరో తండ్రి పాత్రలో బాగానే మెప్పించారు. అర్జున్ మహి, మధునందన్, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Euphoria Review : ‘యుఫోరియా’ మూవీ రివ్యూ.. ఈ జనరేషన్ పేరెంట్స్, పిల్లలు కచ్చితంగా చూడాల్సిన సినిమా..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. ఒక మెలోడీ సాంగ్ మాత్రం వినడానికి చూడటానికి బాగుంది. మిగిలిన పాటలు కష్టమే. స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం బాగా రాసుకున్నారు. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లోని కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. రెగ్యులర్ కులాల గొడవలు ప్రేమకథ కథాంశంతో పాత మెసేజ్ నే కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు. లొకేషన్స్ పరంగా సినిమా అంతా ఆల్మోస్ట్ ఒకే ఊళ్ళో జరుగుతుంది. దీనికి ఒక పల్లెటూరిని బాగానే సెలెక్ట్ చేసుకున్నారు.
మొత్తంగా ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా కులాంతర ప్రేమ కథతో రొటీన్ మెసేజ్ తో తెరకెక్కిన కమర్షియల్ సినిమా. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.