Re Release Movies : ఇటీవల ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు, క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో వరుసగా పలు సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కానీ ఇటీవల కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పాత సినిమాలు వరుసపెట్టి రీ రిలీజ్ అవుతున్నాయి. నెల రోజుల గ్యాప్ లో ఏకంగా అరడజను రీ రిలీజ్ లు ప్రకటించారు.
రేపు ఆగస్టు 2న గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాని, సమంత కలిసి నటించిన ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా రీ రిలీజ్ కాబోతుంది.
ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టిన రోజు ఉండటంతో ఒక రోజు ముందే ఆగస్టు 8న గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్, భూమిక కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఒక్కడు’ కేవలం కొన్ని ఏరియాలలో రీ రిలీజ్ అవుతుంది.
ఇక మహేష్ పుట్టిన రోజు ఆగస్టు 9 నాడు కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు, సోనాలి బింద్రే కలిసి నటించిన క్లాసిక్ హిట్ సినిమా ‘మురారి’ గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతుంది.
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజు చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘ఇంద్ర’ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు.
ఆగస్టు 29 నాగార్జున పుట్టిన రోజు ఉండటంతో ఒక రోజు ముందే ఆగస్టు 28 లారెన్స్ దర్శకత్వంలో నాగార్జున, జ్యోతిక కలిసి నటించిన ‘మాస్’ సినిమా రీ రిలీజ్ అవుతుంది.
ఇక ఆగస్టు 29 నాగార్జున పుట్టిన రోజు నాడు నాగార్జున కెరీర్ ని మార్చేసిన సూపర్ హిట్ సినిమా, ఆర్జీవీ ఫస్ట్ సినిమా ‘శివ’ రీ రిలీజ్ కాబోతుంది.
ఇలా ఇప్పటివరకు ఆగస్టులో 6 సినిమాలు రీ రిలీజ్ ప్రకటించారు. ఈ గ్యాప్ లో ఇంకొన్ని సినిమాలు ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాగే ఆగస్టు అవ్వగానే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ సినిమా రీ రిలీజ్ చేయబోతున్నారు.