Meera Mithun : నటి, బిగ్‌బాస్ ఫేమ్ అరెస్ట్.. దళితులపై అనుచిత వ్యాఖ్యలు

తమిళ నటి, బిగ్‌ బాస్‌ ఫేమ్ మీరా మిథున్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. దళితులపై నోరు జారడంతో మీరాని చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Meera Mithun

Meera Mithun : తమిళ నటి, బిగ్‌ బాస్‌ ఫేమ్ మీరా మిథున్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. వ్యవహారం సీరియస్ కావడంతో మీరాని చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేశారు.

దళిత-కేంద్రీకృత పార్టీ అయిన విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మీరాని అరెస్ట్‌ చేశారు. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల ప్రకారం మీరా మిథున్‌ దళితుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను శనివారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇది కాస్త వైరల్‌ కావడంతో మీరా మిథున్‌ను అరెస్ట్‌ చేయాల్సిందిగా డిమాండ్లు వెల్లువెత్తాయి.

మీరా మిథున్‌ షేర్‌ చేసిన వీడియోలో.. ఆమె ఓ డైరెక్టర్‌ అనుమతి లేకుండా తన ఫోటోని అతడి మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కోసం వాడుకున్నాడని ఆరోపించారు. అంతటితో ఊరుకోక.. ‘‘తక్కువ జాతి అనగా దళిత సామాజిక వర్గానికి చెందిన వారి ఆలోచనలు ఇలానే ఉంటాయి. చాలా చీప్‌గా ప్రవర్తిస్తారు’’ అంటూ విమర్శించారు. దళితులు నేరాలకు, అంసాఘిక కార్యకలపాలకు పాల్పడటం వల్లే వారిని సమాజంలో నీచంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాక తమిళ ఇండస్ట్రీలో ఉన్న దళిత దర్శకులను, నటీనటులను బయటకు గెంటేయాలని సూచించారు.

ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో మీరా మిథున్‌సై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆమెను తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు మీరా మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేశారు. మీరా.. తమిళ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌3 లో పాల్గొన్నారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. నోటి దురుసుతో ఆమె వివాదంలో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. తోటి నటీనటులు, రాజకీయ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.