తెలుగు సినిమా కథ, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ.. సుమారు 1200కి పైగా చిత్రాల్లో 2200 పై చిలుకు పాటలు రాసిన ఆయనకు ఆపరేషన్ జరుగనుండగా, బీ-నెగటివ్ గ్రూప్ రక్తం అవసరం ఉంది. ఆయన అనారోగ్యానికి గురికాగా, ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో చికిత్స పొందుతున్నారు.
గత కొంతకాలంగా సుద్దాల కాలేయ సంబంధిత రుగ్మతలతో బాధపడుతూ ఉండగా, కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. సుద్దాలకు రక్తం అవసరం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం సుద్దాల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
1960, మే 16 న నల్గొండ జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామంలో పుట్టారు అశోక్ తేజ. ఈయన ఇంటిపేరు గుర్రం. ఆయన తండ్రి హనుమంతు ప్రముఖ ప్రజాకవి. తెలంగాణా విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు. నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జరిపిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు హనుమంతు.