Madhavan: వివాదంలో ధురంధర్ 2.. సిగరెట్ తాగుతూ సిక్కుల శ్లోకాలు.. బహిరంగ క్షమాపణలు చెప్పిన మాధవన్
సిక్కుల వివాదంపై బహిరంగా క్షమాపణలు చెప్పిన ధురంధర్ 2 నటుడు మాధవన్(Madhavan).
- V Santhosh Kumar
- Published On : March 24, 2026 / 09:11 PM IST
Madhavan Apologizes Over Sikh Controversy in Dhurandhar 2
- కొత్త వివాదంలో ధురంధర్ మూవీ
- సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కేసులు
- క్షమాపణలు చెప్పిన మాధవన్
Madhavan: బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ‘ధురంధర్ 2’ మూవీ తాజాగా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో నటుడు మాధవన్ పోషించిన ‘అజయ్ సన్యాల్’ పాత్రకు సంబంధించిన ఒక దృశ్యంపై సిక్కుల సమాజం నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మాధవన్ ఒక సన్నివేశంలో పవిత్రమైన ‘దశమ్ గ్రంథ్’ శ్లోకాలను పఠిస్తూ సిగరెట్ తాగుతూ కనిపిస్తారు.
ఇది తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ముంబైకి చెందిన ఒక సిక్కు నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం చిలికిచిలికి గాలివానగా మారడంతో, నటుడు మాధవన్(Madhavan) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వివరణ ఇస్తూ.. ఆ సన్నివేశంలో తాను ధూమపానం చేయలేదని స్పష్టం చేశారు. ‘సినిమా దర్శకుడు ఆదిత్య ధర్ ఇలాంటి సున్నితమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ పవిత్రమైన శ్లోకాలు చదవడానికి ముందే సిగరెట్ ఆర్పేయాలని స్పష్టంగా చెప్పారు. మీరు, ఆ సన్నివేశాన్ని క్లియర్ గా గమనిస్తే నా చేతిలో సిగరెట్ ఉండదు, నోటి నుండి పొగ కూడా రాదు, కనీసం ఫ్రేమ్‌లో కూడా ధూమపానం కనిపించదు’ అని ఆయన వివరించారు.
కేవలం ఆ పాత్ర స్వభావం రీత్యా సీన్ ప్రారంభంలో సిగరెట్ పట్టుకుని కనిపిస్తుంది. కానీ, శ్లోకాలు చదివేటప్పుడు మాత్రం దానిని పూర్తిగా దూరం పెట్టామని క్లారిటీ ఇచ్చారు. అలాగే, వ్యక్తిగతంగా తనకు సిక్కు సమాజం అంటే ఎంతో గౌరవమని, ప్రతి సినిమా విడుదలకు ముందు తాను గోల్డెన్ టెంపుల్‌ను సందర్శిస్తానని మాధవన్ పేర్కొన్నారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం తమ చిత్ర బృందానికి లేదని చెబుతూనే, ఒకవేళ ఎవరికైనా పొరపాటుగా అనిపించి ఉంటే క్షమించాలని ఆయన హుందాగా కోరారు. మాధవన్ చెప్పిన క్షమాపణలతో ఈ వివాదం సర్దుమణిగే అవకాశం కనిపిస్తోంది.
