Mareechika Review : ‘మరీచిక’ మూవీ రివ్యూ.. అనుపమ, రెజీనా కలిసి చేసిన సినిమా ఎలా ఉందంటే..

సైలెంట్ గా థియేటర్స్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది ఈ సినిమా.(Mareechika Review)

  • Updated on- May 29, 2026 / 12:56 PM IST

Mareechika Review

Mareechika Review : అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘మరీచిక’. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్, మేఘన నిర్మాణంలో సతీష్ కాసెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మరీచిక సినిమా నేడు మే 29న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే..

వెంకట లక్ష్మి(అనుపమ పరమేశ్వరన్) తన కాలేజీలో కేఫ్ నడిపే సంజు(విరాజ్ అశ్విన్)ని ప్రేమిస్తుంది కానీ అతనికి చెప్పదు. ఓ రోజు వెంకట లక్ష్మికి అమెరికా నుంచి వచ్చిన మరీచిక(రెజీనా కసాండ్రా) పరిచయమై ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. వెంకట లక్ష్మి సంజుకి మరీచికని పరిచయం చేయడంతో వాళ్లిద్దరూ దగ్గరయి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత సంజు మరీచికని తన ఫామ్ హౌస్ కి తీసుకెళ్తాడు. అప్పుడే వెంకటలక్ష్మికి అసలు మరీచిక తన గురించి చెప్పినవన్నీ ఫేక్ అని తెలియడంతో సంజుకి కాల్ చేసి చెప్పి వాళ్ళు ఉన్న దగ్గరకు బయలుదేరుతుంది.

మరీచిక సంజు ఫ్రెండ్స్ తో కలిసి సంజుని చంపేసి పారిపోతుంది. ఇది చూసిన వెంకటలక్ష్మి వెంటనే పోలీసులకు మరీచికపై కంప్లైంట్ ఇస్తుంది. కానీ పోలీసులకు సంజు బతికే ఉన్నాడని తెలియడంతో అతన్ని స్టేషన్ కి తీసుకొస్తే అసలు మరీచిక ఎవరు అని అడుగుతాడు. మరి వెంకటలక్ష్మి చెప్పింది నిజమేనా? సంజు ఎందుకు మరీచిక తెలియదని చెప్పాడు? పోలీసులు ఈ కేసుని ఎలా డీల్ చేసారు? అసలు మరీచిక ఎవరు? మరీచిక – సంజు – వెంకట లక్ష్మి మధ్య ఏం జరిగింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Godari Gattupaina OTT: మూడు వారాలకే ఓటీటీలోకి.. ‘గోదారి గట్టుపైన’ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సినిమా విశ్లేషణ..

మరీచిక అనే సినిమా ఓ మూడు నాలుగేళ్ళ క్రితం సినిమా. అప్పట్లో ప్రకటించి ప్రమోషన్ చేసి వదిలేసారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేసినా అసలు ప్రమోషన్స్ చేయలేదు. అనుపమ, రెజీనా ఇద్దరూ ప్రమోషన్స్ కి రాలేదు. విరాజ్ కూడా సినిమాని పట్టించుకోలేదు. సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్ సినిమా రిలీజ్ పట్టించుకోకపోతే ఇంక జనాలకు ఏం తెలుస్తుంది. అలా సైలెంట్ గా థియేటర్స్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది ఈ సినిమా.

ఫస్ట్ హాఫ్ అంతా సింపుల్ గా వెంకట లక్ష్మి పాత్రతో పాటు సంజు – మరీచికల ప్రేమకథతో బాగా సాగదీశారు. అక్కర్లేని సీన్స్, రొటీన్ లవ్ సీన్స్ తో సాగదీశారు. ఇంటర్వెల్ కి మాత్రం మరీచికని చంపడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. అయితే అసలు కథ సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. పోలీసులు ఈ కేసుని డీల్ చేయడం, అనుపమ పరమేశ్వరన్ ని పిచ్చిదాన్ని తేల్చిన తర్వాత వచ్చే ఓ ట్విస్ట్ తో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంటుంది. ఆ ట్విస్ట్ తర్వాత కాసేపు సినిమాని హారర్ వైపు నడిపించి ఇంకో ట్విస్ట్, క్లైమాక్స్ లో మరో ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఆ ట్విస్ట్ లు ఊహించేయొచ్చు.

క్లైమాక్స్ లో మరీచిక – వెంకటలక్ష్మి – పోలీసుల మధ్య వచ్చే సీన్స్ హైలెట్. ఫస్ట్ హాఫ్ అంతా నీరసంగా సాగితే సెకండ్ హాఫ్ మాత్రం థ్రిల్లింగ్ గా సాగింది. ఇలాంటి థ్రిల్లింగ్ క్లైమాక్స్ లో పోలీస్ పాత్రలో అజయ్ ఘోష్ ఫుల్ గా నవ్విస్తాడు. మధ్య మధ్యలో శ్రీనివాస్ వడ్లమాని పాత్ర ఎందుకు వచ్చిందో దర్శకుడికే తెలియాలి. అయితే కేసుని పూర్తి చేయకుండానే సినిమా ముగించడం గమనార్హం. అధికారికంగా చెప్పకపోయినా సెకండ్ పార్ట్ కి కూడా లీడ్ ఇచ్చినట్టే. కానీ పార్ట్ 2 చేస్తారనే నమ్మకం లేదు. మరీచిక అంటే ఎండమావులు అని అర్ధం. ఆ టైటిల్ ఎందుకు పెట్టారో సినిమాలో ఓ సీన్ తో అర్థమయ్యేలా చెప్పడం గమనార్హం.

నటీనటుల పర్ఫార్మెన్స్..

అనుపమ పరమేశ్వరన్ పళ్ళ క్లిప్, కళ్లద్దాలు, రెండు జడలతో కాస్త డీ గ్లామర్ పాత్రలో బాగానే నటించినా కొన్ని సీన్స్ లో ఓవర్ యాక్షన్ చేసింది అనిపిస్తుంది. ఇక రెజీనా అమెరికా రిటర్న్ అమ్మాయి పాత్రలో రాని స్లాంగ్ తో ఓవర్ యాక్షన్ చేసినట్టు ఉంటుంది. విరాజ్ అశ్విన్ బాగానే నటించాడు. అజయ్ ఘోష్ బాగా నవ్విస్తాడు. శ్రీనివాస్ వడ్లమాని, భద్రం.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Blast Zone Review : ‘బ్లాస్ట్ జోన్’ మూవీ రివ్యూ.. వామ్మో.. ఫ్యామిలీ మొత్తం యాక్షన్ తో అదరగొట్టారుగా..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్, షాట్స్ చూస్తే ఇదేదో ఓ పదేళ్ల క్రితం తీసిన సినిమా అనిపిస్తుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, RR అయితే చాలా వరస్ట్. పాటలు కూడా సీరియల్ సాంగ్స్ లా అనిపిస్తాయి. దీనికి ఇళయరాజా మ్యూజిక్ ఇచ్చారంటే నమ్మలేము. రొటీన్ పాత డైలాగ్స్. స్క్రీన్ ప్లే మాత్రం బాగుంది.

దర్శకుడు సాంకేతికంగా ఇంకాస్త బాగా తెరకెక్కిస్తే బాగుండేది. ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ సీన్స్, అక్కర్లేని సీన్స్ కట్ చేయొచ్చు. నిర్మాణ పరంగా కూడా మూడు నాలుగు లొకేషన్స్ లోనే సినిమాని సింపుల్ గా తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘మరీచిక’ ఇద్దరు అమ్మాయిలు – ఓ అబ్బాయి మధ్య జరిగే థ్రిల్లర్ కథ. ఇలాంటి కథని చాలా బాగా చూపించే అవకాశం ఉన్నా సీరియల్ లాగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.