రాననుకున్నారా.. రాలేననుకున్నారా.. ‘మెలోడీ బ్రహ్మ’ ఫుల్ బిజీ!

‘మెలోడి బ్రహ్మ’ మణిశర్మ వరుస సినిమాలతో దూసుకుపోతూ.. తెలుగు సినీ సంగీతంపై మరోసారి తన మార్క్ చూపించనున్నారు..

  • Publish Date - November 27, 2019 / 06:31 AM IST

‘మెలోడి బ్రహ్మ’ మణిశర్మ వరుస సినిమాలతో దూసుకుపోతూ.. తెలుగు సినీ సంగీతంపై మరోసారి తన మార్క్ చూపించనున్నారు..

మణిశర్మ.. మెలోడీ పాటలతో ‘మెలోడీ బ్రహ్మ’ అని ఒక స్పెషల్ బ్రాండ్ సెట్ చేసుకున్న సంగీత దర్శకుడు.. సినిమా ఏదైనా అందులో కంటెంట్‌కి తగ్గట్టుగా ట్యూన్స్ అందించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన కంపోజ్ చేసే సాంగ్స్ ఎంత బావుంటాయో సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. అందుకే ఇప్పటికి కూడా కొన్ని పెద్ద సినిమాలకు నేపథ్య సంగీతం కోసం ప్రత్యేకంగా మణిశర్మని సెలెక్ట్ చేసుకుంటారు.

ఆ మధ్య సినిమా పరిశ్రమ దాదాపు మణిని మర్చిపోయింది. యువ సంగీత దర్శకుల వెనకు పరుగులు తీసింది. ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాకు తన రీ రికార్డింగ్‌తో ప్రాణం పోశారు మణి. కాస్త గ్యాప్ తర్వాత సంగీత దర్శకుడిగా ‘జెంటిల్‌మన్’ సినిమాతో తన మార్క్ చూపించి ఆకట్టుకున్నారు. ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ సాంగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు మణిశర్మ స్పీడ్ పెంచారు. వరుసగా అవకాశాలు అందుకుంటూ మళ్ళీ తన బలాన్ని చూపిస్తున్నారు. 

మణి మ్యూజిక్ కంపోజ్ చేయనున్న కొత్త సినిమాల గురించి ఫిలిం వర్గాల్లో చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కనున్న సినిమాకు సంగీత దర్శకుడిగా మణిశర్మను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాలతో చేయనున్న ‘అసురన్’ రీమేక్, ఎనర్జిటిక్ స్టార్ రామ్, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రెడ్’,  అలాగే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రానున్న ‘ఫైటర్’ సినిమాలకు సంగీతమందించనున్న మణిశర్మ.. కార్తీక మాసం సందర్భంగా ఈ ఏడాది గణపతి సచ్చిదానంద స్వామి నిర్వహిస్తోన్న అతిరుద్ర యాగం చూడటానికి కాశీ వెళ్లిన సంగతి తెలిసిందే..