Pawan Kalyan
Pawan Kalyan: వకీల్ సాబ్ సినిమాతో సక్సెస్ ఫుల్ కం బ్యాక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా వరస సినిమాలతో సాలిడ్ కాంబినేషన్స్ తో వస్తున్నాడు. ఇప్పటికే అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వం హరిహర వీరమల్లు సినిమాలతో పాటు హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. అయ్యప్పనుమ్ కోషియం సినిమా నుండి భీమ్లా నాయక్ అంటూ విడుదల చేసిన పవన్ పాత్రకు ఇప్పటికే మంచి అప్లాజ్ వచ్చింది.
కాగా, త్వరలోనే పవన్ బర్త్ డే రానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2 అంటే పవన్ అభిమానులకు పండగ రోజే. ఆ రోజును అభిమానులకు మరింత స్పెషల్ గా ఉండేలా చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు. పవన్ నటించే సినిమాల నుండి వరస అప్ డేట్స్ తో స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ సినిమాకు సంబంధించి టైటిల్, ఫస్ట్ గ్లిమ్స్ ను ఆగస్టు 15న విడుదల అవుతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ రీమేక్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించగా.. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేయబోతున్నారట. దీంతో పాటు హరీష్ శంకర్ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేసే అవకాశం ఉండగా.. క్రిష్ హరిహర వీరమల్లు నుండి అప్ డేట్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మొదలయ్యే సినిమా అనౌన్స్ మెంట్ కూడా అదే రోజున వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఒకేసారి ఇన్ని అప్ డేట్స్ అంటే అభిమానులకు ఇక జాతరేనేమో!