Pithapuram Lo Ala Modalaindi Review : ‘పిఠాపురంలో అలా మొదలైంది’ రివ్యూ.. టీనేజ్ ప్రేమలు తెచ్చే కష్టాలు.. తండ్రి కూతురు ఎమోషన్..

Pithapuram Lo Ala Modalaindi Movie Review :తెలిసి తెలియని చదువుకునే ఏజ్ లో తప్పుడు మనుషులను ప్రేమ అని నమ్మి కష్టాల పాలయ్యే అమ్మాయిల గురించి ఓ మంచి పాయింట్ చెప్పే ప్రయత్నం అయితే చేసారు.

  • Published on- September 17, 2026 / 11:53 PM IST

Pithapuram Lo Ala Modalaindi Review

Pithapuram Lo Ala Modalaindi Review : రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘పిఠాపురంలో అలా మొదలైంది’. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా బ్యానర్స్ పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి నిర్మాణంలో మహేష్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే..

పిఠాపురం దగ్గర్లోని ఒక ఒక గ్రామం. అక్కడ బాగా డబ్బున్న వ్యక్తి బంగారయ్య(పృథ్వీ), స్కూల్ టీచర్ విశ్వనాథం(కేదార్ శంకర్), ఆ ఊరి ప్రసిడెంట్ వీర రాఘవ(రాజేంద్రప్రసాద్) ముగ్గురూ ఫ్రెండ్స్. బంగార్రయ్య కూతురు గీత(రిహాన), విశ్వనాథం కూతురు కీర్తన(శ్రీలు), వీర రాఘవ కూతురు అంజని(ప్రత్యుష) ముగ్గురూ కూడా మంచి ఫ్రెండ్స్. బంగారయ్య కూతురికి ఇష్టమొచ్చినట్టు డబ్బు ఇచ్చి ఏమన్నా చేసుకో అంటాడు. విశ్వనాథం కూతురికి 95 మార్కులు వచ్చినా వంద ఎందుకు రాలేదు అని తిడతాడు. వీర రాఘవ మాత్రం కూతురితో ఫ్రెండ్లీగా ఉంటాడు. వీళ్ళు ముగ్గురు కూతుళ్లు స్కూల్ అయ్యాక పిఠాపురంలో ఓ కాలేజీలో ఇంటర్ జాయిన్ అవుతారు. ఆ తర్వాత డిగ్రీకి వస్తారు.

అక్కడ కొత్త పరిచయాలు ఏర్పడటంతో ముగ్గురు అమ్మాయిలు ముగ్గరిని ప్రేమిస్తారు. గీత ఓ అబ్బాయితో లేచిపోతుంది. కీర్తన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే విశ్వనాథం నువ్వు చచ్చిపోయావు అని పంపించేస్తాడు. ఈ రెండు సంఘటనలు జరగడంతో అంజని తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది. మరి ఇంట్లో వాళ్ళని కాదు అని ప్రేమ కోసం వెళ్లిపోయిన గీత, కీర్తన జీవితాలు ఎలా మారాయి? అంజని ప్రేమకు ఇంట్లో ఒప్పుకుంటారా? గీత, కీర్తన చేసిన పనికి వాళ్ళ పేరెంట్స్ ఏం చేసారు? చదువుకునే ఏజ్ లో ప్రేమ అని పేరెంట్స్ ని పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఏం జరిగింది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Missing Meghana Review : ‘మిస్సింగ్ మేఘన’ రివ్యూ.. అమ్మాయి మిస్సింగ్ కేసు చివరకు ఎటు వెళ్లిందంటే..

సినిమా విశ్లేషణ..

అప్పట్లో ప్రేయసి రావే, చెప్పాలని ఉంది, ఆలస్యం అమృతం.. లాంటి మంచి సినిమాలు తీసిన దర్శకుడు చంద్ర మహేష్ చాలా గ్యాప్ తర్వాత మహేష్ చంద్రగా పేరు మార్చుకొని పిఠాపురంలో అలా మొదలైంది అనే సినిమాతో వస్తుండటం, పవన్ కళ్యాణ్ వల్ల పిఠాపురం టైటిల్ కి క్రేజ్ రావడంతో ఈ సినిమాపై కాస్త ఆసక్తి నెలకొంది. ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడి ఇప్పటికి రిలీజ్ అయింది.

ఫస్ట్ హాఫ్ లో ఒక అమ్మాయి లేచిపోయే సీన్ తో కథ ఓపెన్ చేసి ఆరేళ్ళ క్రితం అంటూ బ్రహ్మానందం వాయిస్ ఓవర్ తో సినిమాలోని మెయిన్ పాత్రలు అన్ని పరిచయం చేస్తారు. తండ్రులు ఎలా ఉన్నారు, కూతుళ్లు ఎలా ఉన్నారు అని బాగా సాగదీసి చెప్పుకొచ్చారు. ఇక గ్రామం నుంచి సిటీకి, కాలేజీకి వెళ్ళగానే రెక్కలు వచ్చిన అమ్మాయిలు ప్రేమ అంటూ తిరిగే సీన్స్ తో రొటీన్ లవ్ ట్రాక్ లు, సీన్స్ తో నడిపించారు. కీర్తన పెళ్లి, గీత లేచిపోవడంతో ఇంటర్వెల్ ఇచ్చారు. అప్పటికే ఇంత లో క్వాలిటీ సినిమా ఏంటి అని, ఎమోషనల్ సీన్స్ లో కూడా నవ్వుకొని ఎప్పుడు అయిపోతుందా అని అలసిపోతారు ప్రేక్షకులు. ఇక సెకండ్ హాఫ్ లో కీర్తన పెళ్లి తర్వాత పడే కష్టాలు, గీత లేచిపోయాక వచ్చే కష్టాలతో సాగదీసి, చివర్లో అంజని పెళ్లితో అందర్నీ కలిపే ఓ రొటీన్ హ్యాపీ ఎండింగ్ తో ముగించారు.

అసలు దర్శకుడు ఎంచుకున్నదే పాత అవుట్ డేటెడ్ కథ. ఇన్నాళ్లు గ్యాప్ తీసుకున్న దర్శకుడు ఇంకా అక్కడే ఆగిపోయాడేమో అనిపిస్తుంది. పిల్లలు చదివే ఏజ్ లో పేరెంట్స్ ని ఎదురించి పెళ్లి చేసుకొని, లేచిపోయి వాళ్ళు పడే కష్టాలతో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఓ 20 ఏళ్ళ క్రితం తేజ ఇదే ట్రెండ్ సినిమాలతో నడిపించాడు. అలాంటి కథని ఇప్పుడు చెప్ప్పాలనుకోవడం కష్టమే. ఫస్ట్ హాఫ్ చాలా భారంగా ముక్కలు ముక్కలు చేసిన సీన్స్, రొటీన్ లవ్ ట్రాక్స్ తో నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో లేచిపోతే, పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే కొన్ని వందల సినిమాల్లో చూసిన కష్టాలే చూపించారు. కామెడీ కొన్ని చోట్ల ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. అసలు ఈ సినిమా రైటింగ్ ఎలా ఉందంటే.. కథ ప్రస్తుతం నుంచి ఆరేళ్ళు వెనక్కి వెళ్లి ఒక సంవత్సరం నడిపించి 2021 లో కథ నడుస్తుంటే అప్పటికి పిఠాపురంకి పవన్ కళ్యాణ్ కి సంబంధం లేదు. అసలు పవన్ కళ్యాణ్ గెలవలేదు. కానీ పిఠాపురం, పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అంటూ డైలాగ్స్ 2021 కథకి రాసుకున్నారు అంటే అసలు ఈ సినిమా రైటింగ్ లో దర్శకుడు, రచయితలు ఏం చేసారో అర్ధం కాదు. అసలు ఆ సీన్ కూడా అక్కడ అవసర్లేదు. ఏదో పెట్టాలి అని అతికించారు. ఇలాంటి లాజిక్ లెస్ సీన్స్ బోలెడు.

కాకపోతే తెలిసి తెలియని చదువుకునే ఏజ్ లో తప్పుడు మనుషులను ప్రేమ అని నమ్మి కష్టాల పాలయ్యే అమ్మాయిల గురించి ఓ మంచి పాయింట్ చెప్పే ప్రయత్నం అయితే చేసారు. కానీ ఆ ఎమోషన్ కూడా పెద్దగా పండలేదు. చివర్లో ఓ నాలుగు మోటివేషనల్ డైలాగ్స్, ఎమోషనల్ డైలాగ్స్ చెప్పి అందర్నీ కలిపారు. ఇక చాలా చోట్ల సీరియల్ చూస్తున్నామేమో అనిపిస్తుంది. అక్కడ వాడే ఎఫెక్ట్స్, ఆర్టిస్టులు చేసే నటన చూస్తే ఎందుకు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఒక్క గోవా రొమాంటిక్ సాంగ్ లో మాత్రం అందరూ కష్టపడి పని చేసినట్టు మంచి అవుట్ పుట్ ఇచ్చారు. సినిమా మొత్తం మీద తండ్రి కూతురు ఎమోషన్ పండించడానికి బాగా కష్టపడ్డారు కానీ వర్కౌట్ అవ్వలేదు. అలాగే తండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పే ప్రయత్నం కూడా చేసారు.

సినిమాలు మానేసిన సీనియర్ దర్శకులు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నా ఏదైనా రిలీజ్ ఈవెంట్స్ కి గెస్ట్ గా రావడం తప్ప సినిమాలు చేస్తామని రావట్లేదు. కానీ ఒకప్పుడు కొన్ని మంచి సినిమాలు తీసిన దర్శకుడు ఇప్పుడు ఈ సినిమాతో వచ్చి ప్రేక్షకులతో విమర్శలు చేయించుకోవడం అవసరమా అనిపిస్తుంది. లేదా ఎవరైనా సినిమా తీస్తే ఈ దర్శకుడి పేరు వేసి ప్రచారం చేసారా అని కూడా అనిపిస్తుంది. పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గెలిచాక ఒక బ్రాండ్ వచ్చింది. అలాంటి బ్రాండ్ ఉన్న పేరుని టైటిల్ గా వాడి దానికి చెడ్డ పేరు తెచ్చారేమో అని ఎవరూ ఫీల్ అవ్వకుండా ఉంటే చాలు. థియేటర్స్ లో చూసేంత డేర్ అయితే చేయకూడదు. ఓటీటీలో కూడా చూస్తే ఫాస్ట్ ఫార్వార్డ్ లో చూస్తారేమో.

నటీనటుల పర్ఫార్మెన్స్..

రాజేంద్ర ప్రసాద్ ఊరి ప్రసిడెంట్ గా పర్వాలేదు అనిపించారు. కొన్ని సీన్స్ లో మరీ ఓవర్ డ్రమాటిక్ గా నటించారు అనిపిస్తుంది. స్ట్రిక్ట్ ఫాదర్ గా కేదార్ శంకర్ కాస్త నెగిటివ్ షేడ్ లో బాగానే మెప్పించారు. పృథ్వీ బాగా డబ్బున్న పాత్రలో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు. రిహానా అందాలు ఆరబోస్తూనే ఎమోషనల్ సీన్స్ లో పర్వాలేదు అనిపించింది. శ్రీలు కాస్త డీ గ్లామరైజ్ పాత్రలో బాగానే నటించింది. ఎమోషనల్ పాత్రలో పర్వాలేదు అనిపించింది. ప్రత్యూష కూడా పర్వాలేదు అనిపిస్తుంది.

JDV ప్రసాద్, మణిచందన, అన్నపూర్ణమ్మ, శాంతి.. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో ఓకే అనిపించారు. ముగ్గురు అమ్మాయిలు ప్రేమించిన ముగ్గురు అబ్బాయిల పాత్రల్లో నటించిన సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్ లను ఎక్కడ నుంచి తీసుకొచ్చారో గాని వీళ్ళకు యాక్టింగ్ రాదా అని మాత్రం అనుకోకుండా ఉండలేము.

Also Read : Daayra Review : ‘దాయ్‌రా’ మూవీ రివ్యూ.. దిశా కేసుపై బాలీవుడ్ లో సినిమా.. ఎలా ఉందంటే..?

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదు. కొన్ని సీన్స్ కి కలర్ గ్రేడింగ్ చేయలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు బాగోలేదు. పాటలు కూడా బాగోలేవు. డబ్బింగ్ లో కొన్ని చోట్ల లిప్ సింక్ కూడా లేదు. రీ రికార్డింగ్, మిక్సింగ్ లో కూడా కేరింగ్ తీసుకోలేదు. మేకప్ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కువ మేకప్ ఉందేమో అన్ని సీన్స్ లో చాలా మంది ఆర్టిస్టులకు ఎక్కువ పౌడర్, మేకప్ వేసి కూర్చోపెట్టారు అబ్బాయిలతో సహా. ఎప్పుడో ఓ పదేళ్ల క్రితం పాత కథని రొటీన్ పాత కథనంతో తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటర్ ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. నిర్మాణ పరంగా మాత్రం కాస్త బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘పిఠాపురంలో అలా మొదలైంది’ ఓ అవుట్ డేటెడ్ కథ, కథనంతో మంచి పాయింట్ ని చెప్పాలనుకున్నారు. కానీ అన్ని డిపార్ట్మెంట్స్ లోపాలతో అది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాకు 1.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక: ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.