Natti Kumar: మెగా హీరోల సినిమాలప్పుడే ఎందుకీ డ్రామాలు.. అప్పుడు గుర్తుకు రాలేదా.. దిల్ రాజు, మైత్రి సంస్థపై నట్టి కుమార్ ఫైర్
దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలపై నిర్మాత నట్టి కుమార్(Natti Kumar) సంచలన వ్యాఖ్యలు.
- V Santhosh Kumar
- Updated on- May 13, 2026 / 09:13 PM IST
Producer Natti Kumar shocking comments on Dil Raju and Mythri Movie Makers issue
- దిల్ రాజు, మైత్రీ కోల్డ్ వార్.
- మెగా హీరోలనే టార్గెట్ చేస్తున్నారు.
- పెద్ది సినిమాను ఆపడం అసాధ్యం.
Natti Kumar: టాలీవుడ్‌లో ప్రస్తుతం నెలకొన్న థియేటర్ల వివాదంపై సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్(Natti Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కారణంగానే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా మెగా కుటుంబానికి చెందిన చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాల విడుదలకు ముందు కావాలనే ఎవరో ఒకరు పనిగట్టుకుని అడ్డంకులు సృష్టిస్తున్నారని, ప్రతిసారీ వారినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఇది పరిశ్రమ అభివృద్ధికి ఏమాత్రం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, సరిగ్గా ఇప్పుడే ఎగ్జిబిటర్ల సమస్యలు తెరపైకి రావడం వెనుక ఆంతర్యమేమిటని నట్టి కుమార్ నిలదీశారు. గతంలో ఎన్నో పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు లేని ఇబ్బందులు, ఇప్పుడు ‘పెద్ది’ సమయానికే ఎందుకు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. సినిమా రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైన వేళ జీవోలను అమలు చేయాలని పట్టుబట్టడం, అభిమానుల్లో కలవరం కలిగించడం సరైన పద్ధతి కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా విడుదలను ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పరిశ్రమలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అనే మూడు వర్గాలకు వారి స్వంత సమస్యలు ఉంటాయని, వాటిని సామరస్యంగా కూర్చుని చర్చించుకోవాలని నట్టి కుమార్ సూచించారు. ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు తీసుకోకుండా, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం వివాదాలను సృష్టించడం వల్ల పరిశ్రమకు నష్టమే తప్ప లాభం లేదని, ఇప్పటికైనా పెద్దలు స్పందించి ఈ గొడవలకు ముగింపు పలకాలని ఆయన స్పష్టం చేశారు.
