Rashmika Vijay Deverakonda : అది ఫెమినిజం కాదు.. అలాంటి అమ్మాయిలకు గట్టి కౌంటర్ ఇచ్చిన రష్మిక.. విజయ్‌తో క్యూట్ వీడియో షేర్ చేసి..
రష్మిక అలాంటి పోస్టులు పెట్టేవాళ్లందరికి గట్టి కౌంటర్ ఇస్తూ ఓ భారీ పోస్ట్ తన ట్విట్టర్ లో షేర్ చేసింది. (Rashmika Mandanna)
- Saketh U
- Updated on- October 26, 2026 / 05:45 PM IST
Rashmika Mandanna Counter Post On Some Feminists Comments
Rashmika Mandanna : విజయ్ – రష్మిక గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మోస్ట్ క్యూట్ కపుల్ గా వైరల్ అవుతున్నారు ఈ జంట. ఇటీవలే ఈ జంట మరోసారి రణబాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ – రష్మిక కలిసి బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షోకి హాజరయ్యారు. ఈ షోలో మాట్లాడిన పలు మాటలు, పలు హావభావాలు వైరల్ అయ్యాయి.
రష్మిక పెళ్లి చేసుకుందామని అడిగినా విజయ్ సంవత్సరం పాటు తిప్పించుకున్నాడని అని చెప్పిన మాటలు, విజయ్ షోలో రష్మికకు కాఫీ అందివ్వలేదని, ఓ ఈవెంట్ లో రష్మిక వాటర్ అడిగితే కనీసం బాటిల్ క్యాప్ కూడా తీసి ఇవ్వలేదని పలువురు సూడో ఫెమినిస్టులు విజయ్ పై విమర్శలు చేస్తూ, రష్మిక ని విజయ్ నుంచి విడిపోయామని కామెంట్స్, పోస్టులు చేస్తున్నారు. దీంతో రష్మిక అలాంటి పోస్టులు పెట్టేవాళ్లందరికి గట్టి కౌంటర్ ఇస్తూ ఓ భారీ పోస్ట్ తన ట్విట్టర్ లో షేర్ చేసింది.
Also Read : Jadi : ఒడియా హిట్ సినిమా.. ఇప్పుడు తెలుగులో.. ‘జడి’ గ్లింప్స్..
రష్మిక తన పోస్ట్ లో .. నన్ను ప్రేమించే వాళ్లకు, తిట్టుకునే వాళ్లకు అందరికి నాకు, విజ్జుకి సంబంధించిన ఈ విషయంపై నా అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా ఇలాంటి విషయాలపై నేను స్పందించను. ఎవరి ఉద్దేశం వాళ్ళది. కానీ మా ఇంటర్వ్యూ గురించి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్టుగా కాకుండా కోపంతో తమ ఆవేశాన్ని చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఇది రాస్తున్నది ప్రేమను నమ్మే వారిని కాపాడాలని. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన, తమ హృదయానికి దగ్గరైన ప్రేమను జీవితంలో పొందాలని కోరుకుంటున్నాను. మా ఇద్దరి సోషల్ మీడియా ప్రొఫైళ్లలో అవసరం లేకుండానే అభిప్రాయాలు, కామెంట్లు, ఎవరూ అడగని సలహాలు వస్తున్నాయి. మా మీద ఈ రేంజ్ లో స్పందించడం నన్ను కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక దశలో అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అనిపించింది. అందుకే నా జీవితానికి సంబంధించిన చిన్న అభిప్రాయాన్ని మీతో పంచుకోవాలనిపించింది.
ముందుగా ఒక విషయం స్పష్టంగా చెబుతాను.. ఇది ఎప్పుడు, ఎన్ని సార్లు అడిగాడు, ఒక సంవత్సరం ఎందుకు వేచి చూశారు? అనే విషయం గురించి కాదు. కానీ మీలో కొందరు మాత్రం అక్కడే ఆగిపోయారు. అలాంటి సంభాషణ మా ఇద్దరి మధ్య జరిగింది. కానీ మాలో ఎవ్వరూ గొప్ప ప్రపోజల్ కోసం ఎదురుచూడలేదు. జీవితంలోని సంతోషాలు, కష్టాలు, ఒత్తిళ్లు, ఒడిదుడుకులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకోవడానికి అవసరమైన సమయం, వ్యక్తిగత స్పేస్ ఇద్దరికీ ఇవ్వాలని అతను కోరుకున్నాడు. అలా ఆలోచించిన తర్వాత కూడా ఇదే మనం నిజంగా కోరుకునేది, ఇదే సరైన సమయం అని మేము అనుకోవాలనుకున్నాం. అదే జరిగింది. చివరికి మేమిద్దరం ఒకరినొకరం ఎంచుకున్నాం. నాకు జీవితంలో ఏం కావాలో స్పష్టంగా తెలుసు. జీవితంలోని కొన్ని విషయాల గురించి బాగా ఆలోచించి, పూర్తిగా నిశ్చయించుకోవడానికి అతను కొంత సమయం తీసుకోవాలనుకోవడం కూడా సరైన విషయమే. అలా జరిగినంత మాత్రాన మా ప్రేమలో ఎలాంటి మార్పూ రాలేదు. నేను మనసుతో ఆలోచించే వ్యక్తిని. అతను ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. మా జీవితాల్లో ఆ రెండు లక్షణాలు అవసరమే.
మా దృష్టిలో పెళ్లి అంటే ఎప్పుడూ ప్రపోజ్ చేయడం, ఒక మోకాలిపై కూర్చోవడం లేదా ఉంగరం తొడగడం కాదు. అవన్నీ కేవలం వేడుకలో భాగమే. మా కోసం పెళ్లి అంటే కలిసి ఒక జీవితం, ఒక భవిష్యత్తును నిర్మించుకోవడం. మేము ఆ ప్రయాణాన్ని ఎంతో అందంగా కొనసాగించాము. నేను నా భర్తని ఎంతో ప్రేమిస్తాను, అతని గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటాను. అందులో తప్పేముంది. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తినే ప్రేమించకపోతే అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాను? అతను జీవితాంతం నా తోడుగా ఉండబోతున్నాడు. ఎప్పుడూ అతను నా స్నేహితుడిగా ఉంటాడు. మా పిల్లలకు తండ్రి అవుతాడు. నేను వృద్ధాప్యంలో కలిసి నడిచే వ్యక్తి అతనే. మేమిద్దరం మా జీవితాలను మా సొంత నిర్ణయాలతో, మా కష్టార్జితంతో నిర్మించుకున్నాం. మేము ఆలోచించే శక్తి ఉన్న, బాధ్యతగల పెద్దవాళ్లం. మా జీవితాన్ని ఎలా గడపాలి? ఎవరితో కలిసి గడపాలి? అనే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, అవకాశం మాకు ఉన్నాయి. ఆ నిర్ణయంలో మేము ఒకరినొకరం ఎంచుకున్నాం.
కొంతమంది అమ్మాయిలకు కూడా ఒక మాట.. ఒక మహిళపై శ్రద్ధ చూపుతున్నట్టు రీల్స్ చేస్తూ ఆ రిలేషన్ నుంచి బయటకు రా అని చెప్పి, నన్ను కాపాడాలనే ఉద్దేశంతో ఉచితంగా రిలేషన్షిప్ సలహాలు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కానీ రెండేళ్ల క్రితం నా జీవితంలో పరిస్థితులు నిజంగా చాలా కఠినంగా ఉన్నప్పుడు మీలో కొందరైనా నా పక్కన ఉండి ఉంటే బాగుండేదని అనిపిస్తోంది. అప్పుడు మీరు లేరు. కానీ అతను ఉన్నాడు. ఇప్పటికీ ఉన్నాడు. ఇవాళ నేను నా జీవితంలో ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నాను. ఆ ఆనందం నా ముఖంలో, పెళ్లి తర్వాత నేను అనుభవిస్తున్న సంతోషంలో, నా నటనలో, నా సినిమాల్లో, మొత్తంగా నేను జీవిస్తున్న విధానంలో మీకు కనిపిస్తుందని ఆశిస్తున్నాను. కానీ నా స్వంత జీవితం గురించి నేను చెప్పే మాటల కంటే ఇంటర్నెట్లో కొందరు సృష్టించే కల్పిత కథనాలు, దారి తప్పించే ఎడిట్లు, పూర్తిగా అబద్ధమైన ప్రచారాలను కొందరు ఎక్కువగా నమ్మడం నిజంగా కొంచెం భయానకంగా అనిపిస్తోంది.
నాకు ఎముక విరిగించుకున్నప్పుడు మీరు నా పక్కన లేరు. అతను ఉన్నాడు. ప్రతి నెల పీరియడ్స్ వచ్చినప్పుడు మీరు లేరు. అతను ఉన్నాడు. ఆందోళనతో అర్ధరాత్రి నిద్ర లేచినప్పుడు మీరు లేరు. అతను ఉన్నాడు. నేను బాధగా ఉన్నప్పుడు, నాకు సలహా కావాల్సి వచ్చినప్పుడు, రక్షణ, ఓదార్పు, అండ కావాల్సి వచ్చినప్పుడు… మీరు లేరు, ఎప్పుడూ లేరు. కానీ అతను ఉన్నాడు. మన కోసం ఎప్పుడూ ప్రోత్సహించే వ్యక్తి, ప్రేమతో చూసుకునే వ్యక్తి, మనల్ని కాపాడే వ్యక్తి, మన గురించి శ్రద్ధ తీసుకునే వ్యక్తి, మన ప్రతి విజయాన్ని మనకంటే ఎక్కువగా ఆనందించే వ్యక్తి… నాకు కావాల్సిన ప్రేమ అదే.
చివరిగా ఒక విషయం… నా గురించి మీకు ఎంత విమర్శ చేయాలనిపించినా చేయండి. వాటిని నేను భరించగలను. కానీ నా కుటుంబం గురించి అసలు తెలుసుకోకుండా మాట్లాడటం ఎలా? అది ఫెమినిజం కాదు. ఫెమినిజం పేరుతో చేసే వేధింపే. ఫెమినిజం అంటే ఎప్పుడూ ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి చూపించడం కాదు. అది మగవాడైనా, ఆడవారైనా తమను తాము గొప్పవారిగా నిరూపించుకోవడం కూడా కాదు. ఫెమినిజం అసలు ఉద్దేశం ఏమిటంటే… ప్రతి ఒక్కరికీ తమ జీవితాన్ని తాము ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి. ఆ జీవితానికి తామే బాధ్యత వహించాలి. నేను నా జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని నేనే తీసుకున్నాను అంటూ తమ రిలేషన్ షిప్ పై వచ్చిన వార్తలకు క్లారిటీ ఇస్తూనే ఫేక్ ఫెమినిస్టులకు గట్టి కౌంటర్ ఇచ్చింది.
Also See : Supritha : చిగిరిన జీన్స్‌తో సురేఖ వాణి కూతురు.. సుప్రీత స్టైలిష్ లుక్.. ఫోటోలు వైరల్..
అలాగే విజయ్ కూడా ఇదే వీడియోని షేర్ చేస్తూ.. నా బెస్ట్ ఫ్రెండ్, నా భార్య, నా జీవిత భాగస్వామి… నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత అందమైన, సరైన నిర్ణయాల్లో ఆమె ఒకరు. మా గురించి ఆందోళన చెందుతున్న అందరికీ ఒక్క మాట. మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం. నేను నిజంగా అదృష్టవంతుడిని. ప్రపంచమంతా ఒకవైపు, నేను–ఆమె ఒకవైపు నిలవాల్సి వచ్చినా మేము కలిసి నిలుస్తాం. ఎలాంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్న వాళ్లకు ఒక్కటే చెబుతున్నాను మీ ఇష్టం వచ్చినట్లు అనుకోండి అని పోస్ట్ చేసారు.
