Vaishali Takkar : ప్రముఖ బుల్లితెర నటి, ‘ససురాల్ సిమర్ కా’ టీవీ షో ఫేమ్ వైశాలి ఠక్కర్(30) ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్ సాయిబాగ్‌లోని తన ఇంట్లో ఉరేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు, నోట్‌లో వైశాలి పేర్కొన్న కారణాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది.
ప్రాథమిక విచారణలో ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైశాలి ఆత్మహత్య వార్త టీవీ పరిశ్రమలో కలకలం రేపింది. సహచరులను షాక్ కి గురి చేసింది. 30ఏళ్లకే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు వైశాలి మృతికి సంతాపం తెలుపుతున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
వైశాలి స్వస్థలం ఉజ్జయినిలోని మహిద్‌పూర్. 2016లో రాజన్ షాహి నిర్మించిన లాంగ్-రన్ షో ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’ సీరియల్‌తో టీవీ కెరీర్‌ను ప్రారంభించింది. ఈ సీరియల్‌లో సంజనా సింగ్ పాత్రను పోషించగా.. మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘ససురాల్ సిమర్ కా’ సీరియల్‌లో అంజలి పాత్రను పోషించింది. ఆ తర్వాత యే వాదా రహా, యే హై ఆషికి, సూపర్ సిస్టర్, లాల్ ఇష్క్.. ఔర్ విష్, అమృత్ తదితర సీరియల్స్‌లో కీలకపాత్రలు పోషించింది. చివరిసారిగా బిగ్ బాస్ 14 ఫేమ్ నిశాంత్ మల్కాని ‘రక్షాబంధన్ ’షోలో కనిపించింది.
టీవీ సీరియల్స్‌తో పాటు పలు చిత్రాల్లోనూ వైశాలి కనిపించింది. ఇదిలా ఉండగా.. దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్‌కు వైశాలి స్నేహితురాలు. అతని మరణంపై అప్పట్లో ఆమె చాలా అనుమానాలు వ్యక్తం చేసింది. సుశాంత్ ఆత్మహత్యను వైశాలి ఠక్కర్ హత్యగా ఆరోపించింది. సుశాంత్ మృతికి రియా చక్రవర్తి కారణమని ఆరోపించింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతని మరణం వెనుక చాలా మంది ప్రమేయం ఉందని ఆరోపించింది.