Bun Butter Jam : ‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’ మూవీ రివ్యూ.. లవ్ స్టోరీలు.. నవ్వులతో పాటు ఎమోషన్ కూడా..

‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’ సినిమా లవ్ స్టోరీలతో నవ్విస్తూ అక్కడక్కడా ఎమోషన్ పండిస్తూ యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా.(Bun Butter Jam )

Bun Butter Jam : ‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’ మూవీ రివ్యూ.. లవ్ స్టోరీలు.. నవ్వులతో పాటు ఎమోషన్ కూడా..

Bun Butter Jam

Updated On : August 21, 2025 / 3:42 PM IST

Bun Butter Jam : రాజు జెయ‌మోహ‌న్‌, ఆధ్య ప్ర‌సాద్‌, భ‌వ్య త్రిఖ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన తమిళ సినిమా ‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’. రెయిన్ ఆఫ్ ఎరోస్‌, సురేష్ సుబ్ర‌మ‌ణియ‌న్ నిర్మాణంలో రాఘ‌వ్ మిర్‌ద‌త్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చార్లి, శ‌ర‌ణ్య పొన్‌వ‌న్న‌న్‌, దేవ‌ద‌ర్శిన‌, మైకేల్ తంగ‌దురై, విజె.ప‌ప్పు.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. తమిళ్ లో ఈ సినిమా జులై 18న రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో అదే టైటిల్ తో శ్రీ విఘ్నేశ్వర ఎంటైన్మెంట్స్ బ్యానర్ పై సిహెచ్ సతీష్ కుమార్ రేపు ఆగ‌స్ట్ 22న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పలు ప్రీమియర్స్ వేశారు.(Bun Butter Jam)

కథ విషయానికొస్తే.. చంద్రు(రాజు జెయ‌మోహ‌న్‌), మధుమిత(ఆధ్య ప్రసాద్) అప్పుడే ఇంటర్ కంప్లీట్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ పాత పరిచయాలతో ఓ పెళ్ళిలో కలిసి క్లోజ్ అవుతారు. ఇటీవల లవ్ అయినా అరేంజ్డ్ అయినా పెళ్లిళ్లు చెడిపోతున్నాయని, విడిపోతున్నారని అందుకే తమ పిల్లలకు ఫ్యూచర్లో లవ్ & అరేంజ్డ్ వాళ్లకు తెలియకుండానే చేయాలని చంద్రు తల్లి(శరణ్య), మధుమిత తల్లి(దేవ‌ద‌ర్శిన‌) డిసైడ్ అవుతారు. ఇందుకోసం మధుమిత ఫ్యామిలీ చంద్రు పక్కింట్లోకి దిగుతారు.

అయితే ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాక చంద్రు.. నందిని(భ‌వ్య త్రిఖ)ప్రేమలో పడతారు. నందినిని చంద్రు బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్(మైకేల్ తంగ‌దురై) కూడా లవ్ చేస్తాడు. ఇక మధుమిత ఆకాష్(VJ పప్పు)ని లవ్ చేస్తుంది. చంద్రు – మధుమితలను కలపాలని వాళ్ళ పేరెంట్స్ తెగ ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు పడదు. ఓ సమయంలో ఇద్దరూ లవర్స్ తో ఒకరికొకరు దొరికిపోతారు. మరి వీళ్ళలో ఎవర్ని ఎవరు లవ్ చేస్తారు? ఎవరి ప్రేమలు బ్రేకప్ అవుతాయి? చివరకు ఎవరు ఎవర్ని పెళ్లి చేసుకుంటారు? చంద్రు – మధుమిత పేరెంట్స్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Soothravakyam : ‘సూత్ర వాక్యం’ మూవీ రివ్యూ.. మలయాళం మర్డర్ మిస్టరీ తెలుగులో..

సినిమా విశ్లేషణ..

తమిళ్ లో యూత్ కి బాగా కనెక్ట్ అయింది ఈ బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ సినిమా. టైటిల్ ఏదో పెట్టి కథలో కొన్ని పాయింట్స్ కలిపారు కానీ ఈ టైటిల్ కి మెయిన్ కథకి సంబంధం ఉండదు. ఇది ఒక లవ్ కామెడీ జానర్. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్, యూత్ ని ఉద్దేశించి తీసిన సినిమా. బయట రియాలిటీలో జరుగుతున్న లవ్ స్టోరీలను ఆదర్శంగా తీసుకొని కామెడీ, ఎమోషన్స్ తో తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ గా నవ్విస్తూనే ఉంటారు. చంద్రు, మధుమిత, వాళ్ళ తల్లులు పాత్రలతో ఫుల్ గా నవ్విస్తారు.

లవ్ స్టోరీలు అన్ని క్యూట్ గా బాగానే రాసుకున్నారు. అలాగే బ్రేకప్ ఎమోషన్స్ అంతే పెయిన్ గా రాసుకున్నారు. లవ్ తో పాటు ఫ్రెండ్షిప్ ఎమోషన్ ని కూడా బాగా చూపించారు. ఇంటర్వెల్ కి ఒకరికొకరు లవర్స్ తో దొరికిపోయి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మంచి బ్యాంగ్ ఇచ్చారు. లవ్ లోనే కామెడీ ట్విస్ట్ లు కూడా అదిరిపోతాయి. అయితే సెకండ్ హాఫ్ లో కాస్త కథ సాగదీసినట్టు, అక్కడక్కడే తిరిగినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ ముందే ఊహించినా దాన్ని ఇంకొంచెం క్లారిటీగా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఓ నాలుగు డైలాగ్స్ చెప్పి ఇంతేనా అనిపిస్తారు క్లైమాక్స్.

ఎవరెవరికి పెయిర్స్ కలిపారో అందరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. వీళ్ళ లవ్ స్టోరీ మధ్య ఓ సూపర్ సీనియర్ – మేడం లవ్ స్టోరీ సింపుల్ గా మెప్పిస్తుంది. అయితే చంద్రు – శ్రీనివాస్ మధ్య ఫ్రెండ్షిప్ మాత్రం కొన్ని సీన్స్ లో గే స్టోరీ అనే ఫీలింగ్ వచ్చేలా కాస్త డ్రమాటిక్ గా అనిపిస్తుంది. వాళ్లే దాన్ని అదే గే డైలాగ్స్ తో కవర్ చేయడం గమనార్హం. గతంలో మనం ఎవరితో ప్రేమలు, బ్రేకప్స్ ఉన్నా ఫ్యూచర్ లో ఉండే వాళ్ళతో సంతోషంగా ఉండాలి అని ఓ మెసేజ్ అయితే ఇచ్చారు. మొత్తంగా సినిమా నవ్వుకుంటూనే అక్కడక్కడా ఎమోషన్ ఫీల్ అవుతూ చూసేయొచ్చు.

Bun Butter Jam

నటీనటుల పర్ఫార్మెన్స్..

చంద్రు పాత్రలో రాజు జెయ‌మోహ‌న్‌ తన పాత్రలో వేరియేషన్స్ చూపిస్తూ బాగా మెప్పించాడు. భ‌వ్య త్రిఖ రీల్స్ చేసే అమ్మాయి పాత్రలో క్యూట్ గా కనిపిస్తూ అలరించింది. ఆధ్య ప్రసాద్ కూడా క్యూట్ గా కనిపిస్తూనే సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో మెప్పించింది. సీనియర్ నటీమణులు శ‌ర‌ణ్య పొన్‌వ‌న్న‌న్‌, దేవ‌ద‌ర్శిన‌ తల్లి పాత్రల్లో అదరగొట్టేసారు. ఒకోసారి వీళ్ళ కామెడీ చూస్తుంటే ఓవర్ యాక్టింగ్ అనిపించినా నవ్వక తప్పదు. విజె పప్పు ప్రతి సీన్ లో నవ్వించి చివర్లో ఎమోషనల్ గా మెప్పిస్తాడు. చార్లి, మైకేల్ తంగ‌దురై.. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : R Narayana Murthy : ఏఎన్నార్ ఫ్యాన్ గా ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ అవ్వాలని అనుకునేవాడిని.. కానీ ఆ సాంగ్ చూశాక..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ లవ్ స్టోరీలకు తగ్గట్టు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ లో పాటలు బాగానే ఉన్నాయి. డైలాగ్స్ విషయంలో మాత్రం కొన్ని చోట్ల తెలుగు డబ్బింగ్ మిస్ మ్యాచ్ అయింది. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో బాగానే కట్ చేసారు. రెగ్యులర్ లవ్ స్టోరీలను తీసుకొని కొత్త స్క్రీన్ ప్లేతో చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’ సినిమా లవ్ స్టోరీలతో నవ్విస్తూ అక్కడక్కడా ఎమోషన్ పండిస్తూ యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

 

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.