Rao Bahadur Review : ‘రావు బహదూర్’ మూవీ రివ్యూ.. అనుమానం పెనుభూతం..

ఈ సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి. (Rao Bahadur Movie Review)

  • Updated on- July 3, 2026 / 02:48 PM IST

Satyadev Rao Bahadur Movie Review

Rao Bahadur Review : సత్యదేవ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా ‘రావు బహదూర్’. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మాణంలో వెంకటేష్ మహా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సైకాలజికల్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన రావు బహదూర్ సినిమా నేడు జూలై 3న థియేటర్లలో రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే..

ఈ కథ 1960, 1990లలో నడుస్తుంది. రామప్ప(సత్యదేవ్) ఓ రాజవంశీయుడు. దేశాలు పట్టుకొని తిరిగే రామప్ప అతని తండ్రి చావుకు దగ్గర ఉన్నాడని తెలియడంతో తన బెస్ట్ ఫ్రెండ్, డాక్టర్ ఆచారి(వికాస్ ముప్పాళ) కోరిక మేరకు ఇంటికి వస్తాడు. తన తండ్రిని చూసుకోడానికి వచ్చిన నర్స్ రేణుక(దీపా థామస్)ని ఇష్టపడతాడు రామప్ప. ఆమెని పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటాడు. అయితే రెండో సారి పుట్టిన కొడుకు నల్లగా పుట్టడంతో బంధువులు అనే మాటలు విని భార్యని అనుమానించి రెండో కొడుకు కుసుమప్ప(మాస్టర్ కిరణ్)ని సరిగ్గా పట్టించుకోడు. అనుకోకుండా కుసుమప్ప చనిపోతాడు.

దాంతో రేణుక ఒక గదిలో ఉండిపోతుంది. రామప్ప మతిస్థిమితం కోల్పోయినా 25 ఏళ్ళ తర్వాత కూడా ఆరోగ్యం పాడయినా..కుసుమప్ప తన కొడుకు కాదేమో అనుమానంతోనే బతుకుతూ ఉంటాడు. చనిపోయిన కొడుకుతో DNA టెస్ట్ చేసి అది ప్రూవ్ చేయమని తన డాక్టర్ ఫ్రెండ్ ఆచారిని కోరతాడు. 1990లలో ఇండియాలో DNA టెస్ట్ అంటే చాలా పెద్ద ప్రాసెస్. అసలు చనిపోయిన కొడుకు DNA టెస్ట్ జరుగుతుందా? కుసుమప్ప రామప్ప కొడుకే అని తేలుతుందా? అసలు కుసుమప్ప ఎలా చనిపోతాడు? రేణుక మళ్ళీ గదిలోంచి బయటకు వస్తుందా? రామప్ప అనుమానం తీరుతుందా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : ‘నాగబంధం’ మూవీ రివ్యూ.. విజువల్స్ బాగున్నాయి కానీ..

సినిమా విశ్లేషణ..

కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు, మంచి నటుడు సత్యదేవ్ కాంబోలో సినిమా, సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పడం, మహేష్, సుకుమార్ సినిమా చూసి రివ్యూ చెప్పడం, టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి. భార్య మీద అనుమానం వచ్చి తనకు పుట్టిన కొడుకు తన కొడుకేనా కాదా? అనే అనుమానంతో ఉన్న భర్త కథ. సింపుల్ గా ఈ సినిమా కథ ఇంతే. దీనిని అనుమానం పెనుభూతం అని మన మెదడులో వచ్చే ఆలోచనలు నిజంగా జరుగుతున్నట్టు.. మ్యాజికల్ రియలిజం, సైకలాజికల్ థ్రిల్లర్ గా సినిమాటిక్ విజువల్స్ తో హాలీవుడ్ లెవల్లో చూపించాలని ప్రయత్నించారు.

సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త బోర్ గా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో అక్కర్లేని ఓ ఐటెం సాంగ్. తన కొడుకు అస్థిపంజరంతో DNA టెస్ట్ చేయించాలన్న దగ్గర్నుంచి కథ ఆసక్తిగా సాగుతుంది. మధ్యలో హీరో తనలో తానే మాట్లాడుకునే సీన్స్ లో పురాణాలు, దేశ చరిత్ర ఎందుకొచ్చిందో. డైలాగ్స్ విషయంలో చాలా కట్స్ పడ్డాయి సెన్సార్ లో. అసలు ఆ డైలాగ్స్ అక్కడ అవ‌స‌రం లేదు కూడా. కానీ ఎందుకు పెట్టాడో దర్శకుడికే తెలియాలి. మధ్యలో ఈ సినిమా దర్శకుడు కూడా ఓ పాత్ర వేసి తనకు కూడా డ్యాన్స్ వచ్చు అని నిరూపించుకోడానికి పెట్టిన పాట. అది కూడా హీరో ఊహల్లో జరిగేదే.

చివరి అరగంట పోలీస్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి కథనం కాస్త పరిగెడుతుంది. పోలీస్ కి సంబంధించిన ట్విస్ట్ ఈజీగా గెస్ చేసేయొచ్చు. క్లైమాక్స్ లో రెండు ట్విస్ట్ లు ఊహించలేము. ఆ ట్విస్ట్ లు అప్పటిదాకా జరిగిన కథకు వ్యతిరేకంగా సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. ఈ సినిమాలో ఎమోషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫ్లాష్ బ్యాక్ ఒక బాబు ఎమోషన్ తప్ప మిగిలినవి ఏవీ కనెక్ట్ అవ్వవు. సినిమాలో అక్కడక్కడా కొంత కామెడీ మాత్రం వర్కౌట్ అయింది. ఈ సినిమా దర్శకుడు తన మాటలతో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ అయి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ సినిమాకు కూడా బాహుబలి, RRR తర్వాత ఇదే సినిమా అని ఓ రేంజ్ లో కామెంట్స్ చేసారు. సినిమా చూసాక వెంకటేష్ మహా పై విమర్శలు రాకుండా ఉంటే చాలు.

ప్రపంచమే ఇల్లు అనుకునే ఓ దేశ సంచారి ఇల్లే ప్రపంచంగా ఎలా మారిపోతాడు. తనకు వచ్చిన అనుమానంతో తను ఎదుర్కున్న సమస్యలు ఏంటి అనే కథాంశంతో తెరకెక్కించారు. కాకపోతే ఒక కథ, కథనం సినిమాగా తెరకెక్కించాలి అని కాకుండా. ఓ రెగ్యులర్ పాత పాయింట్ ని నాకు సాంకేతికంగా చాలా వర్క్ తెలుసు, నాకు అన్నిట్లో జ్ఞానం ఉంది అని డైలాగ్స్, విజువల్స్ తో దర్శకుడు తన కోసం తాను తీసుకున్న ఓ ప్రయోగాత్మక సినిమా అనిపిస్తుంది ఈ రావు బహదూర్. ఇక రావు బహదూర్ అంటే ధైర్యం గల యువరాజు అని సినిమాలోనే తెలిపారు. ఓపిక ఉంటే, హాలీవుడ్ స్లో నేరేషన్ సినిమాలు నచ్చితే ఈ సినిమా చూడొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

ఈ సినిమాకు సత్యదేవ్ చాలా ప్లస్ అయ్యాడు. రెండు పాత్రల్లో అదరగొట్టాడు. ఇప్పటికే నటన విషయంలో ప్రశంసలు అందుకున్న సత్యదేవ్ ఈ సినిమాలో ముసలి పాత్రలో తన బెస్ట్ ఇచ్చాడు. తన కెరీర్ బెస్ట్ వర్క్ రావు బహదూర్ అని చెప్పొచ్చు. మలయాళ నటి దీప థామస్ నర్స్, తల్లి పాత్రల్లో బాగా నటించింది. వికాస్ ముప్పాళ డాక్టర్ పాత్రలో చాలా బాగా నటించారు. నటి బాల పర్సార్ అచ్చాయమ్మా పాత్రలో అక్కడక్కడా నవ్విస్తుంది. ప్రణయ్ వాకా, ఆనంద్ భారతి, చైల్డ్ ఆర్టిస్ట్ కిరణ్.. మిగిలిన నటీనటులు అంతా బాగానే నటించారు.

Also Read : ‘సూపర్ సుబ్బు’ వెబ్ సిరీస్ రివ్యూ.. సె*క్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా సందీప్ కిషన్..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్, సినిమాటిక్ షాట్స్ మాత్రం చాలా బాగున్నాయి. మ్యాజికల్ రియలిజంగా చూపించడానికి చేసిన సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. సాంగ్స్ ఏవి వర్క్ అవుట్ అవ్వలేదు. ఎడిటింగ్ లో అక్కర్లేని ఐటెం సాంగ్, కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్.

ఒక పాత పాయింట్ తీసుకొని అనుమానం పెనుభూతం అనే లైన్ తో సినిమాటిక్ గా కొత్తగా చూపించాలని ప్రయోగం చేసాడు దర్శకుడు. ఈ సినిమాకు ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా బాగా వర్క్ చేసింది. కాస్ట్యూమ్స్, మేకప్ డిపార్ట్మెంట్స్ కూడా ఎక్కువగానే కష్టపడ్డారు . నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘రావు బహదూర్’ సినిమా భార్య మీద వచ్చిన అనుమానంతో బతికే ఓ వ్యక్తి కథ. విజువల్ గా కొత్తగా చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.