×
Ad

Sampradayini Suppini Suddapoosani : ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ రివ్యూ.. శవంతో ఈ ఫ్యామిలీ ఏం చేసింది..?

ఒకప్పుడు జంటగా హిట్ సినిమాలు అందించిన శివాజీ, లయ నుంచి వస్తున్న సినిమా కావడం, క్రైమ్ కామెడీ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. (Sampradayini Suppini Suddapoosani)

  • Published On : March 6, 2026 / 09:26 PM IST

Sampradayini Suppini Suddapoosani

Sampradayini Suppini Suddapoosani : శివాజీ, లయ జంటగా తెరకెక్కిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో శివాజీ నిర్మాణంలో సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రోహన్, అలీ, ధనరాజ్, ప్రిన్స్,జబర్దస్త్ ఇమ్మానుయేల్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ సినిమాని రిలీజ్ చేసారు. నేడు మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే..

శ్రీరామ్(శివాజీ) నిజాయితీగా పనిచేసే పంచాయితీ కార్యదర్శి. తన భార్య ఉత్తర(లయ), కొడుకు మిట్టు(రోహన్) చేసే అల్లరి పనులతో ఫ్రస్టేట్ అవుతుంటాడు. ఆ ఊరి SI విక్రమ్(ప్రిన్స్)తో, MLA తిమ్మప్పతో శ్రీరామ్ కి గొడవలు ఉంటాయి. ఓ రోజు విక్రమ్ శ్రీరామ్ ఇంట్లో లేని టైంలో ఇంటికి వస్తాడు. అనుకోకుండా అల్లరి చేస్తూ మిట్టు విక్రమ్ ని కాల్చడంతో అతను చనిపోతాడు. పోలీస్ చనిపోయాడని తెలిసి శ్రీరామ్, ఉత్తర తమ కొడుకు బాగుండాలి అని ఆ శవాన్ని మాయం చేయాలనుకుంటారు.

అదే సమయంలో MLA తిమ్మప్పకు చెందిన మనుషులు శ్రీరామ్ ని వెతుకుతూ ఉంటారు. పోలీసులకు కూడా అనుమానమొచ్చి శ్రీరామ్ ని వెతుకుతారు. ఆ పోలీస్ శవంతో శ్రీరామ్, అతని ఫ్యామిలీ పడ్డ ఇబ్బందులు ఏంటి? ఆ శవాన్ని ఎలా మాయం చేస్తారు? అసలు విక్రమ్ ని ఎవరు చంపారు? MLA మనుషులు శ్రీరామ్ ని ఎందుకు వెతుకుతున్నారు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Mension House Mallesh : ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీ రివ్యూ.. తాగుబోతుకి శృంగారంలో ఆ సమస్య ఉంటే..

సినిమా విశ్లేషణ..

ఒకప్పుడు జంటగా హిట్ సినిమాలు అందించిన శివాజీ, లయ నుంచి వస్తున్న సినిమా కావడం, క్రైమ్ కామెడీ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ హాఫ్ లోనే అన్ని పాత్రల పరిచయం, పోలీస్ చనిపోవడం, ఆ శవంతో ఈ ఫ్యామిలీ పడ్డ ఇబ్బందులతో కామెడీగా, సస్పెన్స్ గా సాగుతుంది. ఇంటర్వెల్ కి మంచి బ్యాంగ్ తో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది.

సెకండ్ హాఫ్ కూడా ఇదే శవంతో సస్పెన్స్ కామెడీ కాస్త సాగదీశారు కానీ క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ లు ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తారు. గతంలో ఒక శవాన్ని పక్కనపెట్టుకొని అది దాయడానికి పడే కష్టాలతో అనేక సినిమాలు వచ్చాయి. అయితే ఇది ఒక ఫ్యామిలీ చేస్తే ఎలా ఉంటుంది అని డార్క్ కామెడీగా తెరకెక్కించారు. మొదట 20 నిముషాలు కాస్త సాగదీసినా పోలీస్ మర్డర్ తో కథ ఆసక్తికరంగా మారుతుంది. సస్పెన్స్ డ్రామాని బాగానే మెయింటైన్ చేసారు. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. శివాజీ – లయ మధ్య కొన్ని భార్య భర్తల సన్నివేశాలు కూడా బాగున్నాయి.

పిల్లల కోసం పేరెంట్స్ ఏమైనా చేస్తారు అనే ఎమోషన్ ని ఇంకాస్త బాగా పండించాల్సింది. సీరియస్ సన్నివేశాల్లో కూడా కొన్ని చోట్ల చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ తో అక్కర్లేని కామెడీ చేయించడం వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ సాగదీసినా క్లైమాక్స్ మాత్రం ఫాస్ట్ గా ట్విస్టులతో ఇంట్రెస్ట్ గా సాగుతుంది. సినిమా అంతా అయ్యాక ఓ అక్కర్లేని ప్రమోషనల్ సాంగ్ పెట్టారు. సస్పెన్స్ థ్రిల్లర్, డార్క్ కామెడీ సినిమాలు చూసేవాళ్ళు ఈ సినిమాని చూసేయొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న శివాజీ ఫ్యామిలీ కోసం తపన పడే పాత్రలో మెప్పించాడు. లయ కూడా సరికొత్త పాత్రలో డామినేట్ చేసే వైఫ్ గా బాగా నటించారు. రోహన్ కామెడీ వర్కౌట్ అయినా కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. ప్రిన్స్ కాసేపే కనిపించినా పర్వాలేదనిపించారు.

జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ అక్కడక్కడా నవ్వించాడు. పమ్మి సాయి, MLA పాత్ర చేసిన వ్యక్తి, ధనరాజ్, సమీర్, అలీ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు. బండ్ల గణేష్, బబ్లూ, భోలే షవాలీ ప్రమోషనల్ సాంగ్ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.

Also Read : Saraswathi : ‘సరస్వతి’ మూవీ రివ్యూ.. వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఎలా ఉందంటే..?

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అయింది. అక్కడక్కడా కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేస్తే బెటర్. డార్క్ కామెడీగా మర్డర్ మిస్టరీ ఓ ఫ్యామిలీ చుట్టూ కథ రాసుకొని బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మర్డర్ మిస్టరీలో ఇరుక్కున్న ఓ ఫ్యామిలీ చుట్టూ తిరిగే క్రైమ్ కామెడీ సినిమా. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.