‘నీట్’ గురించి సూర్య చేసిన వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార‌ణ చ‌ర్య‌లు..

  • Publish Date - September 14, 2020 / 08:44 PM IST

tamil-actor-suriyas

Actor Suriya’s comments on NEET: న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యవహరించాడంటూ తమిళ స్టార్ హీరో సూర్యపై హైకోర్టు న్యాయమూర్తి ఎస్ఎం సుబ్ర‌హ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్య‌పై కోర్టు ధిక్కార‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ మద్రాసు హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి లేఖ రాశారు.


వివరాళ్లోకి వెళ్తే.. కరోనా కాలంలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షల భయంతో తమిళనాడులో ఒకేరోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘటన తమిళనాట సంచలనంగా మారింది. ఈ ఆత్మహత్యలపై సూర్య ఘాటుగా స్పందించాడు.


‘‘నీట్ భయంతో ఒకేరోజు ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారనే వార్త విని షాక్ అయ్యాను. పరీక్షలు రాయడానికి కూర్చున్నవాళ్లని అభినందించాల్సిందిపోయి.. ఓదార్పు మాటలు చెప్పాల్సిన పరిస్థితి రావడం కంటే సిగ్గుచేటు విషయం మరోటిలేదు.. కరోనా భయంతో కోర్టులకు రాకుండా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయ విచార‌ణ‌లు చేస్తున్న గౌరవ న్యాయమూర్తులు.. విద్యార్థులను మాత్రం నీట్ పరీక్షకు హాజరు కమ్మంటూ ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరం. ప్రభుత్వం, కోర్టులు క్రూరంగా వ్యవహరిస్తున్నాయ’’ని సూర్య ఆగ్రహం వ్యక్తం చేశాడు.


సూర్య ట్వీట్‌కు తమిళనాట పెద్ద ఎత్తున మద్దతు లభించింది. విద్యార్థులు సోషల్ మీడియాలో #SURIYAagainstNEET అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. అయితే సూర్య చేసిన ప్రకటన న్యాయవ్యవస్థను కించపరిచేదిగా ఉందని, ఆయనపై కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తికి న్యాయ‌మూర్తి ఎస్ఎం సుబ్ర‌మ‌ణ్యం లేఖ రాశారు. మరి ఈ లేఖపై ప్రధాన న్యాయమూర్తి ఎలా స్పందిస్తారో చూడాలి.


అలాగే మరో నటుడు మాధవన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ‘‘నీట్ పరీక్షకు ముందు రోజే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే కానీ తీర్పు కాదు’’ అని ఆయన పేర్కొన్నారు.