Bharath Kanth : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. హీరో మృతి
భరత్ ప్రయాణిస్తున్న కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హీరో భరత్‌తో పాటు సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ కూడా చనిపోయారు.
- Naveen
- Updated on- May 11, 2026 / 01:11 AM IST
Bharath Kanth : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హీరో భరత్ కాంత్ మృతి చెందారు. బొంగులూరు గేట్ వద్ద భరత్ కారు ప్రమాదానికి గురైంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. భరత్ ప్రయాణిస్తున్న కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హీరో భరత్‌తో పాటు సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ కూడా చనిపోయారు. త్రిలోక్ సినిమాటోగ్రాఫర్‌గా రాణిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు.
ఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి చెందారు. ఇటీవల విడుదలైన ‘టెనెంట్’ సినిమాలో హీరోగా నటించారు భరత్ కాంత్. తెలుగు, హిందీ వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేశారు. ఇక తిలక్ పలు తెలుగు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. నెల్లూరు వెళ్లిన వీరు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అయిపోయింది. శరీరాలు చిద్రమైపోయాయి.
భరత్, త్రిలోక్ మృతితో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఇద్దరూ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులతో పాటు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
నెల్లూరుకి చెందిన భరత్ కాంత్, త్రిలోక్ చిన్ననాటి స్నేహితులు. సినీ రంగంపై మక్కువతో పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. నానక్‌రామ్‌గూడలో నివాసం ఉంటున్నారు. ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నారు.
