Priyanka Chopra: ‘వారణాసి’ బ్యూటీ ప్రియాంక చోప్రాకి అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ వాన్ గార్డ్’ పురస్కారానికి ఎంపిక

ప్రతిష్టాత్మక గ్లోబల్ వాన్‌గార్డ్ అవార్డుకు నామినేట్ అయిన ప్రియాంక చోప్రా(Priyanka Chopra).

Varanasi movie heroine Priyanka Chopra nominated for Global Vanguard Award

  • గ్లోబల్ వేదికపై మెరవనున్న ప్రియాంక చోప్రా
  • మే 9న లాస్ ఏంజిల్స్‌లో జరుగనున్న వేడుక
  • 25 ఏళ్ళ సినీ ప్రస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు

Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆసియా పసిఫిక్ కమ్యూనిటీకి చెందిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులను గౌరవించే ‘గోల్డ్ హౌస్’ సంస్థ, ఆమెను ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ వాన్ గార్డ్’ పురస్కారానికి ఎంపిక చేసింది. మే 9న లాస్ ఏంజిల్స్‌లోని మ్యూజిక్ సెంటర్‌లో వైభవంగా జరగనున్న ‘గోల్డ్ గాలా – 2026’ ఐదో వార్షికోత్సవ వేడుకలో ప్రియాంక (Priyanka Chopra)ఈ అవార్డును అందుకోనున్నారు. సినిమా రంగంలో పాతికేళ్ల సుదీర్ఘ ప్రయాణంతో పాటు, ఆసియా, పాశ్చాత్య చిత్ర పరిశ్రమల మధ్య వారధిగా నిలుస్తూ ఆమె చూపుతున్న ప్రభావాన్ని ఈ పురస్కారం అభినందిస్తోంది.

Anchor Lasya: గుంటూరులో TCS ఎగ్జిబిషన్‌.. యాంకర్ లాస్య కలెక్షన్ కి సూపర్ రెస్పాన్స్.. ఫొటోలు వైరల్

ఈ ఏడాది ‘ఏ న్యూ గోల్డ్ వరల్డ్’ అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌లో ప్రియాంకతో పాటు అమెరికన్ నటుడు చార్లెస్ మైఖేల్ మెల్టన్, సౌత్ కొరియన్ సింగర్ కిమ్ యూన్ జే వంటి ప్రముఖులు కూడా వివిధ విభాగాల్లో అవార్డులు అందుకోనున్నారు. కేవలం సినిమా రంగానికే పరిమితం కాకుండా వ్యాపారం, ఫ్యాషన్, క్రీడలు వంటి పలు రంగాల్లో రాణించిన ప్రతిభావంతులను కూడా ఈ వేదికపై సత్కరించనున్నారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 650 మంది గ్లోబల్ సెలబ్రిటీల సమక్షంలో ఈ వేడుక అత్యంత కన్నుల పండుగగా జరుగనుంది.

గోల్డ్ హౌస్ ప్రకటించిన ‘గోల్డ్ 100’ జాబితాలోని ప్రముఖులకు ఈ పురస్కార ప్రదానం జరగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ యవనికపై భారతీయ నటి ఈ స్థాయి గౌరవాన్ని అందుకోవడం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. దేశ సరిహద్దులు దాటి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన ప్రియాంక ప్రయాణం, భవిష్యత్ తరాలకు గొప్ప స్ఫూర్తినిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా తనదైన ముద్ర వేసిన ప్రియాంకకు ఈ అవార్డు దక్కడం ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోనుంది.