అదే రోజు.. 2019 వేణు మాధవ్.. 2020 ఎస్పీ బాలు..

  • Publish Date - September 26, 2020 / 06:27 PM IST

Venu Madhav and SP Balu: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినీ పరిశ్రమను, సంగీత ప్రపంచాన్ని, అభిమానులను తీరని శోకంలో ముంచేసి అందరికీ ఇక శెలవంటూ కానరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు. అయితే బాలు చనిపోయిన రోజు సినీ ఇండస్ట్రీకి నిజంగానే చీకటి రోజు.


ఎలా అంటే.. 2019, సెప్టెంబర్‌ 25న అంటే బాలు చనిపోయిన రోజే.. టాలీవుడ్‌ ఇండస్ట్రీ టాప్ కమెడియన్‌ వేణు మాధవ్‌ని కోల్పోయింది. హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన వేణు మాధవ్‌ సెప్టెంబర్‌ 25నే చనిపోయారు. సరిగ్గా ఏడాదికి అదే రోజు బాలు దూరమవ్వడం చూస్తుంటే.. ఆ రోజు సినిమా ఇండస్ట్రీకి చీకటి రోజుగా వర్ణించక తప్పదు.


ఇదే విషయం మెగా బ్రదర్‌ నాగబాబు కూడా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. ‘నాకు అత్యంత ఆప్తులైన ఇద్దరినీ ఒకే రోజు ఏడాది గ్యాప్‌లో కోల్పోవడం ఎంతో బాధగా ఉంది. వేణు మాధవ్‌ కూడా మా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు. ఇక బాలు గురించి చెప్పేదేముంది. మా కుటుంబ సభ్యుడే. అలాంటి ఇద్దరూ.. ఏడాది గ్యాప్‌లో ఒకే రోజు దూరమవ్వడం మనసుని కలచివేస్తుంద’ని తెలుపుతూ.. ఎస్‌.పి. బాలుకి నివాళులు అర్పించారు నాగబాబు.