Omprakash Bishnoi : సోషల్ మీడియాలో 21లక్షల మంది ఫాలోవర్లు.. ఎన్నికల్లో వచ్చింది 33 ఓట్లే..! రాజస్థాన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు దిమ్మతిరిగే షాక్..
Omprakash Bishnoi : రాజస్థాన్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు దారుణమైన చేదు అనుభవం ఎదురైంది.
- Harish Thanniru
- Published on- October 27, 2026 / 12:14 PM IST
Omprakash Bishnoi
Omprakash Bishnoi : రాజస్థాన్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు దారుణమైన చేదు అనుభవం ఎదురైంది. అతనికి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో కలిపి 21 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశాడు. గెలుపు నల్లేరుపై నడకేనని అందరూ భావించారు.. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయనకు దక్కింది కేవలం 33ఓట్లే. ఈ ఫలితం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా, ఓసియాన్ తహసీల్ పరిధిలోని ఇండోన్ కి ధాని-2 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఓంప్రకాశ్ బిష్ణోయ్ అనే వ్యక్తి పోటీ చేశాడు. ఆయన జ్యోతిష్యుడిగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 14 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 2.32 లక్షల మంది, యూట్యూబ్‌లో దాదాపు 5 లక్షల మంది మొత్తం 21లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బిష్ణోయ్ పోటీ చేస్తే గెలుపు ఖాయమని గ్రామస్తులు చెప్పడంతో.. అతను సర్పంచ్ పదవికి పోటీ చేశాడు. ఇక గెలుపు నాదేనని ధీమా వ్యక్తం చేశాడు. కానీ, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ వేరు.. ఓట్లు రాబట్టుకోవడం వేరు అనే విషయం అతనికి ఎన్నికల ఫలితాల తరువాత స్పష్టత వచ్చింది.
ఇంద్రావ్ కి ధాని-2 గ్రామంలో సుమారు 1,600 మంది ఓటర్లు ఉండగా.. బిష్ణోయ్‌కు కేవలం 33 ఓట్లు మాత్రమే వచ్చాయి. పోటీలో ఉన్న మరో అభ్యర్థి, ఉపాధ్యాయుడికి 527 ఓట్లు లభించాయి. కార్ల వ్యాపారం చేసే అభ్యర్థి విజయం సాధించాడు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ, ఆ ఆదరణ ఎన్నికల్లో ఓట్లుగా మారలేదు.
ఓం ప్రకాశ్ బిష్ణోయ్ మాట్లాడుతూ.. గ్రామస్థులు తనను ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రోత్సహించారు. మద్దతుగా ఉంటామని చెప్పారు. దీంతో నేను సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకిదిగాను. తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధితోపాటు.. ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం అనేక హామీలు ఇచ్చాను. అయితే, ఫలితాల్లో తనకు కేవలం 33 ఓట్లే వచ్చాయి. అందులోనూ 11 ఓట్లు కుటుంబ సభ్యుల నుంచి వచ్చాయి. మిగిలినవి తనకు సన్నిహితులైన వ్యక్తులు వేశారని బిష్ణోయ్ తెలిపారు.
ఎన్నికల్లో తొలిసారి పోటీ చేయడం ద్వారా ఓటర్లతో వ్యక్తిగతంగా అనుబంధం పెంచుకోవడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నానని చెప్పాడు. ఓటమితో వెనక్కి తగ్గకుండా గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బిష్ణోయ్ వెల్లడించాడు.
