×
Ad

Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతోంది..? భారీగా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు.. ఎక్కువ మంది మహిళలు, బాలికలే..

Delhi : దేశ రాజధాని ఢిల్లీలో మిస్సింగ్ కేసులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో 800మందికిపై తప్పిపోయినట్లు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.

Delhi

  • ఢిల్లీలో భారీగా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు
  • గతేడాది మొత్తం 24,508 కేసులు నమోదు
  • బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, బాలికలే

Delhi : దేశ రాజధాని ఢిల్లీలో మిస్సింగ్ కేసులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో 800మందికిపైగా తప్పిపోయినట్లు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు మూడింట రెండు వంతుల మంది మహిళలు, బాలికలే ఉన్నట్లు ఢిల్లీ పోలీసుల డేటా స్పష్టం చేస్తోంది. అంటే ప్రతీరోజూ ఢిల్లీలో సగటున 54మంది కనిపించకుండా పోతున్నారు. మిస్సింగ్ కేసుల్లో 509మంది మహిళలు, బాలికలు ఉండగా.. 298 మంది పురుషులు ఉన్నారు.

Also Read : Rajasthan : భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లి ప్రియుడితో హత్యచేయించిన భార్య.. రోడ్డు ప్రమాదం అంటూ డ్రామా.. పోలీసుల ఎంట్రీతో..

పోలీస్ డేటా ప్రకారం.. తప్పిపోయిన వారిలో మొత్తం 191 మంది మైనర్లు ఉన్నారు. 616 మంది పెద్దలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, వీరిలో 235 మందిని గుర్తించగా.. 572 మంది ఆచూకీ లభించలేదు. 2026 సంవత్సరం ప్రారంభ నెలలో 807 మంది అదృశ్యమైనట్లు నివేదికలు వెలుగులోకి రావడంతో.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘ఢిల్లీలో కేవలం 15రోజుల్లోనే 807 మంది అదృశ్యమయ్యారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ పరిస్థితులు సాధారణమైనవి కావు. ఇవి చాలా భయానకంగా ఉన్నాయి. దేశ రాజధానిలో ప్రజల భద్రతను దేవుని దయకు వదిలివేయబడింది. ఢిల్లీలో ప్రతి స్థాయిలో బీజేపీకి పూర్తి అధికారం ఉంది. అయినప్పటికీ ఢిల్లీ ఎందుకు అంత అసురక్షితంగా మారింది..? ’’ అంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.

ఢిల్లీలో ప్రతిరోజూ 13 మంది పిల్లలు అదృశ్యం..
జనవరి 1 నుంచి 15 మధ్యలో రోజుకు సగటున 13మంది పిల్లలు అదృశ్యమయ్యారని ఢిల్లీ పోలీసుల డేటా చూపిస్తుంది. తప్పిపోయిన 191 మంది మైనర్లలో 146 మంది బాలికలే. మైనర్లలో 169 మంది 12 నుంచి 18ఏళ్ల వయస్సు గల టీనేజర్లు. వీరిలో 138 మంది బాలికలు, 31మంది బాలురు ఉన్నారు. పోలీసులు 29మంది బాలికలు, 19మంది బాలురను కొనుగొన్నారు. కానీ, దాదాపు 71శాతం మంది కౌమారదశలో ఉన్నవారు. మొత్తం 121మంది జాడ ఇంకా కనిపించలేదు. 8 నుండి 12 సంవత్సరాల వయస్సు గల వారిలో, ఎనిమిది మంది బాలురు, ఐదుగురు బాలికలు సహా 13 మంది పిల్లలు తప్పిపోయారు. ఇప్పటివరకు ముగ్గురు బాలురు మాత్రమే కనుగొనబడ్డారు. ఎనిమిది సంవత్సరాల లోపు విభాగంలో, తొమ్మిది మంది పిల్లలు తప్పిపోయినట్లు నివేదించబడింది. ముగ్గురు బాలురు కనుగొనబడ్డారు, ఆరుగురు పిల్లలు ఇంకా ఆచూకీ తెలియలేదు.

ఇదిలాఉంటే.. 2025 సంవత్సరంలో ఢిల్లీలో మొత్తం 24,508 మంది తప్పిపోయినట్లు నివేదించబడింది. ఈ కేసుల్లో 60శాతం కంటే ఎక్కువ మంది మహిళలు అంటే 14,870 మంది ఉండగా, 9,638 మంది పురుషులు ఉన్నారు. పోలీసులు 15,421 మంది వ్యక్తులను గుర్తించారు, కానీ 9,087 కేసులు ఇంకా పరిష్కారం కాలేదు.