73 Year Old Woman : ”వరుడు కావలెను” అంటూ ప్రకటన ఇచ్చిన ఆ 73ఏళ్ల బామ్మకు పెళ్లి సంబంధం వచ్చింది.. తాత వయసు ఎంతంటే..

  • Published on- April 11, 2021 / 10:16 AM IST

73 Year Old Woman

73 Year Old Woman : ”వరుడు కావలెను’ అంటూ ఇటీవల ఓ పేపర్ ప్ర‌క‌ట‌న ఇచ్చిన 73ఏళ్ల బామ్మ గుర్తుంది కదూ? ఆమె ప్రయత్నం ఫలించింది. కర్నాటక మైసూరుకు చెందిన బామ్మను వెతుక్కుంటూ ఓ పెళ్లి సంబంధం వచ్చింది. ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని 69ఏళ్ల తాత(రిటైర్డ్ ఇంజినీర్) ముందుకొచ్చాడు. బామ్మ‌కు ఫోను చేసి క‌బుర్లు కూడా చెప్పాడు. ఫోన్ లోనే వారిద్ద‌రు మ‌న‌సు విప్పి మాట్లాడుకున్నారు.

73ఏళ్ల బామ్మ రిటైర్డ్ టీచర్. భ‌ర్త‌తో విభేదాలు రావ‌డంతో కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. ఆమె జీవితంలో ఆ ఘటన చాలా బాధను నింపింది. ఆ తర్వాత చాలా ఏళ్లు మళ్లీ పెళ్లి గురించి ఆలోచన చెయ్యలేదు. ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. కాగా, జీవితంలో ఆమెకు ఓ తోడు అవసరమని కుటుంబ సభ్యులు ఆమెను పెళ్లికి ఒప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రిపారు. చివ‌ర‌కు ఆమె ఓకే చెప్పింది. ఈ వయసులో ఒంటరిగా ఇంటి నుంచి బస్టాప్ కి నడుచుకుంటూ వెళ్లాలన్నా.. ఒంటరిగా జీవించాలన్నా భయమేస్తోందని బామ్మ చెప్పింది. ఆ తర్వాత ‘వరుడు కావలెను’ అంటూ ప్రకటన ఇచ్చింది. కొన్ని వారాల కిందట బామ్మ ఇచ్చిన వరుడి ప్రకటన వైరల్ అయ్యింది. కాబోయే భర్త ఆరోగ్యవంతుడై ఉండాలని, కచ్చితంగా బ్రాహ్మణుడై ఉండాలని షరతు కూడా పెట్టిందావిడ.

కాగా, 69 ఏళ్ల తాత విశ్రాంత ఇంజనీర్‌. ఆయన భార్య ఏడేళ్ల క్రిత‌మే మృతి చెందింది. ఒంటరిగా ఉంటున్న ఆయన కూడా ఓ తోడు కోసం వెతుక్కుంటున్నాడు. మరో వ్యక్తితో కలిసి తన శేష జీవితాన్ని గడపాలని కోరుకున్నాడు. ఇంతలో బామ్మ ప్రకటన ఆ తాతకు బాగా ఉపయోగపడింది. మరి…బామ్మ..ఆ తాతను ఓకే చేస్తుందో లేదో చూడాలి.