Bengaluru ex ISRO employee Murder
Bengaluru Murder : బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. 76ఏళ్ల ఇస్రో మాజీ ఉద్యోగి నాగేశ్వర్ రావు బుధవారం ఉదయం తన భార్య సంధ్యాశ్రీ (60)ని గొంతు కోసి హత్య చేశాడు. ఆ తరువాత తనూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. కానీ, భయపడి తన నిర్ణయాన్ని విరమించుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని సీనియర్ లివింగ్ కమ్యూనిటీలో చోటు చేసుకుంది. అయితే, ప్రస్తుతం నిందితుడు మానసిక సమస్యల కారణంగా చికిత్స పొందుతున్నాడని, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. విజయవాడకు చెందిన నాగేశ్వరరావు ఉద్యోగ నిమిత్తం కొన్నేళ్ల కిందట బెంగళూరుకు వచ్చాడు. అవలహళ్లి బొమ్మెనహళ్లిలోని ది వర్చుసో అపార్టుమెంట్ లో దంపతులు ఉంటున్నారు. వీరి ఏకైక కుమార్తె విదేశాల్లో ఉంటోంది. కొద్దిరోజుల కిందటి నుంచి నాగేశ్వరరావు మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితం భారమైందని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అయితే, తాను ఆత్మహత్య చేసుకుంటే తన భార్యను ఎవరు చూసుకుంటారని భావించి నాగేశ్వరరావు.. బుధవారం ఉదయం తన భార్యను గొంతుకోసం చంపేశాడు.
భార్యను హత్య చేసిన తరువాత నాగేశ్వరరావు ఆమె మృతదేహం వద్ద 20 నిమిషాలు కూర్చున్నాడు. ఆ సమయంలో పొరుగువారికి ఫోన్ చేసిన తన భార్యను చంపేశాను.. వెంటనే ఇక్కడికి రండి అంటూ కోరాడు. అయితే వారు దానిని జోక్ అనుకున్నారు. నాగేశ్వరరావు పదేపదే ఫోన్ చేయడంతో వాళ్లు వచ్చి చూడగా సంధ్యశ్రీ చనిపోయి ఉంది. వారిని చూసిన నాగేశ్వరరావు లోపలికి పరుగెత్తాడు. సంధ్య చనిపోవటాన్ని గమనించిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదే సమయంలో అపార్టులో ఉన్న ఓ వైద్యుడిని పిలిపించారు. సంధ్యను పరీక్షించిన వైద్యుడు ఆమె చనిపోయినట్లు నిర్ధారించాడు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని నాగేశ్వరరావును అదుపులోకి తీసుకొని అతని భార్య సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు ఘటన స్థలికి చేరుకున్న సమయంలో నాగేశ్వరరావు సోఫాలో కూర్చొని ఉన్నాడు. పోలీసులను చూసి.. నా భార్యను నేనే చంపాను. నేను ఇప్పటి నుంచి మరో మూడు నాలుగేళ్ల కంటే ఎక్కువ కాలం జీవించకపోవచ్చు. నా మరణం తరువాత ఆమెను ఎవరు చూసుకుంటారు..? బెంగళూరులో మాకు దగ్గరి బంధువులు లేరు అని అతను చెప్పాడు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. పోలీసులు నాగేశ్వరరావును అరెస్టు చేసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నాగేశ్వరరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్య మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.