Kanpur Emotional Incident : ఆ బుడ్డోడు 1000/10… ఆ వీడియో తీసినోడు.. 0/1000.. గుండెల్ని పిండేస్తున్న దృశ్యాలు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
Kanpur Emotional Incident : కాన్పూర్‌లో గుండెలను పిండేసే ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియోను తీసిన వ్యక్తిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
- Harish Thanniru
- Published on- April 3, 2026 / 01:29 PM IST
Kanpur Emotional Incident
- కాన్పూర్‌లో గుండెలను పిండేసే ఘటన
- ఎండదెబ్బతో స్పృహతప్పి రోడ్డుపై పడిపోయిన మహిళ
- తల్లిని కాపాడుకునేందుకు ఎనిమిదేళ్ల బాలుడు ప్రయత్నం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- వీడియో తీసిన వ్యక్తిపై మండిపడుతున్న నెటిజన్లు
Kanpur Emotional Incident : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో గుండెలను పిండేసే ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎండ వేడికి తట్టుకోలేక రోడ్డుపై స్పృహతప్పి పడిపోయిన తల్లిని కాపాడుకునేందుకు ఎనిమిదేళ్ల బాలుడు చేసిన ప్రయత్నం అందరి హృదయాలను కలచివేస్తోంది. స్పృహతప్పి రోడ్డుపై పడిపోయిన తల్లికి నీటిని అందించేందుకు బాలుడు కొద్దిదూరం నుంచి కాళ్లకు చెప్పలు లేకుండా నీళ్ల బాటిల్‌తో రోడ్డుపై పరుగెత్తుకుంటూ వెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పిల్లాడు చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తూనే.. వీడియో తీసిన వ్యక్తిపై, అటుగా రోడ్డున పోతున్నవారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
నెటిజన్లు ఆ బాలుడి ప్రేమను, ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో సహాయం చేయడానికి బదులుగా.. వీడియో తీసిన వ్యక్తిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓ మహిళ స్పృహ తప్పి రోడ్డుపై పడిపోయినా అటుగా వెళ్లేవారు పట్టించుకోకపోవటం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సహాయం చేయకుండా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసే వారిపై చర్యలకు కఠిన చట్టాలు తీసుకురావాలని, తద్వారా వారికి గుణపాఠం చెప్పాలంటూ నెటిజన్ల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఓ నెటిజన్ స్పందిస్తూ.. పిల్లవాడికి సహాయం చేయడానికి బదులుగా వీడియోలు చిత్రీకరించడం నిజంగా నీమైన పని అంటూ మండిపడ్డారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. మానవత్వం తన ఆత్మను కోల్పోతోంది. ఒక చిన్నారి తన తల్లిని బతికించుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలి.. ఇలాంటి సమయాల్లోనూ ఇలా వ్యవహరించడం చూస్తుంటే సమాజంగా మనం ఎటువైపు పోతున్నాం..? అంటూ ప్రశ్నించారు. ఇదేంటి? ఆ పేద మహిళకు సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదా? సమాజంగా మనం ఎంతగా దిగజారిపోయాం, అయినా విశ్వగురువులు కావాలనుకుంటున్నాం అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఇలా సోషల్ మీడియోలో నెటిజన్లు చిన్నారికి సహాయం చేయకుండా వీడియో తీసిన వ్యక్తిపై.. ఆ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
