Abhijit Deepke: సీజేపీ నేత అభిజీత్ దీప్కేపై మహిళ సిరా దాడి.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత!
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(Abhijit Deepke)పై ఓ గుర్తుతెలియని మహిళ సిరా లాంటి ద్రవంతో దాడికి పాల్పడింది.
- V Santhosh Kumar
- Updated on- July 18, 2026 / 06:17 PM IST
A Woman ink attach on CJP leader Abhijit Deepke.
- అభిజీత్ దీప్కేపై సిరా దాడి.
- సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం.
- కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్.
Abhijit Deepke: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తీవ్ర కలకలం రేగింది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(Abhijit Deepke)పై ఓ గుర్తుతెలియని మహిళ సిరా లాంటి ద్రవంతో దాడికి పాల్పడింది. తన మద్దతుదారులతో కలిసి ఆయన సమావేశం నిర్వహిస్తూ ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఆ మహిళ దాడికి దిగడంతో దీప్కే అనుచరులు ఆమె వైపు దూసుకెళ్లారు, దీంతో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో కాసేపు తీవ్ర గందరగోళం, ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ దాడి చేసిన మహిళ ఎవరనేది, ఆమె వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటనేది ఇంకా స్పష్టత రాలేదు.
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం:
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను శనివారం ఢిల్లీ పోలీసులు భగ్నం చేసిన కాసేపటికే ఈ దాడి జరగడం గమనార్హం. వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామం తర్వాత తాను కూడా నిరసనకు దిగుతానని అభిజీత్ దీప్కే ప్రకటించిన కొద్దిసేపటికే ఈ సిరా దాడి జరిగింది. ఈ ఘటనపై దీప్కే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ‘నీలం నా రంగు… జై భీమ్!’ అని పోస్ట్ చేశారు.
పేపర్ లీకేజీలపై పోరాటం:
దేశంలో విద్యార్థుల ప్రశ్నపత్రాల లీక్ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఆధ్వర్యంలో సోనమ్ వాంగ్‌చుక్ నిరసనకు దిగారు. జూన్ 28 నుంచి సుమారు 21 రోజుల పాటు సాగిన ఈ నిరవధిక నిరాహార దీక్ష కారణంగా ఆయన దాదాపు 9.5 కిలోల బరువు తగ్గారు. వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతోనే పోలీసులు రంగప్రవేశం చేసి దీక్షను అడ్డుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే గంటల వ్యవధిలోనే అభిజీత్ దీప్కే లక్ష్యంగా ఈ దాడి జరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
