వై’కాపీ’.. టీఆర్ఎస్‌వి కూడా.. : ఆప్ అస్త్రాలు అవే!

  • Publish Date - February 5, 2020 / 03:11 AM IST

ఒక రాష్ట్రంలో ఫలించిన వ్యూహాలను మరో రాష్ట్రంలో ఎన్నికల కోసం వాడుకోవడం చూస్తూనే ఉంటాం.. ఎన్నికల వ్యూహాల్లోనూ మేనిఫెస్టో రూపొందించడంలోనూ ప్రత్యేకంగా రాష్ట్రాల్లో ఎటువంటి విషయాలు ప్రజలను ఆకర్షించాయో చూసుకుని వాటిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటారు ఆయా పార్టీల నాయకులు అయితే ఇప్పుడు త్వరలో దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో కూడా అక్కడి అధికార పార్టీ ఆమ్ ఆద్మీ మళ్లీ అధికారంలోకి రావడానికి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పాలనాపరంగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ప్రకృతిలో మార్పులు, వాతావరణం కాలుష్యం వంటివి మాత్రం ఆ పార్టీకి పెద్ద సవాళ్లే.. ఈ క్రమంలో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే జనాలకు ఆకర్షక పథాకాలను అందుబాటులోకి తీసుకుని రావాలి. ఆ రకంగా ముందుకు సాగేందుకు ఆప్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గత ఎన్నికల నాటికి ఇప్పటికి ఆప్ తీసుకున్న వ్యవహరిస్తున్న తీరులో కచ్చితంగా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మేనిఫెస్టోను కూడా జనాకర్షకంగా రూపొందించింది. 

ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో పార్టీల మేనిఫెస్టోలోని కొన్ని పథకాలను పరిశీలించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకు వచ్చిన ఓ పథకాన్ని కాపీ కొట్టింది. రెండవసారి అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్‌కు సహకరించిన పథకాన్ని ఆప్ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఈ పథకాల ద్వారా మళ్లీ తిరిగి అధికారంలోకి రావాలని ఆప్ భావిస్తుంది. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి కుటుంబాన్ని సంపన్న కుటుంబంలా తీర్చిదిద్దేలా ఎన్నికల మేనిఫెస్టో రూపొందించినట్లు ఇప్పటికే ఆప్ ప్రకటించింది. మేనిఫెస్టోలోని అంశాలు.. నాణ్యమైన వైద్యం, విద్య, శుద్దమైన తాగునీరందించడం, 24 గంటల విద్యుత్‌ సరఫరా, ఇంటి వద్దకే రేషన్‌ సరుకుల సరఫరా చేయడం, 10 లక్షల మంది వయోవృద్ధులకు ఉచిత తీర్థయాత్ర సౌకర్యం కల్పించడం, పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉండగా చనిపోతే వారి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, ప్రజలకు 24 గంటలు మార్కెట్లు అందుబాటులో ఉంచటం పైలట్‌ ప్రాజెక్టుగా ఆప్ తీసుకుంది.

ఇందులో ఇంటి వద్దకే రేషన్‌ సరుకుల సరఫరా చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన గ్రామ వాలంటరీ వ్యవస్థ. దీనిని ఆప్ తన మేనిఫెస్టోలో పెట్టింది. ప్రతి ఇంటికి రేషన్ మనుషుల ద్వారా ఇవ్వాలనేది ఈ పథకం ఉద్ధేశ్యం ఇది వైసీపీ నుంచి కాపీ కొట్టినదే. ఇక శుద్దమైన తాగునీరందించడం, 24గంటలు విద్యుత్ వంటివి మిషన్ భగీరద, మిషన్ కాకతీయ వంటి టీఆర్ఎస్ పథకాలను పోలినవిగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఇక 24 గంటలు మార్కెట్లు అందుబాటులో ఉండేలా పైలట్ ప్రాజెక్టును చేపడతామని వెల్లడించింది ప్రభుత్వం. ఇప్పటికే ముంబైలో ఈ మేరకు నిర్ణయాలను అవలంభిస్తున్నారు.