TVK Joseph Vijay: ఒకటి మా రాజకీయ శత్రువు, మరొకటి మా భావజాల శత్రువు.. ఆ రెండు పార్టీలపై టీవీకే అధ్యక్షుడు విజయ్ సంచలన వ్యాఖ్యలు

కులం కాదు, మతం కాదు, తమిళుడికే నా ప్రాధాన్యత.. మనల్ని ఎవరూ ఆపలేరు.. అని విజయ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విప్లవం..(TVK Joseph Vijay)

TVK Joseph Vijay: ఒకటి మా రాజకీయ శత్రువు, మరొకటి మా భావజాల శత్రువు.. ఆ రెండు పార్టీలపై టీవీకే అధ్యక్షుడు విజయ్ సంచలన వ్యాఖ్యలు

Updated On : August 21, 2025 / 9:15 PM IST

TVK Joseph Vijay: మధురైలో జరిగిన టీవీకే (తమిళగ వెట్రి కజగం) భారీ బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ బీజేపీ, డీఎంకేలపై నిప్పులు చెరిగారు. వాటిని తమ శత్రువులుగా ఆయన అభివర్ణించారు. మా రాజకీయ శత్రువు డీఎంకే అయితే, మా భావజాల శత్రువు బీజేపీ అని విజయ్ చెప్పారు. తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విప్లవం సృష్టిస్తామని విజయ్ ధీమా వ్యక్తం చేశారు.

ఫాసిస్ట్ బీజేపీతో చేతులు కలపము అని తేల్చి చెప్పారు. ఆర్ఎస్ఎస్ ముందు మనం ఎందుకు తలవంచాలి అని విజయ్ ప్రశ్నించారు. బానిసత్వంతో కూడిన పొత్తు అవసరమే లేదన్నారు. సినిమా వాళ్లకు రాజకీయాలా అంటూ హేళన చేస్తున్నారని విజయ్ ధ్వజమెత్తారు. ఎంత విమర్శిస్తే అంత ఎదుగుతా అని వ్యాఖ్యానించారు. కులం కాదు, మతం కాదు, తమిళుడికే నా ప్రాధాన్యత.. మనల్ని ఎవరూ ఆపలేరు.. అని విజయ్ అన్నారు.

ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మోదీ డ్రామా..

టీవీకే రాష్ట్ర స్థాయి సదస్సులో.. తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, నటుడు రాజకీయ నాయకుడు విజయ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తమిల్ ప్రైడ్, చోళుల వారసత్వంపై ఇటీవల బీజేపీ చేసిన ప్రకటనలను 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ లాభం కోసం ఉద్దేశించిన డ్రామాగా అభివర్ణించారు విజయ్.

1,000వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అరియలూర్ లో పర్యటించారు.

ప్రధాని పర్యటనను ప్రస్తావిస్తూ తమిళనాడుకు తన సొంత చరిత్ర గురించి బీజేపీ ఉపన్యాసాలు ఇస్తోందని విజయ్ విమర్శించారు. రాష్ట్రం పట్ల “వివక్ష” చూపుతోందని మండిపడ్డారు.

డీఎంకే.. బీజేపీకి లొంగిపోయింది..
“డీఎంకే ప్రభుత్వం చోళ చక్రవర్తులకు పూర్తి గౌరవం ఇచ్చి ఉంటే, తమిళ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవడానికి ముందుకు వచ్చేది కాదు. బదులుగా, ప్రధాని మోదీ సందర్శనను గౌరవప్రదమైన విషయంగా డీఎంకే స్వాగతించింది.

ఇది గర్వం కాదు, లొంగుబాటు” అని విజయ్ ధ్వజమెత్తారు. డీఎంకే.. తమిళ గర్వాన్ని బీజేపీకి తాకట్టు పెట్టింది విజయ్ ఆరోపించారు.

“కీజాడిలో తమిళ నాగరికత బలమైన ఆధారాలను దాచడానికి ప్రయత్నించిన తర్వాత, కేంద్రం చోళుల ప్రైడ్ గురించి అకస్మాత్తుగా మాట్లాడటం కేవలం నాటకం.

అన్నాదురై స్థాపించిన డీఎంకె తనను తాను రాజీ చేసుకుని తమిళ వ్యతిరేక బిజెపికి లొంగిపోయింది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయ్.

తమిళనాడు రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన విజయ్.. తమిళనాడు సీఎం స్టాలిన్ పైనా విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యమంత్రిని “స్టాలిన్ మామ” అని పిలిచారు.

మీది పేలవమైన పరిపాలన అంటూ విమర్శలు గుప్పించారు.

తమిళగ వెట్రి కజగం రెండవ సర్వసభ్య సమావేశం మధురైలో జరిగింది. వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. విజయ్ తన ప్రసంగంలో అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) కు భారతీయ జనతా పార్టీతో రహస్య పొత్తు ఉందని ఆరోపించారు.

DMKని తన రాజకీయ ప్రత్యర్థిగా గుర్తించారు. తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో TVK, DMK మధ్యే పోటీ ఉంటుందన్నారు.

తమిళనాడులోని డీఎంకే పాలనను ప్రశ్నిస్తూ “స్టాలిన్ అంకుల్… ఇది చాలా తప్పు అంకుల్” అని విజయ్ అన్నారు. “మీ పాలన నిజాయితీగా, న్యాయంగా ఉందా, ఈ ప్రభుత్వంలో ప్రజలకు భద్రత ఉందా?” అని స్టాలిన్ సర్కార్ ను నిలదీశారు.

ప్రస్తుత పాలనలో శాంతిభద్రతలు పేలవంగా ఉన్నాయని విజయ్ ఆరోపించారు.

అంకుల్.. నెలకు వెయ్యి ఇస్తే సరిపోతుందా?
”నెలకు వెయ్యి రూపాయల సాయం ఇస్తే సరిపోతుందా మామయ్యా?” అని సీఎం స్టాలిన్ ని అడిగారు విజయ్. స్టాలిన్ పాలన తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తోందని విజయ్ ఆరోపించారు.

Also Read: 25% టారిఫ్ గడువు ముంచుకొస్తున్న వేళ ట్రంప్‌కు నిక్కీ హేలీ హెచ్చరిక.. 5 పాయింట్లు.. ఈ టారిఫ్‌లు అమలు చేస్తేగనుక..