AAP Mps Join Bjp: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఆప్ ఎంపీలు

రాఘవ చద్దాను ఇటీవల పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తొలగించిన సంగతి తెలిసిందే.

  • Updated on- April 24, 2026 / 06:48 PM IST

AAP Mps Join Bjp: ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాఘవ్ చద్దా సహా ముగ్గురు ఆప్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన వారిలో రాఘవ్ చద్దాతో పాటు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ లు ఉన్నారు. రాఘవ్ చద్దాను ఇటీవల పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తొలగించిన సంగతి తెలిసిందే. ఆప్ అవినీతిపరుల్లో చేతుల్లో ఉందని రాఘవ్ చద్దా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తన నేతృత్వంలో 8 మంది ఆప్ ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లుగా రాఘవ్ చద్దా ప్రకటించారు. ఆప్ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. మూడింట రెండో వంతు ఎంపీలు బీజేపీలో విలీనం అవుతున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వం పట్ల ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నట్లు రాఘవ్ చద్దా చెప్పారు. మోదీ, షా నాయకత్వంలో పని చేస్తామన్నారు.

రాఘవ్ చద్దా ఆప్ నుండి ఎందుకు వైదొలిగారు?

”నేను పార్టీ కార్యకలాపాలకు ఎందుకు దూరమయ్యానో అసలు కారణం మీకు చెబుతున్నా. నేను వారి నేరాలలో భాగం కావాలనుకోలేదు. నేను వారి నేరంలో భాగం కానందున, వారి స్నేహానికి అర్హుడిని కాను. మాకు కేవలం రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి రాజకీయాలకు దూరమై, గత 15-16 ఏళ్లుగా మేము చేస్తున్న ప్రజా సేవను వదులుకోవడం. లేదా మా శక్తి, అనుభవంతో సానుకూల రాజకీయాలు చేయడం. కాబట్టి, రాజ్యసభలో ఆప్‌కు చెందిన 2/3వ వంతు సభ్యులమైన మేము భారత రాజ్యాంగ నిబంధనలను ఉపయోగించుకుని బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నాము” అని రాఘవ చద్దా అన్నారు.

గుర్మీత్ సింగ్ మీట్ హయర్ (సంగ్రూర్), రాజ్ కుమార్ చబ్బెవాల్ (హోషియార్‌పూర్), మల్విందర్ సింగ్ కాంగ్ (ఆనంద్‌పూర్ సాహిబ్) పంజాబ్ నుండి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు లోక్‌సభ ఎంపీలు. రాఘవ్ చద్దా, అశోక్ కుమార్ మిట్టల్, సందీప్ పాఠక్ 2022 నుండి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరపున రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.

“నా రక్తం, చెమట ధారపోసి నా యవ్వనంలోని 15 ఏళ్లను అంకితం చేసి పెంచి పోషించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన సూత్రాలు, విలువలు, మౌలిక నైతికత నుండి పూర్తిగా పక్కకు తప్పుకుంది. ఈ పార్టీ ఇకపై దేశం కోసం గానీ, జాతీయ ప్రయోజనాల కోసం గానీ పని చేయడం లేదు. కేవలం వ్యక్తిగత లాభం కోసం పనిచేస్తోంది. గత కొన్నేళ్లుగా మీలో చాలా మంది ఈ విషయాన్ని నాకు చెబుతూనే ఉన్నారు. తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని అని నేను కూడా వ్యక్తిగతంగా భావించాను. నేను మళ్ళీ చెబుతున్నా. నేను తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని. అందువల్ల, ఈ రోజు నేను ఆమ్ ఆద్మీ పార్టీకి దూరమవుతూ ప్రజల వద్దకు వెళ్తున్నా” అని కీలక వ్యాఖ్యలు చేశారు రాఘవ్ చద్దా.

Also Read: డిజిటల్ పేమెంట్స్ కోసం RBI కొత్త రూల్స్.. రూ.10 వేల కన్నా ఎక్కువ పంపాలంటే ఎదురు చూడక తప్పదు