Dhanush Political Entry : ధనుష్ పొలిటికల్ ఎంట్రీ వెనుక బీజేపీ హస్తం ఉందా..? అదిరిపోయే సమాధానం చెప్పిన హీరో..
Dhanush Political Entry : ధనుష్‌కు బీజేపీ మద్దతు ఉందనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. తాజాగా ఈ అంశంపై స్పందించిన ధనుష్.. తనకు ఎవరి అండ క్లారిటీ ఇచ్చారు.
- Harish Thanniru
- Published on- November 7, 2026 / 02:05 PM IST
Actor Dhanush
Dhanush Political Entry : తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై కొంతకాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన అభిమాన సంఘాన్ని సేవా సంస్థగా మార్చడం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అభిమానులకు పిలుపునివ్వడం వంటి పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. ఈ క్రమంలో ధనుష్‌కు బీజేపీ మద్దతు ఉందనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. తాజాగా ఈ అంశంపై స్పందించిన ధనుష్.. తనకు ఎవరి అండ ఉందో స్పష్టం చేశారు.
Also Read : Pulivendula : వైఎస్ జగన్‌కు మరో బిగ్‌షాక్.. పులివెందుల జడ్పీటీసీ టీడీపీ కైవసం.. భారీ మెజార్టీ..!
తన తాజా చిత్రం ‘ఓం’ ఆడియో విడుదల కార్యక్రమంలో ధనుష్ కీలక కామెంట్స్ చేశారు. తన గురించి రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయని, కొందరు తన వెనుక ఉన్నారని, మరికొందరు తనకు మద్దతు ఇస్తున్నారని మాట్లాడుకుంటున్నారని అన్నారు. అయితే, తనను నడిపించేది దేవుడేనని స్పష్టం చేశారు. “నా వెనుక నా అభిమానులు ఉన్నారు.. నా పక్కన ప్రజలు ఉన్నారు. ప్రజలు నాతోనే ఉన్నారు” అని ధనుష్ పేర్కొన్నారు.
తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు ధనుష్ నేరుగా సమాధానం ఇవ్వకపోయినా.. బీజేపీ, మరే ఇతర రాజకీయ శక్తి తనను నడిపిస్తోందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అయితే, ఇప్పటి వరకు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే ఉందని, దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తుతో చేయనున్న D56 తన తదుపరి ప్రాజెక్ట్ అని ధనుష్ వెల్లడించారు.
ఇదిలాఉండగా.. ధనుష్ తన అభిమాన సంఘం ‘ధనుష్ నర్పణి ఇయక్కం’ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో నాలుగు ఉచిత ట్యూషన్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వీటిలో మూడు చెన్నైలో, మరొకటి కన్యాకుమారిలో ఏర్పాటు చేయనున్నారు. పూర్తిగా ఏసీ సదుపాయంతో ఉండే ఈ కేంద్రాలను రానున్న రెండేళ్లలో తమిళనాడు అంతటా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే, ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో ధనుష్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు, ఆ పేరును ఎన్నికల సంఘం వద్ద కూడా నమోదు చేయించుకున్నారంటూ ప్రచారం జరుగుతుంది.
మరోవైపు, తమిళనాడు వ్యాప్తంగా 3 వేల మంది న్యాయ సలహాదారులను నియమించాలని, ఇందుకు సంబంధించిన వ్యవస్థను జిల్లాల వారీగా ఏర్పాటు చేయాలని ధనుష్ నిర్ణయించినట్లు తెలిసింది. ప్రజలకు ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు, సామాజిక సమస్యలకు న్యాయ సలహాలను అందించడమే ఈ వ్యవస్థ ఉద్దేశమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, ఇప్పటివరకు ధనుష్ నుంచి రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
