Raghava Lawrence : రాజకీయల్లోకి ఎంట్రీపై నటుడు రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..! ఆరోజే అసలు విషయం చెబుతా అంటూ ట్వీట్..
Raghava Lawrence : తమిళనాడులోని తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఉపఎన్నికల్లో టీవీకే పార్టీ నుంచి రాఘవ లారెన్స్ పోటీ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఆయన స్పందించారు.
- Harish Thanniru
- Published on- June 7, 2026 / 01:56 PM IST
Raghava Lawrence
Raghava Lawrence : తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీ రాకపోవటంతో కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి టీవీకే ప్రాభుత్వం ఏర్పాటైంది. విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే, తాజాగా.. సినీ నటుడు, ప్రముఖ డ్యాన్సర్ రాఘవ లారెన్స్ రాజకీయాల్లో వస్తున్నారని, టీవీకే పార్టీలో ఆయన త్వరలో చేరబోతున్నారంటూ తమిళ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఈ అంశంపై తాజాగా లారెన్స్ స్పందించారు.
Also Read : Summer Holidays : తెలంగాణలో విద్యార్థులకు అలర్ట్.. వేసవి సెలవులు పొడిగింపు… స్కూళ్లు పున:ప్రారంభం తేదీ ఇదే..
రాజకీయాల్లోకి వచ్చే విషయంపై లారెన్స్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘అందరికీ నమస్కారం. నేను తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మీడియా మిత్రులందరూ నాకు ఫోన్ చేసి, వివరణ కోరుతూ నన్ను కలవాలని కోరుతున్నారు. రోజురోజుకు తన రాజకీయ రంగప్రవేశంపై ఊహాగానాలు పెరుగుతున్నాయి.. దీంతో నేను దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని భావించా. ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను ప్రస్తుతం ‘బెంజ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను, నా షెడ్యూల్ 10వ తేదీతో ముగుస్తుంది. మా అమ్మగారి ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం 11వ తేదీ (గురువారం) ఉదయం 9:30 గంటలకు ప్రకటిస్తానని’ లారెన్స్ పేర్కొన్నారు. అయితే, ఈ నోట్ చివరలో ఆయన పెట్టిన #Mattram (మార్పు), #Serviceisgod (సేవే దైవం) అనే హ్యాష్‌ట్యాగ్‌లు ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Hi everyone, News about me contesting in Trichy East election has been circulating across various media platforms.
All my Media friends have been reaching out to me over phone and requesting to meet me asking for clarification. Since the speculation has grown to a point where I… pic.twitter.com/68ZyN6P0l9
— Raghava Lawrence (@offl_Lawrence) June 7, 2026
తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ నుంచి విజయ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే, ఆయన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో ఎలాగైనా ఈ స్థానంలో మళ్లీ విజయం సాధించాలని విజయ్ వ్యూహాలు ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో మంచి గుర్తింపు, ఆదరణ ఉన్న బలమైన వ్యక్తిని బరిలోకి దింపేందుకు విజయ్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాఘవ లారెన్స్ ను టీవీకే పార్టీలోకి ఆహ్వానించి.. తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన్ను బరిలోకి దింపేందుకు విజయ్ నిర్ణయించారని, అందుకు లారెన్స్ సైతం ఒప్పుకున్నారని, త్వరలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని తమిళ మీడియాలో జోరుగా వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా లారెన్స్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ వివరణ ఇచ్చారు.
ఇదిలాఉంటే.. రాఘవ లారెన్స్ పేర్కొన్న వివరాలను బట్టిచూస్తే.. ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని, జూన్ 11వ తేదీన టీవీకే చేరే విషయంపై బహిరంగ ప్రకటన చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది.
