Trisha – TVK Vijay: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..!

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 118 కాగా 120 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని గవర్నర్ కి చూపించారు విజయ్. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయ్యింది.

  • Updated on- May 9, 2026 / 08:38 PM IST

Trishna – TVK Vijay: తమిళనాడు సీఎంగా విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్ కు అందించారు విజయ్. మ్యాజిక్ ఫిగర్ ఉండటంతో విజయ్ ను ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ అనుమతించారు. దీంతో ఆలస్యం చేయకుండా రేపే సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని విజయ్ భావిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై సెంట్రల్ లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి నటి త్రిష హాజరవుతారని తెలుస్తోంది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 118 కాగా 120 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని గవర్నర్ కి చూపించారు విజయ్. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయ్యింది. సినిమాలో జన నాయగన్ గా ఉన్న విజయ్ రేపు తమిళనాడు ప్రజలకు జన నాయగన్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి సమయం ఆసన్నమైంది.

ఇక పార్టీల సీట్ల విషయానికి వస్తే టీవీకే సంఖ్యా బలం 108. అయితే విజయ్ రెండు చోట్ల పోటీ చేయడంతో టీవీకే సంఖ్యా బలం 107గా మారింది. ఈ లెక్కన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 11 సీట్లు అవసరం అయ్యాయి. ఈ క్రమంలో అందరికన్నా ముందుగా కాంగ్రెస్ డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి మరీ విజయ్ కి మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో విజయ్ పార్టీ బలం 107 నుంచి 112కి చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 6 స్థానాలు కావాల్సి వచ్చింది.

ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాలు హైడ్రామాను తలపించాయి. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయనే వార్తలు సంచలనం రేపాయి. అయితే అన్నాడీఎంకే కలిసేది లేదని డీఎంకే చీఫ్ స్టాలిన్ తేల్చి చెప్పారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని చెప్పడంతో వదంతులకు ఫుల్ స్టాప్ పడింది. అధికారం వైపుగా వెళ్లేందుకు విజయ్ పార్టీకి ఒక అడ్డంకి తొలగిపోయింది.

వెన్నుపోటు పొడిచింది అంటూ కాంగ్రెస్ పై ఫైర్..

ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోము అని ప్రకటిస్తూనే కాంగ్రెస్ పై విరుచుకుపడింది డీఎంకే. పొత్తు ధర్మానికి వెన్నుపోటు పొడిచింది అంటూ కాంగ్రెస్ పై మండిపడింది డీఎంకే. కాంగ్రెస్ తో తెగదెంపులు చేసేసుకుంది. దీంతో మిగతా మిత్రపక్షాలు టీవీకే వైపు వెళ్లేందుకు తర్జనభర్జన పడ్డాయి. స్టాలిన్ తో వరుసగా భేటీలు జరిగాయి. వారికి మాత్రం స్టాలిన్ స్వేచ్చాయుత వాతావరణాన్ని కల్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కు మద్దతిచ్చే విషయంలో స్వేచ్చగా వ్యవహరించే అవకాశం ఇచ్చారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తున్నట్లుగా వామపక్షాలు ప్రకటించాయి. అయితే, ప్రభుత్వంలో తాము భాగస్వామ్యం కాము అని, మంత్రి పదవులు తీసుకోబోమని తెలిపాయి వామపక్షాలు. తమిళనాడులో తక్షణమే ప్రభుత్వ ఏర్పాటు అత్యవసరం కాబట్టి ఈ మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం డీఎంకేతో కలిసి పోరాటం చేస్తామని వామపక్షాలు వెల్లడించాయి.

ఆ తర్వాత టీవీకేకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా వీసీకే సైతం ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రపతి పాలన రాకూడదనే టీవీకేకి మద్దతిచ్చినట్లుగా వీసీకే పార్టీ తెలిపింది. ఆ కాసేపటికే ఐయుఎంల్ సైతం టీవీకే పార్టీకి మద్దతు తెలిపింది. దాంతో టీవీకే పార్టీ సంఖ్యా బలం 118 నుంచి 120కి పెరిగింది.

Also Read: సువేందు ప్రమాణస్వీకారంలో అందరి ముందు ఈ పెద్దాయన కాళ్లు మొక్కిన పీఎం మోదీ.. ఎవరీయన?