CNG Price Hike : వాహనదారులకు బిగ్ షాక్.. అదానీ టోటల్ గ్యాస్ సీఎన్జీ ధరల పెంపు.. ఎంత పెరిగాయంటే?
CNG Price Hike : పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఇప్పుడు సీఎన్‌జీ ధరల పెంపు రూపంలో మరో భారం ఎదురైంది.
- Harish Thanniru
- Published on- October 24, 2026 / 12:18 PM IST
CNG Price Hike
CNG Price Hike : పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఇప్పుడు సీఎన్‌జీ ధరల పెంపు రూపంలో మరో భారం ఎదురైంది. గ్యాస్ సేకరణ వ్యయం భారీగా పెరిగిందని పేర్కొంటూ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ATGL) సీఎన్‌జీ ధరను కిలోకు రూ.4.45 పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్‌ఎన్‌జీ ధరలు పెరగడం, దేశీయంగా సహజ వాయువు లభ్యత తగ్గడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలని సంస్థ వెల్లడించింది.
Also Read : Gold Silver Prices Today : మహిళలకు బిగ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. నేటి ధరలు ఇవే..
గుజరాత్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోని నగరాల్లో సీఎన్జీ, పైప్డ్ నేచురల్ గ్యాస్ పంపిణీ చేసే అదానీ టోటల్ గ్యాస్.. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరలను కిలోకు రూ.4.45 చొప్పున పెంచింది. అంతర్జాతీ యంగా ఎల్ఎన్జీ ధరలు పెరగడం, దేశీయ గ్యాస్ లభ్యత తగ్గడం. అప్‌స్ట్రీమ్ సరఫరా కోతల వల్ల పెరిగిన వ్యయాలు ఇందుకు కారణమని పేర్కొంది. తాజా పెంపుతో అహ్మదాబాద్ లోని అదానీ టోటల్ గ్యాస్ ఔట్ లెట్లలో సీఎన్జీ ధర కిలోకు రూ.98.47కు చేరగా, హరియణాలోని ఫరీ దాబాద్లో రూ.102.60గా, జలంధర్‌లో రూ.100గా ఉంది.
అంతర్జాతీయంగా స్పాట్ ఎల్ఎన్‌జీ ధర 2026 ఫిబ్రవరిలో 10-12 డాలర్ల నుంచి, ప్రస్తుతం ప్రతి మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ కు దాదాపు 30 డాలర్లకు చేరింది. దీని వల్ల దిగుమతి వ్యయాలు గణనీయంగా పెరిగాయని కంపెనీ తెలిపింది. ఓఎన్ జీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల దేశీయ క్షేత్రాల నుంచి వచ్చే న్యూ వెల్ గ్యాస్ లభ్యత తగ్గిందని, అదే విధంగా ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో హై-ప్రెజర్, హై-టెంపరేచర్ గ్యాస్ సరఫరాలు కూడా తగ్గాయని కంపెనీ గుర్తుచేసింది.
సీఎన్‌జీని ప్రధానంగా ఆటోలు, ట్యాక్సీలు, వాణిజ్య వాహనాలు నడిపేవారు ఇంధనంగా వినియోగిస్తున్నారు. కిలోకు రూ.4.45 పెంపు అమలయ్యే ప్రాంతాల్లో రోజువారీ ఇంధన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే డ్రైవర్లకు ఈ పెంపు ప్రభావం మరింత స్పష్టంగా కనిపించవచ్చు. అయితే పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే సీఎన్‌జీ వినియోగం ఎంత పొదుపుగా ఉంటుందన్నది స్థానిక ఇంధన ధరలు, వాహనం మైలేజీపై ఆధారపడి ఉంటుంది.
