×
Ad

Ajit Pawars Plane Crash : మహారాష్ట్రలో విమాన ప్రమాదం.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌‌ దుర్మరణం

Ajit Pawars Plane Crash : మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తో పాటు మరో ఆరుగురు మృతిచెందారు.

Ajit Pawars Plane Crash

Ajit Pawars Plane Crash : మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బుధవారం ఉదయం 8.45 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విమానంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ఉన్నారు. అయితే, ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా ఇద్దరు పైలెట్లు, ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి పూణె జిల్లాలోని బారామతికి విమానంలో వెళ్తున్నారు. బరామతిలో పలు బహిరంగ సభలు, సమావేశాల్లో పవార్ హాజరు కావాల్సి ఉంది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలెట్ అత్యవసరంగా విమానంను ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బరామతిలోని పంటపొలాల్లో విమానం కుప్పకూలింది. విమానం కూలిన వెంటనే పెద్దెత్తున మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కానీ, పెద్దెత్తున మంటలు వ్యాపించడంతో అజిత్ పవార్ తోపాటు మిగిలిన నలుగురు దుర్మరణం పాలయ్యారు.

విమాన ప్రమాదంను దగ్గర నుంచి చూసిన సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. విమానం రన్ వే పైకి వస్తున్న క్రమంలో విమానం దిగుతున్న తీరుచూసి పడిపోతుందా ఏంటా అని అనుకున్నాం. అనుకున్నట్లుగానే ఒక్కసారిగా రన్ వేపై విమానం పడిపోయింది. వంద ఫీట్ల పైనుంచి ఒకపక్కకు ఒరిగి విమానం పడిపోయింది. వెంటనే పేలిపోవడంతో మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. వరుసగా నాలుగైదు పేలుళ్లు సంభవించాయని ప్రతక్ష సాక్షులు తెలిపారు.

కూలిపోయి అగ్నికి ఆహుతైన విమానంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తోపాటు, మరో ఇద్దరు సిబ్బంది (ఒక పీఎస్‌ఓ, ఒక సహాయకుడు) మరో ఇద్దరు (పైలట్, కో-పైలట్) మొత్తం ఐదుగురు ఈ చార్టర్ విమానంలో ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానంలో ఉన్న ఏ ఒక్కరూ ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడలేదని డీజీసీఏ (పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్) అధికారికంగా ప్రకటించింది.