AK 203 Sher Rifle: ఆర్మీలోకి ఏకే-203 ‘షేర్’.. అమేఠీలో ట్రయల్స్ సక్సెస్.. సైన్యంలోకి 6 లక్షల కొత్త రైఫిళ్లు
భారత సైనిక దళాల పోరాట పటిమను మరింత పెంచేందుకు పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన అధునాతన 'ఏకే-203' (AK 203 Sher Rifle) అసాల్ట్ రైఫిల్స్ ప్రవేశానికి రంగం సిద్ధమైంది.
- V Santhosh Kumar
- Published on- August 24, 2026 / 10:16 AM IST
Ak 203 sher assault rifle made in india trials successful
- ఏకే-203 ‘షేర్’ అసాల్ట్ రైఫిల్
- భారత్‌లోనే విడిభాగాల తయారీ, పరీక్ష
- సైన్యంలోకి 6 లక్షల ఆయుధాలు
AK 203 Sher Rifle: భారత సైనిక దళాల పోరాట పటిమను మరింత పెంచేందుకు పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన అధునాతన ‘ఏకే-203’ (AK 203 Sher Rifle) అసాల్ట్ రైఫిల్స్ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. సైన్యంలో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న పాత ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. ఉత్తరప్రదేశ్ అమేఠీలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఆర్ఆర్పీఎల్) ఆధ్వర్యంలో పూర్తిగా భారతీయ విడిభాగాలు, ముడిసరుకుతో తయారు చేసిన తొలి ప్రోటోటైప్ రైఫిల్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు.
అద్భుతమైన ఫైరింగ్ సామర్థ్యం, నిమిషానికి 700 రౌండ్లు:
ఈ ఏకే-203 రైఫిల్ కలాష్నికోవ్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా పనిచేసే గ్యాస్ ఆపరేటెడ్ 7.62×39 ఎంఎం అసాల్ట్ ఆయుధం. సుమారు 800 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగల ఈ రైఫిల్, నిమిషానికి 700 రౌండ్ల బుల్లెట్లను వర్షంలా కురిపించే ఫైరింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అధునాతన డిజైన్, తేలికైన బరువు వల్ల ఎలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనైనా భారత సరిహద్దు భద్రతా బలగాలు, సైనికులు దీనిని సులభంగా ఉపయోగించవచ్చు.
సెప్టెంబర్‌లో సైనిక ట్రయల్స్, 6 లక్షలకు పైగా రైఫిళ్ల ఉత్పత్తి లక్ష్యం:
పూర్తి భారతీయ సాంకేతికతతో విజయవంతంగా పరీక్షించిన మరిన్ని ‘షేర్’ రైఫిల్ ప్రోటోటైప్‌లను సెప్టెంబర్ నెలలో సైనిక ట్రయల్స్ కోసం ఆర్మీకి అప్పగించనున్నట్లు ఐఆర్ఆర్పీఎల్ సీఈవో మేజర్ జనరల్ కేఎస్ శర్మ తెలిపారు. ఫ్యాక్టరీలో ప్రతి 100 సెకన్లకు ఒక ఏకే-203 రైఫిల్‌ను తయారు చేసే దిశగా ఉత్పత్తి వేగాన్ని పెంచుతున్నారు. రాబోయే రోజుల్లో భారత సైన్యానికి మొత్తం 6 లక్షలకు పైగా ఏకే-203 రైఫిళ్లను సమకూర్చడమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నారు.
