Amarnath Yatra: భక్తులకు గుడ్ న్యూస్.. భారీ భద్రత నడుమ మొదలైన అమర్‌నాథ్ యాత్ర
హిమాలయ శిఖరాల్లోని అమర్‌నాథ్ గుహాలయంలో వెలిసిన ‘బాబా బర్ఫానీ’ దర్శనానికి వార్షిక అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra)వైభవంగా ప్రారంభమైంది.
- V Santhosh Kumar
- Published on- July 3, 2026 / 09:36 AM IST
Amarnath Yatra begins amidst heavy security.
- వైభవంగా మొదలైన అమర్‌నాథ్ యాత్ర
- భక్తుల కోసం పటిష్ట భద్రత
- మార్గమంతటా డ్రోన్లతో నిరంతర నిఘా
Amarnath Yatra: హిమాలయ శిఖరాల్లోని అతి పవిత్ర అమర్‌నాథ్ గుహాలయంలో వెలిసిన ‘బాబా బర్ఫానీ’ దర్శనానికి వార్షిక అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra)వైభవంగా ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలోని బాల్తాల్, అనంత్‌నాగ్ జిల్లాలోని నున్వాన్-పహల్గామ్ బేస్ క్యాంపుల నుంచి తొలి విడత భక్తులు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ‘బమ్ బమ్ భోలే’, ‘హర్ హర్ మహాదేవ్’ నినాదాలతో హిమగిరులు మారుమోగుతున్నాయి. ఈ ఏడాది 57 రోజుల పాటు సాగనున్న ఈ సుదీర్ఘ ఆధ్యాత్మిక యాత్ర, ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినం రోజున ముగియనుంది.
Air India: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ల ధరలు భారీగా తగ్గించనున్న ‘ఎయిరిండియా’
భక్తుల రక్షణ కోసం భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, కాశ్మీర్ పోలీసులు కలిసి కట్టుదిట్టమైన మల్టీ-లేయర్ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల వాహనాల కదలికలను కనిపెట్టేందుకు ఆర్‌ఎఫ్‌ఐడీ (RFID) ట్రాకింగ్ సిస్టమ్‌ను తప్పనిసరి చేశారు. మార్గమంతటా నిఘా కోసం 416 హై-రెజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు, 34 ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ కెమెరాలను అమర్చారు. అంతేకాకుండా, ‘ప్రాజెక్ట్ హాక్ ఐ’ కింద నిరంతరం డ్రోన్ల ద్వారా వైమానిక నిఘాను కొనసాగిస్తున్నారు.
ఈ యాత్రలో వ్యూహాత్మక ప్రాంతాల వద్ద 22 ప్రత్యేక స్నైపర్ బృందాలను, ఎత్తైన నిఘా పోస్టులను భద్రతా దళాలు రంగంలోకి దించాయి. ఒకవేళ వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు వస్తే భక్తులు తలదాచుకోవడానికి వీలుగా మార్గమంతటా అత్యవసర షెల్టర్లను సిద్ధం చేశారు. అలాగే, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తకుండా ఆక్సిజన్ బూత్‌లతో కూడిన ప్రత్యేక వైద్య శిబిరాలను, అత్యవసర చికిత్సా కేంద్రాలను అధికారులు అందుబాటులో ఉంచారు.
