LNG Train India : రైల్వేల్లో మరో కొత్త అధ్యాయం.. దేశంలోనే ఫస్ట్ LNG రైలు పట్టాలెక్కింది..!

LNG Train India : దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలును గుజరాత్‌లోని సబర్మతి స్టేషన్ నుంచి కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. రూ.1,500 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టారు.

  • Published on- September 27, 2026 / 04:58 PM IST

LNG Train India

  • దేశంలో తొలి ఎల్ఎన్‌జీ రైలు.. అమిత్ షా చేతుల మీదుగా ఘన ప్రారంభం
  • రైల్వేల్లో మరో కొత్త అధ్యాయం.. ఎల్ఎన్‌జీ రైలుకు గ్రీన్ సిగ్నల్
  • సబర్మతి నుంచి తొలి ఎల్ఎన్‌జీ రైలు పరుగులు..
  • రూ.1,500 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం

LNG Train India : గుజరాత్‌లోని అహ్మదాబాద్ సబర్మతి స్టేషన్ నుంచి దేశంలోనే ఫస్ట్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.1,500 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టిన పలు రైల్వే అభివృద్ధి పనులను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం కొన్ని ప్రాజెక్టులకు కూడా అమిత్ షా శంకుస్థాపన చేశారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత రైల్వే వ్యవస్థలో భారీగా ఆధునీకరణ జరిగిందని అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కేవలం ఆరోపణలుగా కాకుండా, వాస్తవాలు, గణాంకాలతో చర్చించాలని ఆయన ప్రజలను కోరారు. ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, ర్యాపిడ్ రైల్ వ్యవస్థ, ఆధునిక రైల్వే స్టేషన్లు, కవచ్ భద్రతా వ్యవస్థ, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వంటి అనేక కార్యక్రమాలు మోదీ ప్రభుత్వ హయాంలో చేపట్టినట్లు తెలిపారు.

రైల్వే విద్యుదీకరణలో గణనీయమైన పురోగతి సాధించామని షా పేర్కొన్నారు. 2010-11లో సంవత్సరానికి 75 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ జరిగిందన్నారు. 2023-24లో 7,188 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. రైల్వేలు దాదాపు 99.6 శాతం విద్యుదీకరణ పూర్తి చేసినట్టు చెప్పారు.

2030 నాటికి జీరోనే టార్గెట్ : 

డీజిల్ వినియోగం 2015-16లో 293 కోట్ల లీటర్ల నుంచి 2024-25లో 108 కోట్ల లీటర్లకు తగ్గిందన్నారు. 2030 నాటికి దాన్ని సున్నాకు తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. బయో-టాయిలెట్లు, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు, సరుకు రవాణా సామర్థ్యం, భద్రతా మౌలిక సదుపాయాల్లోనూ పురోగతి సాధించామని వివరించారు. రైల్వే కేటాయింపులు 2009-14లో రూ.589 కోట్ల నుంచి 2026-27లో రూ.17,366 కోట్లకు పెరిగాయని షా పేర్కొన్నారు.

Read Also : SBI ATM Rules : ATM నుంచి డబ్బులు తీస్తున్నారా? SBI కొత్త ఛార్జీలు ఇవే

కొత్తగా చేపట్టిన పనుల్లో రైల్వే లైన్ల విస్తరణ, డబ్లింగ్, కవచ్ భద్రతా వ్యవస్థ, ఆటోమేటిక్ సిగ్నలింగ్‌తో పాటు WAG-12 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ కోసం ప్రత్యేక నిర్వహణ సదుపాయం ఉన్నాయి. సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు డబుల్ స్టాక్ కంటైనర్ రైళ్లను విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని షా పేర్కొన్నారు.

ముంబై-వడోదర మార్గంలో డబుల్ స్టాక్ కంటైనర్ రైలు ట్రయల్ విజయవంతం కావడం వల్ల ఒకే మార్గంలో ఎక్కువ సరుకును తరలించే అవకాశం ఏర్పడిందని ఆయన వివరించారు. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.

2014 తర్వాత రైల్వే రంగంలో విద్యుదీకరణ, భద్రతా సదుపాయాలు, ఆధునిక కోచ్‌ల తయారీ, సరుకు రవాణా కారిడార్లు వంటి అంశాల్లో మార్పులు చోటుచేసుకున్నాయని షా చెప్పారు. డీజిల్ వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తూ రైల్వేలను మరింత ఇంధన సామర్థ్యంతో నడిపే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా రైల్వే విద్యుదీకరణ వేగం గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌కు రైల్వే అభివృద్ధి కోసం కేటాయింపులు కూడా గతంతో పోలిస్తే భారీగా పెరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి, రైల్వే శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.