Union Cabinet expansion : కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణకు రంగం సిద్ధం.. ఉప ప్రధానిగా అమిత్ షా? టార్గెట్ ఫిక్స్..!
Amit Shah To Become Deputy PM After Cabinet Reshuffle : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టనున్న కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యంత కీలకమైన పదోన్నతి లభించే అవకాశముందన్న ప్రచారం జోరందుకుంది.
- Harish Thanniru
- Published on- July 5, 2026 / 08:49 AM IST
Amit Shah To Become Deputy PM After Cabinet Reshuffle
- త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ
- ఉప ప్రధానిగా అమిత్ షాకు కీలక బాధ్యతలు?
- ఎన్డీయే మరింత బలోపేతానికి బీజేపీ బిగ్ ప్లాన్
Amit Shah To Become Deputy PM After Cabinet Reshuffle : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం త్వరలో కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు రంగం సిద్ధమైందని, ప్రస్తుతం కేబినెట్ నుంచి కొందరిని తప్పించి.. యువ నేతలకు అవకాశం కల్పించే దిశగా బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకూ ఈ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. ఇదంతా ఒకవైపు అయితే.. మరోవైపు.. భవిష్యత్‌లో ఎన్డీయేను మరింతగా బలోపేతం చేసేందుకు బీజేపీ అధిష్టానం బిగ్ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు మరో కీలక పదవిని కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
వచ్చే వారం పదిరోజుల్లో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా.. అమిత్ షాకు ఉప ప్రధానిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాతోపాటు బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల అమిత్ షా నివాసంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమావేశం అయినట్లు సమాచారం. అంతుకుముందు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలోకూడా పార్టీ ముఖ్య నేతలు సమావేశమైనట్లు తెలిసింది. బీజేపీ వర్గాల సమాచారం మేరకు.. అమిత్ షాను ఉప ప్రధానిగా నియమించడం ద్వారా ప్రభుత్వంలో ఆయన పాత్రను మరింత విస్తృతం చేయాలనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు సమాచారం.
గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎల్‌కే అద్వానీ ఉప ప్రధానిగా పనిచేశారు. వాజ్‌పేయి తరువాత ఎల్‌కే అద్వానీ ప్రధాని అభ్యర్థిగా ముందుండి పోటీ చేసినా అధికారంలోకి రాలేకపోయారు. అయితే, ఎన్డీయే 2014 నుంచి అధికారంలో కొనసాగుతోంది.. వరుసగా మూడు ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే, నాల్గోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అధిష్టానం ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అమిత్ షాకు ఉప ప్రధాని బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎన్డీయే భవిష్యత్తుకు మరింత బలమైన బాటలు వేయవచ్చునని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట.
ప్రధాని నరేంద్ర మోదీ తరువాత ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మోదీ తరువాత ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీతోపాటు భాగస్వామ్య పక్షాల్లోనూ కాస్త గందరగోళం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ గందరగోళానికి చెక్ పెట్టేందుకు త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఉప ప్రధానిగా అమిత్ షాకు బాధ్యతలు అప్పగించేందుకు బీజేపీ అధిష్టానం రంగం సిద్ధంచేసినట్లు సమాచారం. తద్వారా ప్రధాని నరేంద్ర మోదీ తరువాత అమిత్ షానే అనే సంకేతాలను ఇవ్వడంతోపాటు.. మరొకరు ఎవరూ కూడా ప్రధాని రేసులోకి రాకుండా చేసే ఎత్తుగడలో భాగంగానే ఉప ప్రధాని పదవికి అమిత్ షాను ఎంపిక చేయబోతున్నారని సమాచారం.
