గ్యాస్ సంక్షోభం పేరు చెప్పి బీభత్సంగా డెలివరీ చార్జీలు పెంచేసి.. వీళ్లు ఎంత సంపాదిస్తున్నారు?

స్విగ్గీ తన ప్లాట్‌ఫారమ్ ఫీజును ఒక్కో ఆర్డర్‌కు (జీఎస్టీతో కలిపి) రూ. 14.99 నుండి రూ. 17.58కి పెంచింది. జీఎస్టీకి ముందు జొమాటో తన ఫీజును ఒక్కో ఆర్డర్‌కు రూ. 2.40 పెంచి రూ. 14.90కి చేర్చిన కొద్దికాలానికే ఈ పరిణామం చోటుచేసుకుంది.

  • Published On : March 24, 2026 / 05:31 PM IST

 

Food Delivery Apps: మిడిల్ ఈస్ట్ లో వార్ ఎఫెక్ట్ భారత్ పై పడింది. మన దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సప్లయ్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ గ్యాస్ సంక్షోభాన్ని ఫుడ్ డెలివరీ యాప్ లు స్విగ్గీ, జొమాటో క్యాష్ చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. గ్యాస్ కొరత పేరుతో జొమాటో, స్విగ్గీ తమ ప్లాట్‌ఫారమ్ ఫీజులను పెంచేసి బాగా ప్రయోజనం పొందుతున్నాయనే టాక్ నడుస్తోంది.

స్విగ్గీ తన ప్లాట్‌ఫారమ్ ఫీజును ఒక్కో ఆర్డర్‌కు (జీఎస్టీతో కలిపి) రూ. 14.99 నుండి రూ. 17.58కి పెంచింది. జీఎస్టీకి ముందు జొమాటో తన ఫీజును ఒక్కో ఆర్డర్‌కు రూ. 2.40 పెంచి రూ. 14.90కి చేర్చిన కొద్దికాలానికే ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో పన్ను తర్వాత మొత్తం ఫీజు ఒక్కో ఆర్డర్‌కు రూ. 17.58కి చేరింది. ఇలా చార్జీలు పెంచేశాయి స్విగ్గీ, జొమాటో నిజంగానే ప్రయోజనం పొందుతున్నాయా? నిపుణులు ఏమంటున్నారు..

ఎల్పీజీ కొరత కారణంగా అనేక రెస్టారెంట్లు, దాబాలు, క్లౌడ్ కిచెన్‌లు, వీధి వ్యాపారులు తమ కార్యకలాపాలను తగ్గించుకున్నాయి. కొన్ని తాత్కాలికంగా మూతబడ్డాయి. ఇది ఫుడ్ డెలివరీ యాప్స్ ఆర్డర్ల పరిమాణంపై నేరుగా ప్రభావం చూపుతోంది.

ఫుడ్ డెలివరీ యాప్స్ కార్యకలాపాలను దెబ్బతీసిన గ్యాస్ సంక్షోభం..

పరిశ్రమ అంచనాలు, కార్మిక సంఘాల ప్రకారం ఫుడ్ డెలివరీ ఆర్డర్లు తీవ్రంగా పడిపోయాయి. బెంగళూరు, పూణే వంటి నగరాల్లో రోజువారీ ఆర్డర్ల సంఖ్య 50 నుంచి 70% మేర తగ్గినట్లు సమాచారం. గతంలో రోజుకు సుమారు 30 ఆర్డర్లు పూర్తి చేసే చాలా మంది డెలివరీ కార్మికులకు ఇప్పుడు కేవలం ఐదు నుంచి పది మాత్రమే లభిస్తున్నాయని, ఇది వారి సంపాదనపై గణనీయంగా ప్రభావం చూపుతోందని గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ తెలిపింది.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఆహార వ్యాపారాల కార్యకలాపాలకు అంతరాయం కలిగించిందని, దీని ఫలితంగా జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఆర్డర్లు 50 నుంచి 60శాతం తగ్గాయని యూనియన్ ఒక ప్రకటనలో పేర్కొంది. భారతదేశం తన ఎల్పీజీ దిగుమతుల్లో సగానికి పైగా పశ్చిమ ఆసియాపై ఆధారపడి ఉంది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు హర్మూజ్ జలసంధితో సహా కీలక నౌక రవాణ మార్గాలకు అంతరాయం కలిగించి, భారత ఓడరేవులకు చేరే సరఫరాలను ప్రభావితం చేస్తున్నాయి.

ఈ ప్రభావం స్టాక్ మార్కెట్‌లో కూడా కనిపిస్తోంది. డిమాండ్ మందగిస్తుందనే ఆందోళనల మధ్య మార్చి 12, 2026న ఎటర్నల్ (జొమాటో), స్విగ్గీ షేర్లు 5% వరకు పడిపోయాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ సుదీర్ఘ అంతరాయం త్రైమాసిక రాబడిలో 3% క్షీణతకు దారితీయచ్చు. దీని ప్రభావం లాభదాయకతపై మరింత తీవ్రంగా ఉంటుంది.

పరిస్థితిని చక్కదిద్దేందుకు, సరఫరాను నియంత్రించడానికి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే, ప్రత్యేకంగా రెస్టారెంట్లు, హోటళ్ల కోసం 2026 మార్చి 21న రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కేటాయింపును ఆమోదించింది. వలస కార్మికులు, నిత్యావసర ఆహార వ్యాపారాల కోసం 5 కేజీల చిన్న సిలిండర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది.

ప్లాట్ ఫామ్ ఫీజుల పెంపుతో కస్టమర్ల ఆవేదన..

మరోవైపు పెరుగుతున్న డెలివరీ ఖర్చులు తమపై భారాన్ని మరింత పెంచుతున్నాయని కస్టమర్లు వాపోతున్నారు. “ఇది మాకు చాలా అన్యాయం. ఇప్పుడు నేను ఈ యాప్‌లపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుండగా, వాళ్లు తమ ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచేశారు. ఇప్పుడు బిల్లులో గ్యాస్ ఫీజు కూడా విడిగా ఉంటోంది. ఈ అదనపు ఖర్చులన్నీ వినియోగదారుడిపైనే మోపుతున్నట్లు అనిపిస్తోంది” అని ఒక నెటిజన్ తన ఆవేదన తెలిపారు.

మరికొందరు కస్టమర్లు సైతం ఇలాంటి ఆందోళనే వ్యక్తం చేశారు. “యుద్ధం ఎవరికీ మంచిది కాదు, ఇప్పుడు భారతదేశం కూడా హీట్ ను ఎదుర్కొంటోంది. మీరు మా ప్రాంతంలోని ఏ వీధికి వెళ్ళినా వ్యాపారులు గ్యాస్ సిలిండర్ లేకుండా ఖాళీగా కూర్చొని ఉంటారు. వారి వ్యాపారం దాదాపు ఆగిపోయింది. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నారు” అని ఘజియాబాద్ నివాసి సుధాన్షు అన్నారు.

“నేను ఒంటరిగా నివసిస్తున్నా. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల బయటి ఆహారంపై ఎక్కువగా ఆధారపడి ఉన్నా. మా సొసైటీలో పీఎన్‌జీ కనెక్షన్ లేదు. పైగా స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ధరలు పెంచడంతో నా జేబుకు చాలా భారం అవుతుంది” అని మరొక కస్టమర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఫుడ్ డెలివరీ యాప్ లు ప్లాట్‌ఫామ్ ధరలను పెంచేసి కస్టమర్లపై భారం మోపిన మాట వాస్తవమే. అయితే, ఈ సంక్షోభ సమయంలో ఫుడ్ డెలివరీ యాప్స్ గణనీయమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆర్థిక డేటా, పరిశ్రమ నివేదికలు సూచిస్తున్నాయి.

Also Read: టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్‌లో మార్పులు చేసిన భారతీయ రైల్వే