Arunachala Temple : అరుణాచలం వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. టైమింగ్స్!

Arunachala Temple : తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అరుణాచలేశ్వర స్వామి దేవాలయం ఒకటి. తాజాగా.. ఈ ఆలయం వద్ద కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి.

Arunachala Temple Moksha Margam

Arunachala Temple : తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఇక్కడకు స్వామి దర్శనం, గిరి ప్రదక్షిణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అరుణాచలేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్తుంటారు. అయితే, గిరివలయం మార్గంలో ఉన్న మోక్షమార్గం (ఇడుక్కు పిళ్లయ్యార్ గుహ) వద్ద ఇటీవల వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆలయ యంత్రాంగం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Also Read : Narendra Modi : మోదీని దూషించిన బాలిక కేసు.. తల్లి భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్! ప్రధానికి కీలక విజ్ఞప్తి..

కొద్దిరోజుల క్రితం ఏపీకి చెందిన ఓ భక్తుడు ఇరుకైన మోక్ష మార్గంలో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందాడు. ఈ విషాద ఘటన జరిగిన కొద్దిరోజులకే ఏపీకి చెందిన ఓ మహిళ మోక్షమార్గం ప్రవేశ క్రమంలో అందులో ఇరుక్కుపోయింది. ఊపిరాడక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు ఆమెను బలవంతంగా బయటకులాగి ప్రథమ చికిత్స అందించారు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇదే క్రమంలో మరికొందరు భక్తులుసైతం ఇలానే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆలయ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రూల్స్, టైమింగ్స్ అమల్లోకి తీసుకొచ్చింది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం.. మోక్షమార్గంలో ప్రవేశానికి నిర్దిష్ట సమయాలకు మాత్రమే పరిమితం చేశారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు.. అలాగే సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు ఒకేసారి పరిమిత సంఖ్యలోనే భక్తులను లోపలికి పంపుతున్నారు. ఇందుకు కోసం ఆ ప్రదేశంలో గ్రిల్ ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రత్యేక ఇనుప గ్రిల్ ను ఏర్పాటు చేశారు. దీనిని మోక్షమార్గం సైజుకు సమానంగా ఉండేలా తయారు చేశారు. ముందుగా దీని నుంచి లోపలికి వెళ్లిన వారు మాత్రమే మోక్షమార్గం లోకి వెళ్లగరు.

ముఖ్యంగా.. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, శారీరక ఇబ్బందులు ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు ఈ ఇరుకైన మార్గంలో వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన సూచనలు చేశారు. ఈ మేరకు గుహ వద్ద మూడు భాషల్లో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. భక్తులెవరూ బలవతంగా లోపలికి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు.. ఆలయం వద్ద అత్యవసర పరిస్థితులకోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.

అదేవిధంగా గిరివలయంలో లోపల ఎక్కువసేపు నిలబడటం, ఫొటోలు, వీడియోలు తీయడం, తోపులాటకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడొద్దని, సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఆలయ యంత్రాంగం స్పష్టం చేసింది. అదేవిధంగా మోక్షమార్గంలోకి వెళ్లే ముందు భక్తులు తమ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అంచనా వేసుకోవాలని, ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ మార్గాన్ని ఉపయోగించకపోవడమే మంచిదని అధికారులు తెలిపారు. ఆలయ సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.