జైలు నుంచి ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ సందేశం.. చదివి వినిపించిన భార్య
జైలు నుంచి ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ పంపించిన సందేశాన్ని ఆయన భార్య సునీత చదివి వినిపించారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : March 23, 2024 / 01:30 PM IST
Arvind Kejriwal message : లిక్కర్ కేసులో అరెస్టైన ముఖ్యంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి ఢిల్లీ ప్రజలకు సందేశం పంపించారు. దీన్ని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ చదివి వినిపించారు. శనివారం ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు. ప్రతి ఒక్కరు సమాజం కోసం పని చేస్తూనే ఉండాలని, ఎవరినీ ద్వేషించవద్దని తన సందేశంలో కేజ్రీవాల్ కోరారు. తనను జైలుకు పంపించారనే కారణంతో బీజేపీలోని సోదరీసోదరమణులపై ద్వేషం పెంచుకోద్దని సూచించారు. తాను త్వరలోనే జైలు నుంచి బయట పడి ప్రజలను ఇచ్చిన హామీలను నెరవేరుస్తాననే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
“మన దేశాన్ని బలహీనపరిచే అనేక శక్తులు భారతదేశం లోపల, వెలుపల ఉన్నాయి. మనమంతా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఈ శక్తులను గుర్తించి వాటిని ఓడించాలి. కేజ్రీవాల్ కటకటాల వెనుక ఉన్నారని ఢిల్లీలోని మహిళలు అనుకుంటున్నారు. మహిళలకు నెల నెలా రూ. 1000 ఇస్తానని నేను హామీయిచ్చాను. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాననే నమ్మకం నాకుంది. మీ సోదరుడు, కుమారుడినైన నన్ను నమ్మండి. ఎక్కువ రోజులు నన్ను జైలులో ఉంచలేరు. నేను త్వరలో బయటకు వచ్చి నా మాటను నిలబెట్టుకుంటాన”ని తన సందేశంలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Also Read: కేజ్రీవాల్ అరెస్టైనప్పుడు అందుకే స్వీట్లు పంచుకున్నారు: మనోజ్ తివారి
కేజ్రీవాల్ జైలు నుంచి బయటకెళ్లలేరు: సుఖేశ్
కేజ్రీవాల్, ఆయన బృందం అవినీతి బండారం బయట పెడతా నని మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. కేజ్రీవాల్ చేసిన 10 స్కామ్‌లు బయటపడబోతున్నాయని, వీటి సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని వెల్లడించాడు. ఢిల్లీ ఎక్సైజ్ కేసు ప్రారంభం మాత్రమేనని, కేజ్రీవాల్ ఇప్పట్లో తీహార్ జైలు నుంచి బయటకు వెళ్లలేరని తాను రాసిన లేఖలో పేర్కొన్నాడు. అవినీతి కేసులో కేజ్రీవాల్, కవితను త్వరలో సీబీఐ, ఈడీ ప్రశ్నిచబోతుందని జోస్యం చెప్పాడు.
Also Read: ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చిన అవెన్యూ కోర్టు.. ఈడీ కస్టడీ పొడిగింపు
ఈడీ కస్టడీలో కేజ్రీవాల్
కేజ్రీవాల్‌ను నేటి నుంచి 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించడంతో ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదయం ఈడీ కార్యాలయంలో కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, సౌత్ గ్రూప్ పాత్ర, 100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు.. శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులురెడ్డి సహా కవిత కోసం పనిచేసిన వ్యక్తులు ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారని సమాచారం.
