MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చిన అవెన్యూ కోర్టు‌.. ఈడీ కస్టడీ పొడిగింపు

లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ అవెన్యూ కోర్టు బిగ్ షాకిచ్చింది. కవిత ఈడీ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది.

MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చిన అవెన్యూ కోర్టు‌.. ఈడీ కస్టడీ పొడిగింపు

MLC Kavitha

Delhi Liquor Policy scam: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ సీబీఐ కోర్టు షాకిచ్చింది. కవిత ఈడీ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది. ఆమెను ఏడు రోజులు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఈనెల 16న కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈడీ కస్టడీ ముగియడంతో శనివారం రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో కవితను ఈడీ అధికారులు హాజరుపర్చారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ న్యాయవాది కోర్టుకు వివరించారు. మరికొందరితో కలిపి ఆమెను ప్రశ్నించాల్సి ఉందని, మరో ఐదు రోజులు కస్టడీని పొడిగించాలని ఈడీ న్యాయవాదులు కోరారు. వాదనలు ముగిసిన అనంతరం మరో మూడు రోజులు ఈడీ కస్టడీని పొడగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

Also Read : ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాలు.. ఆప్ ఎమ్మెల్యే నివాసంలో ఈడీ అధికారుల సోదాలు

ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుసేన్ కోర్టు ఎదుట వాదనలు వినిపించారు. కవిత ఈడీ విచారణకు సహకరించడం లేదు. మరో అయిదు రోజులు కస్టడీ కావాలని కోర్టును కోరారు. నలుగురు స్టేట్మెంట్ గురించి కవితను ప్రశ్నించామని, కిక్ బ్యాగ్స్ గురించి అడిగామని, ఫోన్ల డేటా గురించి ప్రశ్నించామని తెలిపారు. ఆమె ఫోన్ల డేటా డిలీట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబ ఆదాయపు పన్ను, వ్యాపారాల వివరాలు అడిగామని, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పారు. మేకా శరణ్ నివాసంలో సోదాలు  జరుగుతున్నాయని, సమీర్ మహేంద్ర ను ప్రశ్నించాల్సి ఉందని, ఇప్పటికీ ఇంకా సోదాలు జరుగుతున్నాయని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవిత తరపు న్యాయవాది రమేష్ గుప్తా తమ వాదనలు వినిపించారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కవిత డాక్యుమెంట్స్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బెయిల్ అప్లికేషన్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఈరోజే ఈడీకి నోటీసులు ఇవ్వాలని కవిత న్యాయవాది కోరారు. దీంతో కోర్టు బెయిల్ అప్లికేషన్ దాఖలుకు అనుమతిచ్చింది. అయితే, తనకు బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటీషన్ కవిత దాఖలు చేయడాన్ని ఈడీ వ్యతిరేకించింది. ప్రస్తుతం బెయిల్ కు విచారణ అర్హత లేదని ఈడీ న్యాయవాది అన్నారు. బెయిల్ అప్లికేషన్ పై సమాధానానికి ఐదు రోజుల సమయం సరిపోతుందని తదుపరి విచారణ తేదీ లోపు ఇప్పుడే నోటీసులు ఇవ్వాలని కవిత న్యాయవాది కోరారు.

Also Read : జైలు నుంచి ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ సందేశం.. చదివి వినిపించిన భార్య

ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కవిత కస్టడీని మూడు రోజులు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. ఈనెల 26వ తేదీన ఉదయం 11.30 గంటలకు కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఈడీని ఆదేశించింది. కస్టడీ పొడిగింపు తరువాత ఈడీ ఆఫీస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తరలించారు. కోర్టు ప్రాంగణంలో కవిత జై తెలంగాణ నినాదాలు చేశారు. తన అరెస్టు రాజకీయ కుట్ర అని, ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల అరెస్టు కక్ష సాధింపే, ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కవిత అన్నారు.