Bihar New CM: బిహార్ కొత్త సీఎం ఈయనే.. ఎవరీ సామ్రాట్ చౌదరి
2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. సామ్రాట్ చౌదరి పేరును విజయ్ కుమార్ సింహా ప్రతిపాదించగా రేణుదేవి, మంగళ్ పాండే, దిలీప్ జైస్వాల్ బలపరించారు.
- Naveen
- Updated on- April 14, 2026 / 07:00 PM IST
- 1990లో పొలిటికల్ ఎంట్రీ
- బలమైన ఓటు బ్యాంకు కలిగిన కుశ్వాహా సామాజికవర్గానికి చెందిన నేత
- 2000లో ఆర్జేడీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2018లో బీజేపీలో చేరిక
- 2024లో నితీశ్ క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు
Bihar New CM: బిహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి ఎన్నికయ్యారు. బీజేఎల్పీ సమావేశలో సామ్రాట్ చౌదరిని ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బిహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి రేపు ప్రమాణస్వీకారం చేస్తారు. రేపు 11 గంటలకు లోక్ భవన్ లో ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుంది. సామ్రాట్ చౌదరి ప్రస్తుతం బిహార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రేపు లోక్ భవన్ లో జరిగే సామ్రాట్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. బిహార్ లో తొలిసారిగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడనుంది.
2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. సామ్రాట్ చౌదరి పేరును విజయ్ కుమార్ సింహా ప్రతిపాదించగా రేణుదేవి, మంగళ్ పాండే, దిలీప్ జైస్వాల్ బలపరించారు. బిహార్ నూతన సీఎంగా ఎన్నికైన సామ్రాట్ చౌదరికి బీజేపీ అగ్రనేతలు అభినందనలు తెలిపారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా తనను ఎన్నుకోవడంపై సామ్రాట్ చౌదరి స్పందించారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన కేంద్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం పదవి మాత్రమే కాదని బిహార్ ప్రజల నమ్మకాన్ని, కలలను నెరవేరుస్తూ వారికి సేవ చేస్తానని చెప్పారు. కేంద్ర పెద్దల సూచనలతో బిహార్ ను అభివృద్ధి చేస్తానన్నారు.
2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం..
1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు సామ్రాట్ చౌదరి. 2000లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పర్బత్తా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రబ్రీదేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. 2010లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్ గా నియమితులయ్యారు. 2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జనతా దళ్(యూ)లో చేరి 2 జూన్ 2014న పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో బీజేపీలో చేరారు. బిహార్ ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
2024 జనవరి 28న నితీశ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సామ్రాట్.. బిహార్ డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. సామ్రాట్ చౌదరి బిహార్ లో బలమైన ఓటు బ్యాంకు కలిగిన కుశ్వాహా సామాజికవర్గానికి చెందిన నేత. కొంతకాలంగా నితీశ్ కుమార్ కూడా బహిరంగ సభల్లో సామ్రాట్ చౌదరిని తన వారసుడిగా సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. ముఖ్యంగా యువతలో మంచి పట్టు ఉండటం, పార్టీ విధేయుడిగా పేరు ఉండటం సామ్రాట్ కు కలిసొచ్చే అంశాలు. ఆయన నాయకత్వంలో బీహార్ లో బీజేపీని మరింత బలోపేతం చేయాలని కమలం పార్టీ భావిస్తోంది.
* బిహార్ సీఎం కానున్న తొలి బీజేపీ నేత
* కుశ్వాహా ఓబీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు
* తండ్రి శకుని చౌదరి కూడా రాజకీయ నేత
* వయసు 57 సంవత్సరాలు
* 1968 నవంబర్ లో ముంగర్ జిల్లాలో జననం
* తండ్రి శకుని 6సార్లు ఎమ్మెల్యే
* తల్లి పార్వతి ఒకసారి ఎమ్మెల్యే
Also Read: 850కి పెరగనున్న ఎంపీ స్థానాలు..! కేంద్రం కీలక నిర్ణయం, లోక్ సభలో సీట్ల పెంపునకు ప్రతిపాదన
