Covid Vaccine For Kids : పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే స్కూల్స్ తెరవచ్చు
కొవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నరగా పిల్లలకు తమ చదువుల్లో తీరని నష్టం ఏర్పడిందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.
- venkaiahnaidu
- Published On : June 27, 2021 / 06:22 PM IST
Guleria
Covid Vaccine For Kids కొవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నరగా పిల్లలకు తమ చదువుల్లో తీరని నష్టం ఏర్పడిందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. చిన్నారుల కోసం కొవిడ్ టీకా వస్తే పాఠశాలలు పునఃప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందని ఆయన తెలిపారు. పిల్లల కోసం కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అది కీలకమైన విజయమని.. తద్వారా పాఠశాలలను పునఃప్రారంభించటం సహా చిన్నారులు స్వేచ్ఛగా బహిరంగ కార్యాకలాపాల్లో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుందని ఎయిమ్స్ చీఫ్ తెలిపారు.
2-18 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్.. రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటా సెప్టెంబర్ నాటికి వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. దీనికంటే ముందే ఫైజర్ వ్యాక్సిన్.. చిన్నారులు కోసం అందుబాటులోకి వస్తే అది కూడా చిన్నారులకు ఒక ఆఫ్షన్ గా ఉంటుందని శనివారం ఓ ఇంటర్వ్యూలో గులేరియా తెలిపారు. జైడస్ వ్యాక్సిన్‌కు అనుమతి లభించినా అది కూడా మరో అవకాశంగా ఉంటుందని తెలిపారు. పిల్లలకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నా, అసలు లక్షణాలే లేకపోయినా కూడా వారి ద్వారా ఇతరులకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని గులేరియా హెచ్చరించారు. మహమ్మారి కోరల నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మరోవైపు, ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా సంస్థ తమ జైకోవ్-డి వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి త్వరలోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ వ్యాక్సిన్ ను పెద్దలతో పాటు చిన్నారులకూ ఇవ్వొచ్చునని ఆ సంస్థ తెలిపింది.
