NDA Alliance : కేంద్రంలో మళ్లీ ఎన్డీయే కూటమిదే అధికారం.. తేల్చిన సర్వే.. కానీ.. మొదలైన కష్టకాలం
NDA Alliance : సర్వే ప్రకారం.. ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొంది. ఈ కూటమికి 326 సీట్లు వస్తాయని.. అందులో భారతీయ జనతా పార్టీకే 261 సీట్లు వస్తాయని తెలిపింది.
India Today-CVoter Mood of the Nation survey
NDA Alliance : దేశంలో ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారు..? ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందా..? లేదంటే మోదీ విజయాల యాత్రకు ఇండియా కూటమి బ్రేక్ వేస్తుందా? జెన్జీ ఉద్యమాల దెబ్బకు బీజేపీ బలహీన పడుతుందా..? అనే ప్రశ్నలకు ఇండియాటుడే – సీవోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే క్లారిటీ ఇచ్చింది.
సర్వే ప్రకారం.. ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొంది. ఈ కూటమికి 326 సీట్లు వస్తాయని.. అందులో భారతీయ జనతా పార్టీకే 261 సీట్లు వస్తాయని తెలిపింది. ఇండియా కూటమికి 185 సీట్లు వస్తాయని.. అందులో కాంగ్రెస్ పార్టీ 106సీట్లు మాత్రమే వస్తాయని సర్వే వెల్లడించింది.
ఇండియాటుడే – సీవోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ ఈ ఏడాది జనవరిలోనూ సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం.. ఎన్టీయే కూటమికి 352 సీట్లు వస్తాయని పేర్కొంది. అయితే, ప్రస్తుతం నిర్వహించిన సర్వేలో మాత్రం ఎన్డీయే కూటమికి సీట్లు తగ్గాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. ముఖ్యంగా నిరుద్యోగం, పేపర్ లీకేజీలు వంటి అంశాల కారణంగా జెన్ జీలో పెరుగుతున్న ఆగ్రహావేశాలు ప్రభుత్వంపై గణనీయంగానే పడుతున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. అంతేకాదు.. ఉద్యోగాల కొరత, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలు యువతలో కేంద్ర ప్రభుత్వంపై క్రమంగా అసంతృప్తిని పెంచుతున్నాయని సర్వే పేర్కొంది.
తాజా సర్వే ప్రకారం.. ఎన్డీయే కూటమిపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నట్లు తేటతెల్లమవుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఎదురవుతున్న ఇబ్బందులు.. ఇలా అనేక సమస్యలను మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ ఇకనుంచి సరియైన పంథాలో డీల్ చేయకుంటే ఎన్నికల సమయం నాటికి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేఖత శాతం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి మోదీ సర్కార్ కు కష్టకాలం ప్రారంభమైందన్న వాదన కూడా తెరపైకి వస్తోంది.
ఇదిలాఉంటే.. దేశానికి ప్రధానిగా ఎవరు కావాలనే అంశంపై సర్వే జరపగా.. ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీకే ఓటు వేశారు. ప్రధాని పదవికి మోదీయే అర్హుడని సర్వేలో పాల్గొన్న 48.7శాతం మంది అభిప్రాయపడగా.. రాహుల్ కు 27.1శాతం మంది, మమతా బెనర్జీకి 2శాతం, అఖిలేశ్ యాదవ్ కు 1.7శాతం మంది, అరవింద్ కేజ్రీవాల్ కు 1.2శాతం మంది జై కొట్టారు.
అయితే, అనూహ్యంగా ఈ రేసులో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పేరు కూడా వచ్చింది. దేశ ప్రధానిగా విజయ్ అయితే బాగుంటుందని 9.2శాతం మంది పేర్కొన్నారు. ఫలితంగా సర్వేలో మూడో స్థానంలో విజయ్ నిలిచారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా ఈ జాబితాలో చేరాడు. దేశానికి అభిజిత్ ప్రధాని అయితే బాగుంటుందని 1.3శాతం మంది ప్రజలు పేర్కొన్నారు.
