Ayushman Bharat : ఆయుష్మాన్ భారత్ ఎనిమిదేళ్ల ప్రస్థానం.. ఎక్స్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
Ayushman Bharat : ఆయుష్మాన్ భారత్ (AB-PMJAY) ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా స్పందించారు.
- Harish Thanniru
- Published on- September 23, 2026 / 12:55 PM IST
Ayushman Bharat Scheme
Ayushman Bharat : దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మక పథకం ఆయుష్మాన్ భారత్ (AB-PMJAY) ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా స్పందించారు.
ఆయుష్మాన్ భారత్ కింద దేశవ్యాప్తంగా సుమారు 60 కోట్ల మంది లబ్ధిదారులు ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా రక్షణ పొందుతున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకంగా నిలిచిందన్న మోదీ.. దేశంలోని ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకు ఆరోగ్య సంరక్షణ సేవలను చేరువ చేయడంలో ఈ పథకం కీలకంగా మారిందన్నారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందని చెప్పారు.
ఇదిలాఉంటే.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 48.54 కోట్ల ఆయుష్మాన్ కార్డులు జారీ చేశారు. ఈ పథకం కింద నమోదైన 39 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో లబ్ధిదారులకు వైద్య సేవలు అందుతున్నాయి. ఇప్పటివరకు ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన వైద్య సేవలు అందించినట్లు నడ్డా పేర్కొన్నారు. పెరుగుతున్న వైద్య ఖర్చుల భారం సామాన్య ప్రజలపై పడకుండా చూడటంతో పాటు, అవసరమైన సమయంలో నాణ్యమైన చికిత్స పొందే అవకాశం కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ 2018లో ఝార్ఖండ్‌లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ఆరోగ్య రక్షణ కల్పించే ప్రధాన కేంద్ర ప్రభుత్వ పథకంగా ఇది కొనసాగుతోంది. వైద్య చికిత్స కోసం కుటుంబాలు భారీగా అప్పులు చేయాల్సిన పరిస్థితిని తగ్గించడంలో ఆరోగ్య బీమా కవరేజీ కీలకంగా మారిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.
