Bab el-Mandeb: బాబ్ అల్ మాండెబ్.. ఈ జలసంధి భారత్‌కు ఎందుకంత కీలకం.. క్లోజ్ అయితే కలిగే భారీ నష్టం ఏంటి?

హౌతీల హెచ్చరికతో ప్రపంచ దేశాల్లో మళ్లీ కలవరం మొదలైంది. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ భారత్ పైనా పడొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • Updated on- April 19, 2026 / 05:13 PM IST
  • ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో కలిపే కీలక మార్గం బాబ్ అల్ మాండెబ్
  • ఈ జలసంధి మూసివేతతో భారత విదేశీ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం
  • ఎగుమతులు, దిగుమతుల్లో అధిక భాగం ఈ జలసంధి ద్వారానే
  • నిత్యవసర ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఆందోళన

Bab el-Mandeb: హర్మూజ్ జలసంధి నుంచి నౌకల రవాణపై ఆంక్షలు ఉండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. దీంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. భారత్ పైనా ఈ ఎఫెక్ట్ ఉండనుందనే రూమర్స్ తో ఇటీవల పెట్రోల్ బంకుల ముందు వాహనాలు బారులు తీరడం మనం చూశాం. అయితే, ఇరాన్ తో మోదీ సర్కార్ జరిపిన చర్చలతో ఈ ముప్పు నుంచి మనం తప్పించుకున్నాం. అయితే, ప్రపంచ దేశాలకు త్వరలో మరో ముప్పు ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.

హర్మూజ్ జలసంధి లాగే మరో జలసంధికి సంబంధించి వస్తున్న వార్తలు కలవర పెడుతున్నాయి. బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసివేస్తామని హౌతీలు ప్రకటించడం ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక్కసారి జలసంధిని మూసివేస్తే దాన్ని తిరిగి తెరిపించడం ప్రపంచంలోని ఏ దేశం వల్ల సాధ్యం కాదని హౌతీ విదేశాంగ మంత్రి హుస్సేన్ హెచ్చరించారు.

హౌతీల హెచ్చరికతో ప్రపంచ దేశాల్లో మళ్లీ కలవరం మొదలైంది. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ భారత్ పైనా పడొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో కలిపే కీలక మార్గమైన బాబ్ అల్ మాండెబ్ జలసంధి మూసివేత మన విదేశీ వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని తెలుస్తోంది. యూరప్, నార్త్ ఆఫ్రికా, అమెరికా దేశాలకు మన ఎగుమతులు, దిగుమతుల్లో అధిక భాగం ఈ జలసంధి గుండానే వెళ్తాయి. బాస్మతి బియ్యం, టీ, కాఫీ, మసాలా దినుసులు, ఎలక్ట్రికల ఉపకరణాలు తదితర ఎగుమతులు నిలిచిపోనున్నాయి. అలాగే రష్యా, యూరోపియన్ దేశాల నుంచి వచ్చే ముడి చమురు కూడా ఈ జలసంధి నుంచే వస్తాయి. ఈ జలసంధి మూసివేతతో నౌకల ప్రయాణ దూరం పెరగనుంది. నౌకలన్నీ కూడా ఆఫ్రికా ఖండం చుట్టూ ప్రయాణించి భారత్ కు చేరుకుంటాయి.

ప్రయాణ దూరం 6వేల కిలోమీటర్లకు పైగా పెరుగుతుంది..

దీని వల్ల ప్రయాణ దూరం 6వేల కిలోమీటర్లకు పైగా పెరుగుతుంది. ప్రయాణ సమయం 15 నుంచి 20 రోజులకు పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా జరగడం వల్ల ఇంధన ఖర్చులతో పాటు బీమా ప్రీమియం కూడా భారీగా పెరుగుతుంది. దీని వల్ల ఆయా వస్తువుల ధరలు మరింతగా భారమయ్యే అవకాశాలు ఉన్నాయి. చమురు అవసరాల కోసం మన దేశం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. రవాణ మార్గం మారడం వల్ల చమురు ధరలు పెరిగితే అది దేశీయంగా రవాణ ఖర్చులను పెంచి నిత్యవసర ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఎక్స్ పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే మన వ్యవసాయ రంగానికి అవసరమైన పొటాష్ ఇతర ఎరువులను కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇవి కూడా ఈ మార్గం నుంచి రవాణ అవుతాయి. బాబ్ అల్ మాండెబ్ జలసంధి మూసివేస్తే ఎరువుల సరఫరాలో అంతరాయం ఏర్పడి వ్యవసాయ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపే చాన్స్ ఉంది.