ఢిల్లీలో పాపకు సర్జరీ ..1000కి.మీ దూరంలో తల్లి…విమానంలో తల్లి పాలు తరలింపు

పసిపాప‌ను బ‌తికించుకునేందుకు ఆ త‌ల్లిదండ్రులు ప‌డ‌రాని క‌ష్టాలు ప‌డుతున్నారు. ఢిల్లీలో స‌ర్జ‌రీ అవుతోన్న నెల రోజుల ప‌సిపాప‌కు ‌ప్ర‌తి రోజు విమానంలో లేహ్ నుంచి ఢిల్లీకి తల్లి పాల‌ను త‌ర‌లిస్తున్నారు.

ల‌డ‌ఖ్ లోని లేహ్ కు చెందిన ఓ గ‌ర్భిణి నెల రోజుల క్రితం పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. కానీ ఆ పాప‌కు ఆహార నాళం, శ్వాస నాళం రెండు క‌లిసిపోయాయి. స‌ర్జ‌రీ అవ‌స‌ర‌మ‌ని లేహ్ డాక్టర్లు చెప్పడంతో ఆ పాప‌ను ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు. అయితే అనారోగ్య కార‌ణాల వ‌ల్ల త‌ల్లి ఢిల్లీకి రాలేక‌పోయింది. త‌ల్లి పాలు బిడ్డ‌కు త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాల‌ని వైద్యులు చెప్పారు. రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గుతుంద‌న్నారు.

ఇక ఢిల్లీ నుంచి లేహ్ కు దూరం 1000 కిలోమీట‌ర్ల పైనే ఉంది. రోడ్డు మార్గాన త‌ల్లిపాలు త‌ర‌లించ‌డం క‌ష్టం. పాప తండ్రి స్నేహితుడొక‌రు లేహ్ ఎయిర్ పోర్టులో ప‌ని చేస్తున్నాడు. పాప కుటుంబ స‌భ్యులు లేహ్ ఎయిర్ పోర్టులో అత‌నికి త‌ల్లి పాల‌ను చేర‌వేరుస్తారు. అక్క‌డ్నుంచి విమాన సిబ్బందితో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు పంపిస్తున్నారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టుకు పాలు వ‌చ్చే స‌మ‌యానికి పాప తండ్రి అక్క‌డికి వెళ్ళి విమానాశ్ర‌యం నుంచి పాల‌ను తీసుకొచ్చి ఆ బిడ్డ‌కు ఇస్తున్నాడు. ఇలా గ‌త కొద్ది రోజుల నుంచి జ‌రుగుతోంది. పాప‌కు వైద్యులు ఆపరేషన్ చేస్తున్నారు. వ‌చ్చే వారం ప‌సిపాప డిశ్చార్జి అయ్యే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం.